గుంపుమేస్త్రికి ప్రధాన గూఢచారి సంతోష్‌రావు!
ABN , Publish Date - Jan 28 , 2026 | 04:31 AM
తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్‌కు దూరం చేసిన దుర్మార్గుడు సంతో్‌షరావు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు.
నేను చెప్పే దెయ్యాల్లో మొదటి దెయ్యం అతనే
హరీశ్, కేటీఆర్ ఎందుకు వత్తాసు పలుకుతున్నారు?
సంతో్‌షను సిట్ పిలవడం మంచిదే:కవిత
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
నిమ్స్ ఆస్పత్రిలో ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యకు పరామర్శ
నిమ్స్/హైదరాబాద్ సిటీ, జనవరి 27 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలకు కేసీఆర్‌కు దూరం చేసిన దుర్మార్గుడు సంతో్‌షరావు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత అన్నారు. తాను చెప్పిన దెయ్యాల్లో మొదటి దెయ్యం ఆయనేనని చెప్పారు. పోలీసులు నిజాయతీగా పనిచేస్తే సంతో్‌షరావుకు కచ్చితంగా శిక్ష పడుతుందన్నారు. అతనికి కేటీఆర్, హరీశ్ ఎందుకు వత్తాసు పలుకుతున్నారో అర్థం కావడం లేదని పేర్కొన్నారు. సంతో్‌షరావును సిట్ పిలవడం మంచిదేనని.. కానీ, ఆయనకు శిక్ష పడడం అనుమానమే అని చెప్పారు. నిజామాబాద్‌లో గంజాయి ముఠా దాడిలో తీవ్రంగా గాయపడిన ఎక్సైజ్ కానిస్టేబుల్ సౌమ్యను హైదరాబాద్‌లోని నిమ్స్ ఆస్పత్రిలో కవిత మంగళవారం పరామర్శించారు. అండగా ఉంటామని సౌమ్య కుటుంబానికి హామీ ఇచ్చారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడారు. గద్దర్ లాంటి నాయకులు గంటల కొద్దీ గేట్ బయట వేచి చూడడం, ఈటల రాజేందర్ లాంటి వారు బయటకు రావడానికి కూడా ఈ సంతో్‌షరావు ముఖ్య కారణమని ఆరోపించారు. గుంపు మేస్త్రికి ప్రధాన గూఢచారి సంతో్‌షరావు అన్నారు. కేసీఆర్ సమాచారాన్ని కూడా రేవంత్‌రెడ్డికి చేరవేసేది ఆయనే అని చెప్పారు. కేసీఆర్ ఫాంహౌ్‌సలో సగం ఇడ్లీ తిన్నారా? పూర్తిగా తిన్నారా? అన్న సమాచారాన్ని కూడా గుంపు మేస్త్రికి అందజేస్తాడని తెలిపారు. గుంపు మేస్త్రికి ప్రధాన గూఢచారి అయిన సంతో్‌షరావును శిక్షిస్తారన్న నమ్మకం తనకు లేదన్నారు. నిజంగా చట్టం తన పని తాను చేసుకుంటూ పోతే కచ్చితంగా ఆ దుర్మార్గుడికి శిక్ష పడుతుందని, రాజకీయ ఒత్తిళ్లకు లొంగకుండా పోలీసులు పని చేయాలని పేర్కొన్నారు. ఉద్యమకారులను కేసీఆర్‌కి దూరం చేసిన పాపం కచ్చితంగా ఆ దుర్మార్గుడికి తగులుతుందని అన్నారు.
ఎక్సైజ్, అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలి
ఒక ఎక్సైజ్ కానిస్టేబుల్‌నే చంపడానికి ప్రయత్నించారంటే గంజాయి బ్యాచ్‌కి ప్రభుత్వం అంటే ఏ మాత్రం భయం లేదని స్పష్టమవుతోందని కవిత అన్నారు. రాష్ట్రాన్ని మాదకద్రవ్యాల రహితంగా చేస్తామని ఈ ప్రభుత్వం హామీ ఇచ్చిందని.. కానీ, ప్రస్తుతం గ్రామాల్లో కూడా గంజాయి, డ్రగ్స్ దొరికే పరిస్థితి నెలకొందని చెప్పారు. ఇప్పటికైనా ప్రభుత్వం మత్తు వదిలి డ్రగ్స్, గంజాయి మాఫియాపై ప్రతాపం చూపాలని కోరారు. అలాగే ఎక్సైజ్, అటవీ సిబ్బందికి ఆయుధాలు ఇవ్వాలని సూచించారు.