Share News

తెలంగాణ ప్రజా జాగృతి

ABN , Publish Date - Apr 25 , 2026 | 06:12 AM

తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం తన రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. తెలంగాణ ప్రజా జాగృతి పేరిట (టీపీజే) ఆమె పార్టీని ప్రకటిస్తున్నారు.

తెలంగాణ ప్రజా జాగృతి

  • నేడు రాజకీయ పార్టీని ప్రకటించనున్న కవిత

  • మునీరాబాద్‌లో సభ.. ఉదయం 10 గంటలకు పార్టీ పేరు, జెండా ఆవిష్కరణ

  • పసుపు, ఆకుపచ్చ, నీలం రంగులతో జెండా

  • గన్‌పార్కులో అమరవీరులకు నివాళులు

  • తర్వాత ర్యాలీగా మునీరాబాద్‌కు కవిత

  • పార్టీ విధి విధానాలను వివరిస్తూ ప్రసంగం

  • 50 వేల మంది హాజరయ్యేలా ఏర్పాట్లు

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 24 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో మరో కొత్త రాజకీయ పార్టీ పురుడు పోసుకోనుంది. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత శనివారం తన రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. తెలంగాణ ప్రజా జాగృతి పేరిట (టీపీజే) ఆమె పార్టీని ప్రకటిస్తున్నారు. ఇంటి పార్టీ బీఆర్‌ఎస్‌తో విభేదాలు.. సస్పెన్షన్‌.. ఎమ్మెల్సీ పదవికి రాజీనామా.. ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలన్న లక్ష్యం నేపథ్యంలో.. కవిత కొత్త పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. పార్టీ జెండాను మూడు రంగుల (పసుపు, ఆకుపచ్చ, నీలం)తో సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. వీటిలో పసుపు రంగును శుభసూచకంగా, ఆకుపచ్చ రంగును రైతులు, వ్యవసాయ రంగానికి అండగా నిలుస్తామన్న సంకేత ఇచ్చేలా, నీలిరంగును బడుగు, బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తామన్న విధానంతో జెండాను రూపొందించినట్లు తెలిసింది. మేడ్చల్‌ సమీపంలోని మునీరాబాద్‌లో అద్వయ కన్వెన్షన్‌ సెంటర్‌తోపాటు దానిని ఆనుకొని ఉన్న 20 ఎకరాల్లో ఏర్పాటు చేసిన ప్రొఫెసర్‌ జయశంకర్‌ సభా ప్రాంగణం నుంచి కవిత కొత్త రాజకీయ పార్టీని ప్రకటించనున్నారు. ఇందుకుగాను శనివారం ఉదయం 7.30 గంటలకు బంజారాహిల్స్‌లోని తన నివాసం నుంచి కవిత ర్యాలీగా అమరవీరుల స్తూపం వద్దకు బయల్దేరతారు. 8.15 గంటలకు అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు.


అక్కడి నుంచి బయలుదేరి 9.30 గంటలకు అద్వయ కన్వెన్షన్‌ హాల్‌ వద్దకు చేరుకుంటారు. అక్కడ 10 గంటలకు పార్టీ, ప్రకటన జెండా ఆవిష్కరణ చేపట్టనున్నారు. అనంతరం తమ పార్టీ విధి విధానాలను వివరిస్తూ.. రాజకీయ పార్టీ ఏర్పాటు ఆవశ్యకత, ప్రజల కోసం తాము ఏం చేయదలచుకున్నది ప్రసంగం ద్వారా వెల్లడించనున్నారు. ఈ సందర్భగా కవిత గంటన్నరపాటు ప్రసంగించనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన ఉద్యమకారులు, మేధావులను ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నట్లు జాగృతి శ్రేణులు తెలిపాయి. ఇక తెలంగాణలోని 33 జిల్లాల నుంచి 50 వేల మందికి పైగా ఉద్యమకారులు, మేధావులు, కవిత మద్దతుదారులు, జాగృతి కార్యకర్తలు హాజరయ్యే విధంగా ఏర్పాట్లుచేశారు.


నిరంతర పోరాటాలే విధి విధానాలు..

తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా తమ పార్టీ విధి విధానాలు ఉంటాయని, ప్రజా సమస్యలపై ఎప్పటి కప్పుడు ఉద్యమిస్తూ.. వాటి పరిష్కారం దిశగా పోరాడతామని జాగృతి శ్రేణులు చెబుతున్నాయి. ఎక్కడ ఏ సంఘటన జరిగినా.. బాధితుల పక్షాన నిలవాలన్న ఆకాంక్షతో తమ నాయకురాలు ఈ పార్టీని స్థాపించారని తెలిపాయి. కవిత తన కొత్త పార్టీతో ప్రజాక్షేత్రంలోకి వెళ్లడమే కాకుండా.. ఇటు అధికార కాంగ్రెస్‌పై, అటు తనను బయటకు పంపిన బీఆర్‌ఎ్‌సపై, కేంద్రంలోని బీజేపీపై పోరాటం సాగిస్తారని జాగృతి నేతలు వెల్లడించారు. రెండు దశాబ్దాల క్రితం ప్రారంభించిన తెలంగాణ స్వరాష్ట్ర సాధన ఉద్యమంలో ఇక్కడి సాంస్కృతిక వైభవాన్ని ఓ విప్లవంలా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కవిత తెలంగాణ జాగృతిని స్థాపించారు. ఆమె తన 20 ఏళ్ల ప్రజా జీవితంలో ఎన్నో మైలురాళ్లను చేరుకోవడంతోపాటు మరెన్నో ఇబ్బందులను అధిగమిస్తూ వచ్చారు. తెలంగాణ హక్కుల పరిరక్షణ కోసం స్వీయ రాజకీయ శక్తిగా నిలిచేందుకు ఆమె కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు జాగృతి నేతలు చెబుతున్నారు.


ప్రాంగణం, ద్వారాలకు ప్రముఖుల పేర్లు..!

కొత్త పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో భాగంగా.. తెలంగాణ ప్రాముఖ్యత ప్రతిబింబించేలా ఆయా ప్రాంగణాలకు ప్రముఖుల పేర్లను పెట్టారు. సభా ప్రాంగణానికి ప్రొఫెసర్‌ జయశంకర్‌ పేరును, ప్రధాన ద్వారానికి ప్రజాకవి కాళోజీ నారాయణరావు ద్వారం, ఇతర ద్వారాలకు రాణి రుద్రమదేవి, మారోజు వీరన్న, చాకలి ఐలమ్మ పేర్లను పెట్టారు. భోజన శాలలకు సురవరం ప్రతాపరెడ్డి, సమ్మక్క సారలమ్మ, షోయబుల్లాఖాన్‌ (మీడియా) భోజనశాలగా పేర్లను నిర్ణయించారు. కాగా, పార్టీ ఆవిర్భావ సభను విజయవంతం చేయాలంటూ చార్మినార్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి పుప్పాల రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిజిటల్‌ బోర్డులను శుక్రవారం కవిత ఆవిష్కరించారు.


తెలంగాణ రుచులతో 34 రకాల వంటకాలు..

కవిత కొత్త పార్టీ ఆవిర్బావానికి విచ్చేస్తున్న వారికి తెలంగాణ రుచులతో ప్రత్యేకంగా భోజనాలను ఏర్పాటు చేస్తున్నట్లు జాగృతి విభాగాలు తెలిపాయి. పార్టీ కార్యకర్తలు, అతిథులకు మధ్యాహ్న భోజనం కోసం 34 రకాల వంటకాలను సిద్ధం చేస్తున్నామని వెల్లడించాయి. నాన్‌వెజ్‌లో తలకాయ కూర, బోటి ఫ్రై, తెలంగాణ మటన్‌ కర్రీ, నాటుకోడి పులుసు, బొమ్మిడాల పులుసు, హైదరాబాదీ చికెన్‌ దమ్‌ బిర్యానీ, మిర్చికా సాలాన్‌, ఎగ్‌ ఇగురు వడ్డించనున్నట్లు చెప్పారు. వెజిటేరియన్‌లో బగారా బైగన్‌ మసాలా కర్రీ, కందగడ్డ ఫ్రై, పాలకూర, మామిడి పప్పు, ఆలూ టమాటా, చామగడ్డ పులుసు, కట్‌ చారు సిద్థం చేస్తున్నామన్నారు. తెలంగాణ ప్రత్యేక వంటకాలుగా పేరుగాంచిన మక్క గారెలు, జొన్నరొట్టె, సర్వపిండి, బూరెలు, అరిసెలు, మజ్జిగ, రాగి అంబలి, బటర్‌ స్కాచ్‌ ఐస్‌క్రీమ్‌, షాహి తుక్‌డా, జిలేబీ కూడా మెనూలో ఉన్నాయి. వీటితోపాటు బగారా రైస్‌, వైట్‌రైస్‌, సాంబార్‌, రోటిపచ్చడి, దోశ, ఆవకాయ, మిర్చిబజ్జీ, పచ్చిపులుసు, పాపడ్‌, పెరుగు, రైతా కూడా ఉంటాయని నిర్వాహకులు వెల్లడించారు.

Updated Date - Apr 25 , 2026 | 06:13 AM