Share News

కేసీఆర్‌ను జాగృతి పార్టీలోకి ఆహ్వానిస్తా

ABN , Publish Date - Mar 11 , 2026 | 05:15 AM

తాను ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అవసరమైతే కేసీఆర్‌నే తన జాగృతి పార్టీలోకి ఆహ్వానిస్తానన్నారు.

కేసీఆర్‌ను జాగృతి పార్టీలోకి ఆహ్వానిస్తా

  • బీఆర్‌ఎస్‌లోకి నేను మళ్లీ వెళ్లేదిలేదు.. డాడీ, మోడీ, రేవంత్‌తో కొట్లాట.. జైలు నన్ను జగమొండిని చేసింది

  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత

  • ఖమ్మంలో దీక్షను భగ్నం చేసిన పోలీసులు

  • అరెస్టు చేసి హైదరాబాద్‌కు తరలింపు

  • జాగృతి కార్యాలయం వద్ద దీక్ష కొనసాగింపు

హైదరాబాద్‌/ఖమ్మం క్రైం, మార్చి 13 (ఆంధ్రజ్యోతి): తాను ఎట్టిపరిస్థితుల్లోనూ తిరిగి బీఆర్‌ఎస్‌లోకి వెళ్లే ప్రసక్తే లేదని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అవసరమైతే కేసీఆర్‌నే తన జాగృతి పార్టీలోకి ఆహ్వానిస్తానన్నారు. రాజకీయంగా డాడీ, మోడీ, రేవంత్‌రెడ్డి తనకు ప్రత్యర్థులని, వారితోనే తన రాజకీయ కొట్లాట ఉంటుందని స్పష్టం చేశారు. తాను రాసిన లేఖ లీకైన నాటినుంచి ఇప్పటివరకు కేసీఆర్‌, కేటీఆర్‌తో మాట్లాడలేదని తెలిపారు. తన తల్లితో ఎమోషనల్‌గా మాత్రమే మాట్లాడుతున్నానని చెప్పా రు. వెలుగుమట్ల భూదాన్‌ భూముల బాధితులకు న్యాయం చేయాలంటూ ఖమ్మంలోని అంబేడ్కర్‌ భవన్‌ వద్ద కవిత చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను భగ్నం చేస్తూ పోలీసులు మంగళవారం తెల్లవారుజామున ఆమెను అరెస్టు చేసి హైదరాబాద్‌కు తీసుకొచ్చారు. అయితే బాధితుల కు న్యాయం చేసేవరకు దీక్ష కొనసాగుతుందంటూ జాగృతి కార్యాలయం వద్ద కవిత మళ్లీ దీక్షకు దిగారు. ఈ సందర్భంగా ఓ మీడియాలో మాట్లాడుతూ.. 2022 మే నెలలో తనపై కేసు నమోదు చేసినప్పటి నుంచి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పారు. తనకు ఎవరి మద్దతూ లేదనే బాధ వేసిందని, అందరినీ ట్రోల్‌ చేసే బీఆర్‌ఎస్‌ సోషల్‌ మీడియా తనకు అండగా నిలవలేదని అన్నారు. తెలంగాణ అస్థిత్వంగా, తెలంగాణ మదర్‌ బోర్డుగా పనిచేసే పార్టీ వస్తుందని తెలిపారు.


జైలు జగమొండిని చేసింది..

‘‘జైలు నన్ను జగమొండిని చేసింది. ఇందుకు కారణమైన వారు తప్పకుండా అనుభవిస్తారు. జాతీయ రాజకీయాల్లో నాకు శత్రువులు ఎవరన్నది కాదు. మనకు నష్టం చేస్తున్నది ఎవరనేది గుర్తించాలి. మోదీ, డాడీ, రేవంత్‌తో కొట్లాడాలి. వారు శత్రువులా? కాదా? అన్నది కాదు. ప్రత్యర్ధులన్నది ముఖ్యం. మా పార్టీ నిలబడాలంటే ప్ర త్యర్ధులతో కొట్లాడాల్సిందే’’ అని కవిత స్పష్టం చేశారు.

వెలుగుమట్ల బాధితులకు కొత్త ఇళ్లు కట్టించాలి..

వెలుగుమట్ల బాధితుల గోడును పట్టించుకోవాలని, అక్కడ కూల్చిన ఇళ్ల స్థానంలోనే కొత్త ఇళ్లు కట్టించాలని కవిత డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం హామీ ఇచ్చేవరకు తన నిరాహార దీక్ష కొనసాగుతుందన్నారు. రాష్ట్రంలో పేదల భూములను కబ్జా చేస్తున్నారని, వెలుగుమట్లలో భూముల రేట్లు పెరగటంతో పేదల ఇళ్లు కూల్చి ఆ స్థలాన్ని పెద్దలకు కట్టబెట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. రాజ్యాంగం పట్టుకొనే మాట్లాడే రాహుల్‌గాంధీ ఎందుకు స్పందించటం లేదని ప్రశ్నించారు. కాగా, ఖమ్మంలో కవితతో పాటు.. బీసీ, ఎస్సీ, ఎస్టీ జేఏసీ చైర్మన్‌ విశారదన్‌ మహారాజ్‌ చేపట్టిన నిరాహార దీక్షను పోలీసులు మంగళవారం తెల్లవారుజామున భగ్నం చేశారు.

Updated Date - Mar 11 , 2026 | 05:15 AM