Share News

అన్నలంతా మా పార్టీలోనే..అడవిలో లేరు కదా అనుకోకండి.. అధికారులూ జాగ్రత్తగా ఉండండి

ABN , Publish Date - Jun 17 , 2026 | 05:12 AM

అడవిలో అన్నలు లేరు.. మమ్మల్ని ఏమీ చేయలేరని అధికారులు అనుకుంటున్నారేమో!.. అన్నలంతా ఇప్పుడు మా పార్టీలోనే ఉన్నారు..

అన్నలంతా మా పార్టీలోనే..అడవిలో లేరు కదా అనుకోకండి.. అధికారులూ జాగ్రత్తగా ఉండండి

  • మేం సింగరేణికి వస్తున్నామంటేనే ప్రభుత్వానికి వణుకు పుడుతోంది

  • తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత

శ్రీరాంపూర్‌/కౌటాల, జూన్‌ 16(ఆంధ్రజ్యోతి): ‘అడవిలో అన్నలు లేరు.. మమ్మల్ని ఏమీ చేయలేరని అధికారులు అనుకుంటున్నారేమో!.. అన్నలంతా ఇప్పుడు మా పార్టీలోనే ఉన్నారు.. జాగ్రత్త బిడ్డా’ అని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత హెచ్చరించారు. తాము సింగరేణి కార్మికులను కలిసేందుకు వస్తే పోలీసులను పెట్టి అడ్డుకుంటున్నారని, తాము వస్తున్నామంటే ప్రభుత్వానికి భయం పుడుతోందన్నారు. తాము తల్లి కాంగ్రెస్‌తోనే కొట్లాడామని, పిల్ల కాంగ్రెస్‌ తమకో లెక్కా అని ఆమె అన్నారు. ‘బాయిబాట’ కార్యక్రమంలో మంగళవారం ఆమె మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్‌ ఏరియాకు వెళ్లి కార్మికులతో మాట్లాడారు. కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా పర్యటనలో కౌటాల మండలం తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత జన్మస్థలిని సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కాంట్రాక్టర్లకు క్రమం తప్పకుండా డబ్బులు ఇస్తున్న యాజమాన్యం.. గనిలో కార్మికులకు రక్షణ పరికరాలు కొనేందుకు, వారి వైద్యానికి డబ్బు లేదని చెబుతోందని మండిపడ్డారు. అన్నలంతా ఇప్పుడు తమ పార్టీలోనే ఉన్నారని, జాగ్రత్తగా ఉండాలని అధికారులను హెచ్చరించారు. కార్మికుల హక్కులను ఉల్లంఘిస్తే ఊరుకోబోమన్నారు. రాష్ట్రంలో ఐదుగురు ముఖ్యమంత్రులు మారినా తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టు నిర్మించలేకపోయారని విమర్శించారు. ప్రాణహిత నది తీరాన ఆమె పూజలు చేశారు. అక్కడ బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. అధికారంలోకి రాగానే ప్రాణహిత ప్రాజెక్టు చేపడతామని గొప్పలు చెప్పిన రేవంత్‌ రెడ్డి 30 నెలలు గడిచినా ముందుకు సాగలేదని విమర్శించారు. మాజీ కేసీఆర్‌ 148 మీటర్ల ఎత్తుతో ఒప్పందం కుదుర్చుకున్నారని, ఆ ఒప్పందంతోనైనా ప్రాజెక్టు నిర్మాణం చేపడితే బాగుంటుందన్నారు. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం 150 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణం చేపడతామని చెవిలో పువ్వులు పెడుతోందని విమర్శించారు. ఇదంతా కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డిపైకి నెడుతున్నారని, అసలు కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మించే ఉద్దేశం లేదన్నారు.

Updated Date - Jun 17 , 2026 | 05:12 AM