Share News

బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే!

ABN , Publish Date - Feb 18 , 2026 | 06:11 AM

రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ పొత్తుకు మునిసిపల్‌ ఎన్నికలే తొలిమెట్టు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అభివర్ణించారు.

బీఆర్‌ఎస్‌, బీజేపీ ఒక్కటే!

  • మునిసిపల్‌ ఎన్నికలే సాక్ష్యం

  • గతంలో నేను చెప్పిందే నిజమైంది

  • హామీల అమలుపై ప్రజాభవన్‌ ముట్టడి

  • కాంగ్రెస్‌ సర్కార్‌ స్పందించకుంటే రాష్ట్రవ్యాప్త ఆందోళనలు

  • జాగృతి అధ్యక్షురాలు కవిత

హైదరాబాద్‌ /బేగంపేట,ఫిబ్రవరి 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌, బీజేపీ పొత్తుకు మునిసిపల్‌ ఎన్నికలే తొలిమెట్టు అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అభివర్ణించారు. కరీంనగర్‌, నారాయణపేట్‌ చైర్మన్‌ ఎన్నికలో గులాబీ పార్టీ వ్యూహాత్మకంగా త ప్పుకోవడం వల్లే.. కమలం పార్టీ ఛైర్మన్‌, మేయర్‌ పదవులను దక్కించుకుందని ఆమె విమర్శించారు. ఆ రెండు పార్టీల దోస్తీపై తాను గతంలో చేసిన వ్యాఖ్యలు నిజమని ఈ ఎన్నికల్లో తేలిందన్నారు. నారాయణ్‌పేట్‌లో తమ పార్టీకి దక్కాల్సిన వైస్‌ చైర్మన్‌ పదవిని ఈ రెండు పార్టీలు కలిసి అడ్డుకున్నాయని ఆమె ఆరోపించారు. మంగళవారం జాగృతి మహిళా విభాగం ఆధ్వర్యంలో ప్రజాభవన్‌ వద్ద జరిగిన ఆందోళనలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే, విపక్షాల మధ్య ఉన్న రహస్య స్నేహాన్ని ఎండగట్టారు. ఎన్నికల హామీలను నెరవేర్చడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ప్లకార్డులను ప్రదర్శిస్తూ రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. ఈ సందర్భంగా కవిత మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని డిమాండ్‌ చేశారు. ఈ నెలలో ప్రవేశపెట్టే బడ్జెట్‌లో.. కళ్యాణలక్ష్మి, తులం బంగారం హామీ సహా పెన్షన్ల పెంపుకు అవసరమైన నిధులు కేటాయించాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన చేపడతామని హెచ్చరించారు. అనంతరం ప్రజావాణి స్పెషల్‌ ఆఫీసర్‌ దివ్యా దేవరాజన్‌ ను కలిసి పలు డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందజేశారు. జాగృతి మహిళా, విద్యార్థి విభాగం నేతలతో కలిసి కవిత చేపట్టిన ముట్టడి కార్యక్రమం పోలీసులతో వాగ్వాదానికి దారితీసింది. శాంతియుతంగా వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చిన తమపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని కవిత మండిపడ్డారు. ప్రజావాణిలో రోజూ ప్రజలను కలుస్తానని చెప్పిన సీఎం.. ఒక్కరోజు మాత్రమే ఇక్కడికి వచ్చారని ఆమె గుర్తుచేశారు.


అంగన్‌వాడీల్లో రాజకీయ జోక్యమా ?

అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ రాజకీయ జోక్యాన్ని పెంచేలా.. ప్రభుత్వం జారీచేసిన జీవోపై కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు. మహిళా, శిశు సంక్షేమంలో కీలక పాత్ర పోషిస్తున్న ఉద్యోగులను గౌరవించాల్సింది పోయి, అవమానించడం సరి కాదని హితవు పలికారు. జీతాలు ఆపేయడంవల్ల ఆయా కుటుంబాలు ఎలా గడుస్తాయంటూ ఆమె ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Updated Date - Feb 18 , 2026 | 06:12 AM