పేదలకు భూదాన్ భూములు
ABN , Publish Date - Mar 12 , 2026 | 05:01 AM
రాష్ట్రంలోని 1.74 లక్షల ఎకరాల భూదాన్ భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు.
మేం అధికారంలోకి రాగానే ఇస్తాం
1.74 లక్షల ఎకరాలపై ప్రభుత్వ పెద్దల కన్ను పడింది
పేదల ఇళ్లు కూల్చిన అధికారులపై కేసు పెట్టాలి: కవిత
నిరాహార దీక్ష విరమణ
పంజాగుట్ట, మార్చి 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని 1.74 లక్షల ఎకరాల భూదాన్ భూములపై ప్రభుత్వ పెద్దల కన్ను పడిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ఆరోపించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే భూదాన్ భూములను పేదలకు పంచుతామని చెప్పారు. ఖమ్మంలోని వెలుగుమట్ల భూదాన్ భూముల బాధితులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో కవితతోపాటు ధర్మ సమాజ్ పార్టీ(డీఎస్పీ) అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ చేపట్టిన నిరాహార దీక్షను బుధవారం విరమించారు. జాతీయ బీసీ కమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ వి.ఈశ్వరయ్య వారికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. దీక్ష పూర్తిగా విరమణ కాదని, విరామం మాత్రమేనని అన్నారు. ‘‘బాధితులను అవహేళన చేస్తూ వారికి భూమి మీద హక్కులు లేవంటూ మాట్లాడారు. సంఘటన తర్వాత చాలా పార్టీల నాయకులు టూరిస్టుల మాదిరిగా బాధితుల వద్దకు వెళ్లారు. కానీ, వారి సమస్య పరిష్కారం కోసం పోరాటం చేయలేదు. అత్యంత దుర్మార్గంగా వెలుగుమట్లలో భూదాన్ బోర్డు ఇచ్చిన భూమిలో నివసిస్తున్న పేదల ఇళ్లను రాష్ట్ర ప్రభుత్వం కూల్చేసింది. ఉప ముఖ్యమంత్రి, ఇద్దరు మంత్రులు పేదలను ఖాళీ చేయించి పెద్దలకు అప్పగించాలని నిర్ణయించారు. తొలుత ఆక్రమణలు జరిగాయన్న ప్రభుత్వం.. ఇప్పుడు నిస్సిగ్గుగా అర్హులు ఉన్నారని చెబుతోంది. అర్హులైన పేదల ఇళ్లు కూల్చిన అధికారులపై ముందు కేసు పెట్టాలి’’ అని కవిత అన్నారు. ఇళ్ల స్థలాల లే అవుట్ వేసి, ప్రతి కుటుంబానికి వారి స్థలం ఎక్కడుందో చూపించాలని డిమాండ్ చేశారు. తమ పోరాటానికి ప్రస్తుతం విరామం మాత్రమే ఇచ్చామని, బాధితులకు సంపూర్ణ న్యాయం జరిగే వరకు వదలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పారు. విశారదన్ మాట్లాడుతూ.. సీఎం, మంత్రులు, అధికారులు అందరూ కలిసికట్టుగా ఆత్మహత్య చేసుకున్నట్లయిందని అన్నారు. ఈ విజయాన్ని బాధితులకు అంకితం చేస్తున్నామని చెప్పారు. ప్రభుత్వానికి బుద్ధి చెప్పేందుకే ఉద్యమం ప్రారంభించినట్లు ఈశ్వరయ్య తెలిపారు.