Telangana Jagruthi leader Kavitha: కేసీఆర్..సభకు రావాలి
ABN , Publish Date - Jan 03 , 2026 | 03:50 AM
కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా, సభలో మాట్లాడకుండా ఉంటే ఇక బీఆర్‌ఎస్‌ను దేవుడు కూడా కాపాడలేడని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు.
ఆరోపణలపై మాట్లాడి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి
లేకుంటే బీఆర్‌ఎస్‌ను దేవుడు కూడా కాపాడలేడు
పాలమూరు-రంగారెడ్డిని జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారో కేసీఆరే వచ్చి చెప్పాలి
పాలమూరులో ప్యాకేజీ అమ్ముకున్న హరీశ్‌రావు
ఆయన వల్లే ఆ ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడింది
కేటీఆర్, హరీశ్ పిల్లకాకులు.. నాన్న నీడలో పెరిగారు
కేసీఆర్ పిలిచినా ఇక బీఆర్‌ఎ్‌సలోకి వెళ్లను
5న మండలిలో రాజీనామా కారణాలు చెప్తా: కవిత
హైదరాబాద్, జనవరి 2 (ఆంధ్రజ్యోతి): కేసీఆర్ అసెంబ్లీకి రాకుండా, సభలో మాట్లాడకుండా ఉంటే ఇక బీఆర్‌ఎస్‌ను దేవుడు కూడా కాపాడలేడని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. పాలమూరు-రంగారెడ్డి ఇన్‌టేక్ పాయింట్‌ను జూరాల నుంచి శ్రీశైలానికి ఎందుకు మార్చారో ఆయనే స్వయంగా అసెంబ్లీకి వచ్చి సమాధానం చెప్పాలని కోరారు. శుక్రవారం శాసనమండలి ఆవరణలో ఆమె మీడియాతో చిట్ చాట్‌గా మాట్లాడారు. బబుల్ షూటర్ల(బుడగలు పేల్చేవారి) వల్లే పార్టీకి ట్రబుల్స్ వచ్చాయని వ్యాఖ్యానించారు. హరీశ్ కారణంగానే మొదటి ప్యాకేజీ దెబ్బతిందని, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడిందని ఆరోపించారు. ‘‘రేవంత్‌తో కేసీఆర్ మాటలు పడాల్సిన అవసరం ఏముంది? తెలంగాణ ప్రజల కోసం అసెంబ్లీకి వచ్చి మాట్లాడి, తన చిత్తశుద్ధి నిరూపించుకోవాలి’’ అని డిమాండ్ చేశారు. బబుల్ షూటర్లకు పెత్తనమిచ్చి సభలో మాట్లాడిస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని చెప్పారు. పాలమూరులో ప్యాకేజీని అమ్ముకున్న హరీశ్‌రావు కాకుండా పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్ వచ్చి మాట్లాడితే బాగుంటుందని అన్నారు. పాలమూరు-రంగారెడ్డి విషయంలో అక్రమాలకు పాల్పడిన వారిని బీఆర్‌ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌ను చేయడం కన్నా అన్యాయం మరొకటి లేదని వ్యాఖ్యానించారు. హరీశ్ సభలో మాట్లాడితే కాంగ్రె్‌సతో మ్యాచ్ ఫిక్సింగ్ అవుతుందన్నారు. గతంలో రేవంత్‌రెడ్డి ఛాంబర్‌కు వెళ్లి హరీశ్‌రావు ప్రత్యేకంగా మాట్లాడుకున్నది అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. అలాంటి వ్యక్తికి నీళ్ల గురించి మాట్లాడే అవకాశమిస్తే బీఆర్‌ఎ్‌సకు నష్టమేనని చెప్పారు.
వాళ్లిద్దరూ పిల్లకాకులు
బీఆర్‌ఎ్‌సలో కేటీఆర్, హరీశ్‌లిద్దరూ పిల్లకాకులేనని, కేసీఆర్ డైరెక్షన్‌లో పని చేస్తున్నారన్నారని, తాను మాత్రం మొదటి నుంచి స్వతంత్రంగా పని చేశానని కవిత అన్నారు. బీఆర్‌ఎ్‌సపై పూర్తిగా మనసు విరిగిందని, కేసీఆర్ పిలిచినా మళ్లీ వెళ్లే ప్రసక్తే లేదని చెప్పారు. తెలంగాణకు స్వీయ రాజకీయ శక్తి అవసరమని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సొంత పార్టీ ద్వారా ఎన్నికల్లో పోటీ చేస్తానని అన్నారు. తాను సెప్టెంబరు 3న రాజీనామా చేశానని, నాలుగు నెలలుగా ఆమోదించలేదని, ఈ నేపథ్యంలో శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డిని కలిశానని తెలిపారు. ఈ నెల 5న మండలిలో మాట్లాడతానని, ఎమ్మెల్సీ పదవికి ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో ప్రజలకు వివరిస్తానని ప్రకటించారు. కేసీఆర్‌ను కసబ్‌తో పోల్చడంపై కూతురుగా తన రక్త మరుగుతోందని కవిత అన్నారు. సీఎం తన మాట తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. పాలమూరుకు తీరని అన్యాయం చేస్తున్న రేవంత్‌రెడ్డిని ఎన్నిసార్లు ఉరి తీయాలని ప్రశ్నించారు.రాయలసీమ లిఫ్ట్ పథకాలపై కోర్టు స్టేలు ఉన్నప్పటికీ చంద్రబాబు, జగన్ రాజకీయాలకు అతీతంగా నిర్మాణ పనులు కొనసాగించారని చెప్పారు.