బీఆర్‌ఎస్‌కు సినిమా ముందుంది
ABN , Publish Date - Feb 15 , 2026 | 07:29 AM
మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ దారుణంగా విఫలమైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గతంలో మునిసిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్..
మునిసిపల్ ఎన్నికలు ట్రైలర్ మాత్రమే
ప్రత్యామ్నాయం లేకే కాంగ్రెస్‌కు ఓట్లు
ఉత్తర తెలంగాణలో బీఆర్‌ఎస్, బీజేపీ పొత్తుకు ఈ ఎన్నికలు తొలిమెట్టు
సీపీఐకి తోక పార్టీగా బీఆర్‌ఎస్: కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 14 (ఆంధ్రజ్యోతి): మునిసిపల్ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ దారుణంగా విఫలమైందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. గతంలో మునిసిపల్ శాఖ మంత్రిగా పనిచేసిన కేటీఆర్.. బీఆర్‌ఎస్‌కు 17 మునిసిపాలిటీలు వచ్చుడే ఎక్కువ అన్నట్లుగా మాట్లాడారని ఎద్దేవా చేశారు. ఈ ఎన్నికలు ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ప్రజలకు మరో ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే కాంగ్రెస్ కు ఓటు వేశారని చెప్పారు. శనివారం ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ అంబటి జోజిరెడ్డి, హెచ్‌ఎంఎస్ ప్రధాన కార్యదర్శి రియాజ్ అహ్మద్‌తో కలిసి జాగృతి కార్యాలయంలో కవిత మీడియా సమావేశంలో మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలను నిలబెట్టుకోకుండానే మునిసిపల్ ఎన్నికల్లో ఎక్కువ స్థానాలు గెలిచిందని విమర్శించారు. ఇక ప్రజలు తమకు గుడి కట్టారంటూ ప్రచారం చేసుకుంటున్న బీఆర్‌ఎస్.. చాలాచోట్ల మూడు, నాలుగు స్థానాలకు పడిపోయిందని ఎద్దేవా చేశారు. తెలంగాణకు రూపాయి కూడా ఇవ్వని బీజేపీ.. కరీంనగర్ మేయర్ స్థానం తప్ప అన్నిచోట్లా అష్టకష్టాలు పడిందన్నారు. కానీ, తమలాంటి కొత్తవారిని ప్రజలు ఆదరించారని చెప్పారు. త్వరలోనే తాము రాజకీయ పార్టీగా మారబోతున్నామని, ఎన్నికలకు సమయం తక్కువగా ఉన్నప్పటికీ తమ కార్యకర్తల ఒత్తిడి మేరకు ఫార్వర్డ్ బ్లాక్‌తో కలిసి పోటీ చేశామని చెప్పారు. అయినా ప్రజలు తమను 40 స్థానాల్లో గెలిపించారని, వడ్డేపల్లి మునిసిపాలిటీలో స్పష్టమైన మెజారిటీ కట్టబెట్టారని తెలిపారు. అయితే తమ వారిని ప్రలోభపెట్టి లాక్కునేందుకు కాంగ్రెస్ నేతలు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. నారాయణపేట మునిసిపాలిటీలో తమకు వైస్ చైర్మన్ పదవిని ఆఫర్ చేస్తున్నారని, దీనిపై స్థానిక నాయకత్వాన్నే నిర్ణయం తీసుకోవాల్సిందిగా సూచించామని పేర్కొన్నారు.
బీఆర్‌ఎస్, బీజేపీ పరస్పర సహకారం..
ఈ ఎన్నికల్లో ఉత్తర తెలంగాణలో బీజేపీ, బీఆర్‌ఎస్ పరస్పరం సహకరించుకున్నాయని కవిత ఆరోపించారు. ఆ రెండు పార్టీల పొత్తుకు దీనిని తొలిమెట్టుగా భావించాలన్నారు. కొత్తగూడెంలో సీపీఐ అడగకుండానే మద్దతిస్తామని కేటీఆర్ అంటున్నారని, గతంలో తోక పార్టీ అన్న పార్టీకే ఇప్పుడు బీఆర్‌ఎస్ తోక పార్టీగా మారిందని ఎద్దేవా చేశారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కాళేశ్వరం విషయంలో అసెంబ్లీలో కేసీఆర్‌పై ఆరోపణలు చేశారని, ఇప్పుడు ఆ పార్టీకి మద్దతివ్వడమంటే కేసీఆర్‌పై చేసిన ఆరోపణలను బీఆర్‌ఎస్ అంగీకరించినట్లేనని అన్నారు. ఇక గ్రామపంచాయతీ, మునిసిపల్ ఎన్నికల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చట్టాలను, పరిమితులను పూర్తిగా ఉల్లంఘించారని, ప్రభుత్వ ఖర్చుతో ప్రచారం నిర్వహించారని మండిపడ్డారు. అయినా కూడా ఈసీ పట్టించుకోలేదని, ప్రతిపక్షాలు ప్రశ్నించలేదని విమర్శించారు. కాగా, తాము భవిష్యత్తులోనూ జాగృతితో కలిసి పనిచేస్తామని ఫార్వర్డ్ బ్లాక్ రాష్ట్ర కన్వీనర్ జోజిరెడ్డి చెప్పారు.
కవితకు షాక్..!
వడ్డేపల్లి/హైదరాబాద్: జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి మునిసిపాలిటీలో ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) తరఫున గెలిచిన కల్వకుంట్ల కవిత మద్దతుదారులు ఆమెకు షాక్ ఇచ్చారు. మొత్తం 8 మంది కౌన్సిలర్లు శనివారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కలిశారు. అనంతరం వారంతా అధికారికంగా కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. దీంతో వడ్డేపల్లి మునిసిపాలిటీ స్పష్టంగా కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి ఆ పార్టీలో చేరినట్లు వడ్డేపల్లి శ్రీనివాసులు తెలిపారు.