‘ఇడుపు కాయితం’ అర్థం పవన్‌కు బాగా తెలుసు
ABN , Publish Date - Jun 29 , 2026 | 04:50 AM
ఇడుపు కాయితం’ అనే పదం అర్థం కాకపోతే ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ను అడగాలని, ఆయనకు దీని అర్థం బాగా...
తెలంగాణ భాషను హేళన చేస్తున్నా కాంగ్రెస్, బీజేపీ,
బీఆర్‌ఎస్‌లు గప్‌చుప్! : టీఆర్‌ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత
ఉప్పల్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): ‘ఇడుపు కాయితం’ అనే పదం అర్థం కాకపోతే ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ను అడగాలని, ఆయనకు దీని అర్థం బాగా తెలుసంటూ తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ‘ఇడుపు కాయితం’ అనే సినిమా టైటిల్ వివాదంపై స్పందిస్తూ.. తెలంగాణ భాషను అవహేళన చేయడం వల్లనే తెలంగాణ ఉద్యమం పుట్టిందని పేర్కొన్నారు. ఆదివారం ఉప్పల్‌లో ఆమె కార్యకర్తలతో కలిసి తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. తెలంగాణ ఆత్మగౌరవంపై దాడి జరుగుతున్నా, ఇక్కడి భాషను అవహేళన చేస్తున్నా కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్‌లు గప్‌చుప్‌గా ఉన్నాయని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌కు తెలంగాణతో ఉన్న పేగుబంధం ఏనాడో తెగిపోయిందని విమర్శించారు. ఉద్యమకారులకు కాంగ్రెస్ ఇస్తానన్న 250 గజాల స్థలం కోసం జూలై 2న ఉప్పల్ భగాయత్‌లో టీఆర్‌ఎస్ భూపోరాటం చేపడుతున్నట్లు కవిత ప్రకటించారు.