కొత్త పార్టీ కోసం ఈసీకి కవిత దరఖాస్తు!
ABN , Publish Date - Jan 27 , 2026 | 03:49 AM
సొంత పార్టీ ఏర్పాటు దిశగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వేగంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి....
ఢిల్లీలో ఎన్నికల సంఘానికి సమర్పించిన జాగృతి శ్రేణులు
3 నెలల్లో తెలంగాణ జాగృతికి రాజకీయ పార్టీగా గుర్తింపు?
హైదరాబాద్/జఫర్‌గడ్, జనవరి 26 (ఆంధ్రజ్యోతి): సొంత పార్టీ ఏర్పాటు దిశగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత వేగంగా అడుగులు వేస్తున్నారు. తెలంగాణ జాగృతిని రాజకీయ పార్టీగా మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘానికి(ఈసీఐ) ఇప్పటికే దరఖాస్తు చేసినట్లు తెలిసింది. జాగృతి ప్రతినిధులు ఢిల్లీకి వెళ్లి దరఖాస్తును సమర్పించినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం 3నెలల్లో తెలంగాణ జాగృతికి రాజకీయ పార్టీగా గుర్తింపు దక్కే అవకాశం ఉందని జాగృతి శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. అనుకున్నట్లుగా మూడు నెలల్లో గుర్తింపు దక్కితే.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల బరిలో జాగృతి కూడా నిలిచే అవకాశం ఉంది. ఇందుకు అనుగుణంగా కవిత ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిసింది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా ఎదుగుతుందని, ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాల సభ్యులు జాగృతిలో చేరాలని కవిత ఇటీవలే పిలుపునిచ్చారు. ఇదిలా ఉండగా, బీసీ కులగణనపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త మోసానికి తెరతీసిందని కవిత ఆరోపించారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాగృతి కార్యాలయం వద్ద జాతీయ జెండా ఎగురవేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం విడుదలచేసిన జనగణన-2026 డాక్యుమెంట్‌లో బీసీల గణనకు సంబంధించిన ఆప్షన్ లేదని మండిపడ్డారు.
నేనూ ట్యాపింగ్ బాధితురాలినే: కవిత
ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని త్వరగా తేల్చాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో తాను కూడా బాధితురాలినే అని చెప్పిన కవిత.. అధికారులు నోటీసులను ఏ ప్రాతిపదికన ఇస్తున్నారో అర్థం కావడం లేదన్నారు. ‘‘నేరంలో భాగం ఉందని భావిస్తున్నవారికి ఇస్తున్నారా.. లేకపోతే బాధితులకు ఇస్తున్నారా.. అనేది తెలియడం లేదు’’ అని వ్యాఖ్యానించారు. జనగామ జిల్లా జఫర్‌గడ్ మండలం సాగరంలోని గాదె ఇన్నయ్య ఇంటికి సోమవారం వెళ్లిన కవిత అక్కడ ఆయన తల్లి థెరీసమ్మ చిత్రపటానికి నివాళులర్పించారు. ఇన్నయ్య కుటుంబీలకును పరామర్శించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. మునిసిపల్ ఎన్నికల సమయంలో రాజకీయ ప్రయోజనాల కోసమే ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని మళ్లీ తెరపైకి తీసుకువచ్చిందని ఆరోపించారు.