నెల రోజులపాటు టీఆర్‌ఎస్ జెండా పండుగ: కవిత
ABN , Publish Date - May 12 , 2026 | 04:40 AM
తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ నెల 20 నుంచి జూన్ 20 వరకు నెల రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ‘జెండా పండుగ...
హైదరాబాద్, మే 11 (ఆంధ్రజ్యోతి) : తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) పార్టీ భావజాలాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ఈ నెల 20 నుంచి జూన్ 20 వరకు నెల రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ‘జెండా పండుగ’ నిర్వహించాలని పార్టీ శ్రేణులకు అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సోమవారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. రాష్ట్ర రాజధానితోపాటు జిల్లా కేంద్రాలు, మండల, గ్రామస్థాయి వరకు ప్రతివార్డులో జెండాలు ఎగుర వేసి, పార్టీ ప్రకటించిన పాంచజన్య సిద్ధాంతాలను ప్రజలకు వివరించాలని ఆదేశించారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినా నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణ మళ్లీ వంచనకు గురవుతోందని, వలస పాలన నాటి దుష్పరిణామాలను మళ్లీ ఎదుర్కొంటున్నామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అందుకే తెలంగాణ పునర్నిర్మాణం కోసం తెలంగాణ రక్షణ సేన బాధ్యత తీసుకొని ఉద్యమిస్తుందని తెలిపారు. స్వరాష్ట్ర సాధనకు అవిశ్రాంతంగా ఉద్యమించిన మనమంతా కూడా ఇప్పుడు తెలంగాణ పునర్నిర్మాణం, సబ్బండ వర్గాల వికాసం కోసం మళ్లీ ఉద్యమించాల్సిన సమయం వచ్చిందన్నారు. అందులో భాగంగానే తెలంగాణ రక్షణ సేన జెండాను ప్రతి వాడకు, పార్టీ సిద్ధాంతాలను ప్రతి గడపకు తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు సూచించారు.