సిద్దిపేట నుంచి పోటీ చేస్తా
ABN , Publish Date - Feb 20 , 2026 | 02:06 AM
గతంలో క్యాబినెట్ సమావేశాలు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగితే.. ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయంలో జరుగుతున్నాయి.
అక్కడ కాకపోతే బోధన్ మే నెలలో కొత్త పార్టీ.. సామాజిక తెలంగాణే లక్ష్యం
కొత్త తరానికి అవకాశాలు కల్పిస్తాం
బీఆర్‌ఎ్‌సకు చెందిన చాలా మంది టచ్‌లో ఉన్నారు
ద్రోహులను పక్కనుంచుకొని ద్రోహాల గురించి కేటీఆర్ మాట్లాడటం విడ్డూరం
క్యాబినెట్ భేటీలు అప్పుడు ఎర్రవెల్లిలో.. ఇప్పుడు ఢిల్లీలో!
బీఆర్‌ఎస్ బాటలో కాంగ్రెస్ తెలంగాణలో బీజేపీ కనుమరుగయ్యే పరిస్థితి
జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్, పిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): ‘‘గతంలో క్యాబినెట్ సమావేశాలు ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో జరిగితే.. ఇప్పుడు ఢిల్లీ కాంగ్రెస్ కార్యాలయంలో జరుగుతున్నాయి. అంతే తేడా. బీఆర్‌ఎస్ వాళ్లు నేర్పిన దాన్ని కాంగ్రెస్ వాళ్లు మరింత ముందుకు తీసుకెళ్తున్నారు. బీఆర్‌ఎస్ మార్గంలోనే కాంగ్రెస్ నడుస్తోంది’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విమర్శించారు. జాగృతి కార్యాలయంలో గురువారం మీడియా చిట్ చాట్‌లో ఆమె పలు అంశాలను ప్రస్తావించారు. ఉద్యమ ద్రోహులను తన పక్కనే పెట్టుకుని.. ద్రోహాల గురించి కేటీఆర్ మాట్లాడడం విడ్డూరంగా ఉందని, ఎవరు ఉద్యమకారులో, ఎవరు ఉద్యమ ద్రోహులో భవిష్యత్తులో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. ‘‘ఆడవాళ్లు రాజకీయంగా ఎదగాల్సిన అవసరం లేదా? వైఎస్ షర్మిల రాజకీయంగా ఫెయిల్యూర్ కాదు.. ఆమె ఇప్పుడొక జాతీయ పార్టీకి రాష్ట్ర అధ్యక్షురాలు. ఆడవాళ్ల ఫెయిల్యూర్స్‌ను మాత్రమే పెద్దగా చూపించడాన్ని నేను ఒప్పుకోను. పార్టీ పెట్టి ఫెయిలైన పురుష నాయకుల గురించి ఎందుకు మాట్లాడారని ప్రశ్నించారు. చిరంజీవి, దేవేందర్‌గౌడ్ గురించి ఎందుకు ప్రస్తావించరు? కొత్త పార్టీ పెడతానని చెప్పి మళ్లీ కాంగ్రె్‌సలో చేరిన రాజగోపాల్‌రెడ్డి గురించి మాట్లాడరేం? ఎంచుకున్న విధానాన్ని నమ్ముకొని నేను ముందుకెళ్తున్నా.. నా ప్రయత్నం నాది. రాజకీయ వర్గాలకే కాదు.. మీడియా వారినీ కోరుతున్నా.. చేతనైతే ప్రోత్సహించండి.. ఆడవారిని అవమానించకండి’’ అని విజ్ఞప్తి చేశారు. మే నెల మొదటి వారంలో ముహూర్తం చూసుకొని కొత్త పార్టీని ప్రారంభించనున్నట్లు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వెల్లడించారు. తెలంగాణ వాదమే తమ పార్టీకి మదర్ బోర్డు అని, రాజకీయంగా కొత్తతరానికి అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు. ప్రజల కోణంలో సామాజిక తెలంగాణ లక్ష్యంగా పార్టీ ఏర్పాటు చేస్తామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేది తమ పార్టీయేనని విశ్వాసం వ్యక్తం చేసిన కవిత.. తాను బోధన్, సిద్దిపేటలో ఏదో ఒక చోట నుంచి పోటీ చేస్తానని, సిద్దిపేట తనకు తొలి ప్రాధాన్యమని చెప్పారు. ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తామని చెప్పారు. తాను పెట్టబోయే పార్టీ.. వ్యక్తుల ఆధారంగా నడవదని, వ్యవస్థల ఆధారంగా నడుస్తుందని స్పష్టం చేశారు. తమ పార్టీలో చేరేందుకు బీఆర్‌ఎస్ నేతలు ఆసక్తితో ఉన్నారని, ఇప్పటికే చాలా మంది తనతో టచ్‌లో ఉన్నారని, వారెవరన్నది ఇప్పుడు చెప్పనని, సందర్భం వచ్చినప్పుడు వివరాలు వెల్లడిస్తానన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఏదో ఒక పార్టీతో కలిసి పోటీచేస్తామని చెప్పారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నాటికి తమ పార్టీకి గుర్తు వచ్చే అవకాశం ఉందని, ఆ గుర్తుపైనే పోటీ చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ.. క్రమంగా కనుమరుగు కానుందని జోస్యం చెప్పారు.
ఆర్టీసీని పరిరక్షించాలి
బీఆర్‌ఎస్ హయాంలో 52 రోజుల పాటు ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె చేశారని, 33 మంది కార్మికులు కూడా చనిపోయారని కవిత గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ సర్కార్ సైతం ఆర్టీసీ కార్మికుల గోడు వినిపించుకోవడం లేదని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం.. ఇప్పటికైనా ఆరీస్టీ పరిరక్షణకు సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేస్తామన్న మాటను నిలబెట్టుకోవాలన్నారు. మహాలక్ష్మి పథకం మొదలైన నాటి నుంచి ఆర్టీసీ ఉద్యోగులపై ఒత్తిడి పెరిగిందని, చిన్న కారణాలకే వారిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారని మండిపడ్డారు. ఈ నెల 24న ఆర్టీసీ ఉద్యోగులు తలపెట్టిన చలో సచివాలయం కార్యక్రమానికి జాగృతి పూర్తి మద్దతు ఇస్తోందన్నారు.