Kavitha: కవిత పార్టీకి పీకే వ్యూహం!
ABN , Publish Date - Jan 20 , 2026 | 02:18 AM
బీఆర్‌ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు...
ఆమెతో ప్రశాంత్ కిశోర్ వరుస భేటీలు
ఇటీవల వరుసగా 5 రోజులు చర్చలు
సీఎం దావోస్ పర్యటన దండగ: కవిత
హైదరాబాద్, జనవరి 19 (ఆంధ్రజ్యోతి): బీఆర్‌ఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత.. సొంతంగా రాజకీయ పార్టీ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ఆ పార్టీ కోసం వ్యూహాలు రచించేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త, జన్‌సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిశోర్ (పీకే)తో చర్చలు జరుపుతున్నారు. తెలంగాణ స్వీయ రాజకీయ అస్తిత్వ పరిరక్షణ కోసం కొత్త పార్టీ ఏర్పాటు అవసరమని కవిత ఇటీవలే ప్రకటించారు. ఆ పార్టీని వేగంగా ప్రజలకు చేరువ చేసేందుకు కసరత్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే పీకేతో కవిత చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. సంక్రాంతి పండుగ సమయంలో 5 రోజులపాటు వరుస సమావేశాలతో విస్తృతంగా చర్చలు జరిపినట్లు తెలిసింది. పార్టీ ఏర్పాటుచేసిన వెంటనే ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లటంపై ఈ భేటీలో ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. పార్టీ విధానాల రూపకల్పన కోసం ఇప్పటికే 50 కమిటీలతో కవిత అధ్యయనం చేయిస్తున్నారు. ఈ కమిటీల ప్రతినిధులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయా కమిటీల సభ్యులు తమ అధ్యయనం గురించి ప్రాథమిక నివేదికలను సమర్పించారు.
సీఎం దావోస్ పర్యటన దండగ
పెట్టుబడులు తెస్తామంటూ విమానం ఎక్కడం, దిగడం తప్ప.. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనతో ఒరిగేది ఏమీలేదని.. ఖర్చులు దండగేనని కల్వకుంట్ల కవిత విమర్శించారు. రూ.లక్షల కోట్ల పెట్టుబడుల ప్రచారం తప్ప రెండేళ్లలో తెలంగాణకు మీరు తెచ్చిందేమిటో చెప్పాలని సోమవారం ఎక్స్ వేదికగా ఆమె సీఎం రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. దావోస్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సమ్మిట్ ద్వారా 2024 ఆర్థిక సంవత్సరంలో రూ.40,232 కోట్లు, 2025లో రూ.1.78 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుందని, అవి ఎక్కడున్నాయని నిలదీశారు. ఇటీవల రూ.కోట్ల ప్రజాధనం ఖర్చుచేసి హైదరాబాద్‌లో నిర్వహించిన తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినట్టు ఊదరగొట్టారని మండిపడ్డారు.