కర్ణాటక ఓట్లతో రేవంత్ గెలుపు!
ABN , Publish Date - Jun 30 , 2026 | 05:10 AM
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత ఎన్నికల్లో నకిలీ ఓట్లు, కర్ణాటక కు చెందినవారి ఓట్లతోనే కొడంగల్‌లో గెలిచారని తెలంగాణ రక్షణ ేసన...
కొడంగల్‌లో 33 వేల అక్రమ ఓట్లున్నాయి
సర్‌పై సందేహాలకు ఈసీ స్పష్టతనివ్వాలి
అంతర్రాష్ట్ర ఓట్లను ఏరివేయకుంటే వృధా
నిరుద్యోగులతో పెట్టుకుంటున్న రేవంత్‌రెడ్డి
వారితో పెట్టుకున్న ఏ సర్కారూ బాగుపడలే
19 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలి:కల్వకుంట్ల కవిత
హైదరాబాద్/చాదర్‌ఘాట్, జూన్ 29 (ఆంధ్రజ్యోతి): ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గత ఎన్నికల్లో నకిలీ ఓట్లు, కర్ణాటక కు చెందినవారి ఓట్లతోనే కొడంగల్‌లో గెలిచారని తెలంగాణ రక్షణ ేసన (టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. సోమవారం టీఆర్‌ఎస్ కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడుతూ.. 2018 నుంచి 2023 నాటి ఎన్నికల వరకు కొడంగల్‌లో 30 వేల కొత్త ఓట్లు వచ్చి చేరాయన్నారు. అక్కడ 22 వేలకు పైగా నకిలీ ఓట్లున్నట్లు గుర్తించామని, అవి కాకుండా కర్ణాటకకు చెందిన సెడం నియోజకవర్గంలోని 11 వేల ఓట్లు కొడంగల్‌లో నమోదయ్యాయని చెప్పారు. దాదాపు 33 వేల ఓట్లు అక్రమంగా ఉండగా.. రేవంత్‌రెడ్డి 32 వేల మెజారిటీతో గెలిచారని, పక్క రాష్ట్రం ఓట్లతోనే ఆయన గెలిచినట్లు స్పష్టంగా అర్థమవుతోందని అన్నారు. పైగా కొడంగల్‌లో 800 ఓట్లు మాత్రమే తొలగించారని, బోధన్‌లో మాత్రం 7వేల ఓట్లు తొలగించారని తెలిపారు. లక్ష ఓట్ల వరకు కొడంగల్‌లో మోడిఫికేషన్ జరగటం కూడా అనుమానాలకు తావిస్తోందన్నారు. తెలంగాణ ఎన్నికలకు కర్ణాటక నుంచి డబ్బు మాత్రమే కాకుండా ఓట్లు కూడా ట్రాన్స్‌ఫర్ చేశారా? ఈ విషయంలో రేవంత్‌రెడ్డికి ఈసీ ఫేవర్ చేసిందా? అనే అనుమానం కలుగుతోందన్నారు. ఒక్కొక్కరు రెండు, మూడు రాష్ట్రాల్లో ఓటు వేయవచ్చా? అని ప్రశ్నించారు. ప్రకాశ్‌రాజ్‌కు రెండు, మూడు రాష్ట్రాల్లో ఓటు హక్కు ఉంటే వాటిని తొలగించేందుకు ఏడేళ్లు పట్టిందని తెలిపారు. ఇలాంటి ఓట్లను తొలగించకపోతే ఎస్‌ఐఆర్‌తో ఎటువంటి ప్రయోజనం ఉండదన్నారు.
19 వేల కానిస్టేబుల్ ఉద్యోగాలివ్వాలి..
సీఎం రేవంత్‌రెడ్డి నిరుద్యోగులతో పెట్టుకుంటున్నారని, ఆయనను గద్దె దించేవరకు వారు వదిలిపెట్టరని టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కవిత హెచ్చరించారు. సోమవారం సాయంత్రం దిల్‌సుక్‌నగర్‌లో నిరుద్యోగ జేఏసీ చేపట్టిన ధర్నాకు మద్దతు పలుకుతూ వారితో కలిసి ఆమె బైఠాయించారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, ‘నిరుద్యోగులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వమూ బాగుపడలేదు. ఇది ప్రజా ప్రభుత్వం కాదు.. జఫ్ఫా ప్రభుత్వం’ అని విమర్శించారు. 19 వేలకు పైగా కానిస్టేబుల్ పోస్టులు వేస్తామని చెప్పి 5వేలు మాత్రమే అనడం అన్యాయమని, దీనిని టీఆర్‌ఎస్ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని తెలిపారు. దీంతోపాటు కానిస్టేబుళ్లకు 36 ఏళ్లు, ఎస్సై ఉద్యోగాలకు 38 ఏళ్ల వరకు వయోపరిమితి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ ధర్నాలో ఎస్‌ఎ్‌ఫఐ జాతీయ అధ్యక్షుడు వివేక్, నిరుద్యోగ జేఏసీ చైర్మన్ ముఖ్యకుమార్, తెలంగాణ నిరుద్యోగ జేఏసీ నాయకుడు ఇంద్రనాయక్, పోలీసు నిరుద్యోగ జేఏసీ నాయకుడు ఆకాష్ తదితరులు పాల్గొన్నారు.