Share News

బీఆర్‌ఎస్‌ అవినీతి పరంపరను కొనసాగిస్తున్న సీఎం రేవంత్‌

ABN , Publish Date - Apr 11 , 2026 | 04:57 AM

పురపాలక శాఖను తనవద్దే అట్టిపెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీని అవినీతికి చిరునామా అన్నట్లుగా మార్చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు.

బీఆర్‌ఎస్‌ అవినీతి పరంపరను కొనసాగిస్తున్న సీఎం రేవంత్‌

  • జీహెచ్‌ఎంసీని అవినీతికి అడ్డాగా మార్చేశారు.. సీఎం అనుచరులకు నామినేషన్‌ పద్ధతిన టెండర్లు

  • రూ.1,148 కోట్ల పనులను తన అనుచరులకే ఇప్పించారు

  • రియల్‌ వ్యాపారుల వద్ద చ.అడుగుకు రూ.150 చొప్పున వసూలు చేస్తూ బ్లాక్‌మెయిల్‌ దందా

  • ఆపకపోతే ఈడీకి ఫిర్యాదు చేస్తాం

  • అర్వింద్‌ పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదు: కవిత

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 10 (ఆంధ్రజ్యోతి): పురపాలక శాఖను తనవద్దే అట్టిపెట్టుకున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, జీహెచ్‌ఎంసీని అవినీతికి చిరునామా అన్నట్లుగా మార్చేశారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. నిబంధనలకు వ్యతిరేకంగా రూ.కోట్ల విలువైన పనులను టెండర్లు లేకుండానే కట్టబెడుతున్నారని, ఇది తెలంగాణ స్టేట్‌ ఫైనాన్షియల్‌ కోడ్‌ను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. ప్రభుత్వ విభాగాల్లో రూ. ఐదు లక్షలకు మించి పనులకు సంబంధించిన కాంట్రాక్టులను టెండర్ల ద్వారా కట్టబెట్టాలని, అందుకు విరుద్ధంగా జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో నామినేషన్‌ పద్ధతిన కాంట్రాక్టులు ఇచ్చారని కవిత ఆరోపించారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రూ.480 కోట్ల పనులను నిబంధనలకు విరుద్ధంగా కట్టబెట్టిందని, ఆ అవినీతి పరంపరను రేవంత్‌రెడ్డి కొనసాగిస్తున్నారని ఆరోపించారు. శుక్రవారం జాగృతి కార్యాలయంలో కవిత మీడియాతో మాట్లాడారు. రూ.1,148 కోట్ల పనులను సీఎం తన అనుచరులకు నామినేషన్‌ పద్ధతిలో ఇప్పించారని, ఇందులో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించారు. ప్రభుత్వం ఆయా విభాగాల్లో నామినేషన్‌ పద్ధతిలో ఎంపిక చేసిన సంస్థలు స్కిల్డ్‌ లేబర్‌కు ఇచ్చే జీతాల్లో కోత పెడుతున్నారని.. రూ.23 వేలవరకు జీతాలివ్వాల్సి ఉండగా, రూ.13వేలు మా త్రమే ఇస్తున్నారన్నారు. హెచ్‌ఎండీఏ పరిధిలో 35వేల కోట్ల విలువైన భూములను అమ్మేసి.. హైదరాబాద్‌ అభివృద్ధికి రూపాయి కూడా ఖర్చు చేయలేదని ఆరోపించారు. పైగా తన అవినీతిని మరింత పెంచుకునేందుకు ఫ్యూచర్‌ సిటీ అంటూ రేవంత్‌ హంగామా చేస్తున్నారని దుయ్యబట్టారు. హైడ్రా పేరుతో ఇప్పటికే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులను హడలెత్తించటమే కాకుండా చదరపు అడుగుకు రూ.150 వారి వద్ద వసూలు చేస్తున్నారని విమర్శించారు. వీటికి సంబంధించిన అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, ఈ బ్లాక్‌ మెయి ల్‌ దందా ఆపకపోతే ఈడీకి ఫిర్యాదు చేస్తామని హెచ్చరించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ మరమ్మతులు చేసేందుకు ప్రభుత్వం ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామని, కమీషన్ల కక్కుర్తి కోసం కాకుండా చిత్తశుద్థితో పనిచేయాలని సూచించారు. 2027 జనగణన తర్వాతే మహిళాబిల్లు అమలు చేయాలని, ఓబీసీ మహిళలకు సబ్‌ కోటా ఇవ్వాలని డిమాం డ్‌ చేశారు. కాగా తాను పార్టీ నడపడం వెనక మరొకరి మద్దతు ఉందని బీజేపీ ఎంపీ అర్వింద్‌ మాట్లాడటం ఆయన పురుషాహంకారానికి నిదర్శనమని కవిత ఆరోపించారు. తన గురించి పిచ్చి పిచ్చిగా మాట్లాడితే ఊరుకునేది లేదని అర్వింద్‌ను హెచ్చరించారు.

Updated Date - Apr 11 , 2026 | 04:57 AM