Share News

డిస్కమ్‌ల ప్రైవేటీకరణకు సీఎం రేవంత్‌ కుట్ర

ABN , Publish Date - Jun 01 , 2026 | 05:03 AM

రైతు డిస్కంను ఏర్పాటు చేసి మిగిలిన రెండు విద్యుత్‌ డిస్కంలను ప్రైవేటు పరం చేసేందుకు సీఎం కుట్ర చేస్తున్నారని, ఈ కారణంగానే ఆరు...

డిస్కమ్‌ల ప్రైవేటీకరణకు సీఎం రేవంత్‌ కుట్ర

  • కాదని ప్రెస్‌మీట్‌ పెట్టి చెప్పగలరా?

  • ఈఆర్సీ అనుమతిస్తే.. రైతు డిస్కమ్‌ను ఆపేందుకు సుప్రీంకోర్టుకెళ్తాం: కవిత

హైదరాబాద్‌, మే 31 (ఆంధ్రజ్యోతి): రైతు డిస్కంను ఏర్పాటు చేసి మిగిలిన రెండు విద్యుత్‌ డిస్కంలను ప్రైవేటు పరం చేసేందుకు సీఎం కుట్ర చేస్తున్నారని, ఈ కారణంగానే ఆరు నెలలు రహస్యంగా ఉంచి.. నిన్న ఆ విషయం బహిర్గతం చేశారని తెలంగాణ రక్షణ సేన (టీఆర్‌ఎస్‌) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. ఆదివారం టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. 24 గంటల కరెంట్‌ ఎత్తివేయం, మోటార్లకు మీటర్లు పెట్టమని, అలాచేస్తే ఎన్నికలకే వెళ్లమని చెబుతున్న రేవంత్‌రెడ్డి.. ఆ రెండు డిస్కంలను ప్రైవేట్‌ పరం చేస్తే ఎన్నికల్లో ఓట్లు అడగమని ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రజలకు చెప్పగలరా..? అని ప్రశ్నించారు. రైతు డిస్కంకు ఎట్టి పరిస్థితుల్లో అనుమతి ఇవ్వొద్దని ఈఆర్సీని కోరామని, జిల్లాల్లో బహిరంగ విచారణలు జరిపి.. రైతుల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతే.. సరైన నిర్ణయం తీసుకోవాలని కోరామన్నారు. ప్రభుత్వ ప్రతిపాదన మేరకు రైతు డిస్కంకు ఈఆర్సీ(విద్యుత్‌ నియంత్రణ మండలి) అనుమతిస్తే.. దాన్ని అడ్డుకునేందుకు సుప్రీంకోర్టుకైనా వెళ్తామన్నారు. ఇప్పటికే తెలంగాణ జాగృతి స్వచ్ఛంద సంస్థ ద్వారా తాము కేసు వేశామని కవిత వెల్లడించారు. కాగా బడా వ్యక్తులు చేసే కబ్జాలపై తానిచ్చిన ఫిర్యాదులను హైడ్రా పక్కన పెట్టిందని, పెద్ద వాళ్లను కాపాడుతూ పేదలను ఇబ్బంది పెట్టేలా హైడ్రా చర్యలు ఉన్నాయని ఆరోపించారు. ఖమ్మంలో ప్రభుత్వ ఆస్పత్రికి వైద్యం కోసం తీసుకొచ్చిన ఓ పసిగుడ్డు చేయి తీసేశారని, ముఖ్యమంత్రి సహా ఖమ్మంలో ఉన్న మంత్రులు ఆ పసిగుడ్డుకు న్యాయం చేయాలని, ఆ చిన్నారి పేరిట రూ.25 లక్షలు డిపాజిట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కుమ్మెర గ్రామంలో కుల వివక్షతో ఓ పసిగుడ్డును చంపేశారని, అదే గ్రామానికి వెళ్తున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.పాలమూరు ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్‌ను దసరాలోగా ప్రారంభించకపోతే ఆ మరుసటి రోజు నుంచే పాదయాత్ర చేస్తానని చెప్పారు.

Updated Date - Jun 01 , 2026 | 05:03 AM