Share News

ఏప్రిల్‌లో కవిత ‘జాగృతి పార్టీ’!

ABN , Publish Date - Feb 09 , 2026 | 02:07 AM

తెలంగాణ జాగృతి సంస్థ త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరించనుంది. అన్ని ప్రక్రియలు పూర్తిచేసుకొని.. వచ్చే ఏప్రిల్‌లో ప్రారంభానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది...

ఏప్రిల్‌లో కవిత ‘జాగృతి పార్టీ’!

  • గత నెలలో ఈసీకి దరఖాస్తు.. ప్రక్రియలన్ని పూర్తిచేసుకొని ప్రారంభించేలా ఏర్పాట్లు

  • జీహెచ్‌ఎంసీ బరిలో దిగాలని వ్యూహం.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా అడుగులు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 8 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాగృతి సంస్థ త్వరలోనే రాజకీయ పార్టీగా అవతరించనుంది. అన్ని ప్రక్రియలు పూర్తిచేసుకొని.. వచ్చే ఏప్రిల్‌లో ప్రారంభానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కొత్త పార్టీ ఏర్పాటు కోసం కేంద్ర ఎన్నికల సంఘానికి (ఈసీఐ) గత నెలలోనే జాగృతి ప్రతినిధులు దరఖాస్తు అందజేశారు. నిబంధనల ప్రకారం ఈసీఐకి అన్ని వివరాలు అందజేశారు. ఈసీఐ విధివిధానాలకు అనుగుణంగా అన్ని ప్రక్రియలు పూర్తయితే రెండు నెలల్లో జాగృతికి రాజకీయ పార్టీగా గుర్తింపు దక్కే అవకాశం ఉంది. తనకు సెంటిమెంట్‌ ఎక్కువని.. పార్టీ ప్రకటనకు మంచి మూహూర్తం కోసం ఎదురు చూస్తున్నానని జాగృతి అధ్యక్షురాలు కవిత ఇటీవలే తెలిపారు. దీన్నిబట్టి ఏప్రిల్‌ చివరి వారంలో.. లేదా మే మొదటి వారంలో పార్టీ ప్రకటన, ప్రారంభ కార్యక్రమాలు ఉంటాయని జాగృతి వర్గాలు తెలిపాయి. బీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి సస్పెండైన తర్వాత కవిత.. జాగృతి జనంబాట పేరిట ప్రజల్లోకి వెళ్లారు. తన ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేసి సొంత పార్టీ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు వేస్తున్నారు. ప్రజా సమస్యలేంటి? జనం కోసం ఏం చేయాలి? పార్టీ విధానాలను ఎలా రూపొందించాలి? అన్నదానిపై కవిత దృష్టిపెట్టారు. అందులో భాగంగా జాగృతి ఆధ్వర్యంలో 50 కమిటీలు వేసి వివిధ వర్గాల నుంచి సమాచారం, అభిప్రాయాలు తీసుకున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి జాగృతి రాజకీయ పార్టీగా ఎదుగుతుందని.. ఉద్యమ కారులు, అమరవీరుల కుటుంబాలంతా జాగృతిలో చేరాలని కవిత ఇటీవల విజ్ఞప్తిచేశారు. సకాలంలో గుర్తింపు దక్కితే.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల బరిలో జాగృతి పార్టీ నిలిచే అవకాశం ఉందని సమాచారం. సామాజిక తెలంగాణే ధ్యేయంగా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో జాగృతి పార్టీ పోటీ చేస్తుందని కవిత చెబుతున్నారు.తన రాజకీయ భవిష్యత్‌ కోసం పటిష్ఠమైన కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. రాబోయే రోజుల్లో తన రాజకీయ వ్యూహం మరింత స్పష్టంగా ఉంటుందని, కొత్త పార్టీ ప్రకటనతో తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ మొదలవుతుందని కవిత చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. జాగృతి విధానాల రూపకల్పనలో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ కీలకపాత్ర పోషించే అవకాశం ఉందని చర్చ జరుగుతోంది. త్వరలోనే సభ్యత్వ నమోదుకు కసరత్తు చేస్తున్నారు.

Updated Date - Feb 09 , 2026 | 02:07 AM