Share News

పర్యాటక గుట్టలు!

ABN , Publish Date - Apr 15 , 2026 | 04:34 AM

కర్రెగుట్టలు! తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని ఈ అడవుల పేరు చెబితే ఏదో గుబులు! మొన్నటిదాకా మావోయిస్టులకు కంచుకోట కదా! కేంద్ర బలగాలు, పోలీసుల కూంబింగ్‌తో ఉద్రిక్తల మధ్య తుపాకుల మోత...

పర్యాటక గుట్టలు!

  • మొన్నటిదాకా మావోయిస్టులకు కంచుకోటగా కర్రెగుట్టలు

  • పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు

  • ఛత్తీస్‌గఢ్‌సరిహద్దులోని అడవులపై ప్రభుత్వం దృష్టి

  • ప్రత్యేకంగా కాటేజీలు, వ్యూపాయింట్లు, వాచ్‌టవర్లు

  • ములుగు జిల్లా వాజేడు-వెంకటాపూర్‌ మండలాల్లోని

  • ప్రాంతాలను కలుపుతూ 13 కి.మీ. మేర రోడ్డు నిర్మాణం

  • గిరిజనులకు ఉపాధి కల్పన.. భద్రతకు పోలీస్‌ ఔట్‌పోస్టు

ములుగు, ఏప్రిల్‌ 14(ఆంధ్రజ్యోతి): కర్రెగుట్టలు! తెలంగాణ-ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దుల్లోని ఈ అడవుల పేరు చెబితే ఏదో గుబులు! మొన్నటిదాకా మావోయిస్టులకు కంచుకోట కదా! కేంద్ర బలగాలు, పోలీసుల కూంబింగ్‌తో ఉద్రిక్తల మధ్య తుపాకుల మోత, మందుపాతరల పేలుళ్లతో దద్దరిల్లిన ప్రాంతం! దీన్ని పక్కనబెట్టి చూస్తే మాత్రం దట్టమైన పచ్చని అడవులు, ఎత్తన గుట్టలు, సహజసిద్ధమైన జలపాతాలతో ప్రకృతి రమణీయతకు ఆలవాలమీ ప్రాంతం! కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ప్రత్యేక ఆపరేషన్‌ కారణంగా మావోయిస్టుల ప్రభావం బాగా తగ్గిపోవడంతో ఇప్పుడు కర్రెగుట్టల ప్రాంతం ఎకో టూరిజం హబ్‌గా మారనునుంది. ఈ మేరకు కర్రెగుట్టల అభివృద్ధిపై రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక దృష్టిపెట్టింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని కర్రెగుట్టల ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తోం ది. రోడ్లను అభివృద్ధి చేసి, ఎకో టూరిజం సౌకర్యాలు సమకూర్చి, స్థానిక గిరిజనులకు ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా కసరత్తు చేస్తోంది. భద్రత, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ అనే మూడు అంశాలను దృష్టిలో పెట్టుకుని సమగ్ర చర్యలు చేపట్టేందుకు పూనుకొంది. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్‌ మధ్య సుదీర్ఘ అటవీ సరిహద్దు ఉంది. ఇది భౌగోళికంగా క్లిష్టమైంది. భద్రత పరంగా సున్నితమైనది కూడా. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం పోలీసు, అటవీ, రెవెన్యూ శాఖలను సమన్వయం చేస్తూ అటవీ ప్రాంతాల్లో అక్రమ కార్యకలాపాలు, మావోయిస్టుల నియంత్రణపై కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. సరిహద్దు గ్రామాల ప్రజల కోసం రహదారులు, విద్యుత్తు, తాగునీరు, వైద్య సదుపాయాల కల్పనకు కృషిచేస్తోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా అడవులు, వన్యప్రాణుల సంరక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఇప్పటికే వాజేడు మండలం మురుమూరు నుంచి వెంకటాపూర్‌ మండలం పామునూరు వరకు గుట్టలపై 13 కి.మీ మేర మట్టి రోడ్డు నిర్మించారు. పర్యాటకులకు రక్షణ కల్పించేందుకు పోలీస్‌ ఔట్‌ పోస్ట్‌ ఏర్పాటు చేశారు. అటవీ, రెవెన్యూ, పోలీస్‌ శాఖల మధ్య సమన్వయం కోసం ఇంటర్‌ ఏజెన్సీ కోఆర్టినేషన్‌ సెంటర్లను ఏర్పాటు చేశారు. కర్రెగుట్టల వద్ద కాటేజీలు, వాచ్‌ టవర్లు, పర్యాటకులు బస చేసేందుకు అటవీశాఖ ఆధ్వర్యంలో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. పామునూరు నుంచి ఛత్తీస్‌గఢ్‌ వరకు కనెక్టివిటీ పెంచేందుకు చర్యలు చేపడుతున్నారు. పర్యాటకులను ఆకర్షించేలా వ్యూ పాయింట్లు, వాచ్‌టవర్లను ఏర్పాటు చేయనున్నారు. మారేడుమిల్లి ప్రాంతాన్ని ఏపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన తరహాలోనే కర్రెగుట్టలను అధునాతనంగా తీర్చిదిద్దే ఆలోచనల్లో తెలంగాణ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరిగితే కర్రెగుట్టల ప్రాంతం తెలంగాణకు టూరిజం ఐకాన్‌గా మారనుంది.

Updated Date - Apr 15 , 2026 | 04:34 AM