తోపుడు బండిపై ఇంటికి మృతదేహం తరలింపు
ABN , Publish Date - May 04 , 2026 | 04:01 AM
అనారోగ్యంతో మృతి చెందిన ఓ యువకుడి మృతదేహాన్ని కుటుంబసభ్యులు తోపుడు బండిపై ఇంటికి తీసుకెళ్లిన దయనీయ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం..
కరీంనగర్ జిల్లా కేశవపట్నంలో దయనీయ ఘటన
శంకరపట్నం, మే 3 (ఆంధ్రజ్యోతి): అనారోగ్యంతో మృతి చెందిన ఓ యువకుడి మృతదేహాన్ని కుటుంబసభ్యులు తోపుడు బండిపై ఇంటికి తీసుకెళ్లిన దయనీయ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలో చోటుచేసుకుంది. మృతదేహాన్ని తరలించేందుకు చుట్టుపక్కల వారెవరూ సహకరించకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది. కేశవపట్నానికి చెందిన ఎల్కపల్లి యాకుబ్ (32) కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. అతడి కుటుంబ సభ్యులు మెయిన్ రోడ్డుపై అరటి పండ్ల వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నారు. అయితే ఆదివారం పండ్లు అమ్మేందుకు తన షాప్‌నకు వచ్చిన అతడు.. పరిస్థితి విషమించి అక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని ఇంటికి తరలించేందుకు చుట్టుపక్కల వారి సాయాన్ని కోరగా.. ఎవరూ ముందుకురాలేదు. వాహనం కోసం ప్రయత్నించినా ఏదీ దొరకలేదు. దీంతో విధి లేని పరిస్థితుల్లో కుటుంబ సభ్యులు షాపులోని తోపుడు బండిపై మృతదేహాన్ని ఉంచి ఇంటికి తీసుకెళ్లారు.