Share News

భార్య మరణాన్ని తట్టుకోలేక.. ఎస్సై ఆత్మహత్య

ABN , Publish Date - Mar 22 , 2026 | 05:04 AM

ఆయనో పోలీసు.. విధి నిర్వహణలో భాగంగా ఆయన ఎన్నో నేరాలు, ఘోరాలను చూసి ఉంటారు. అయితేనేం.. తన జీవితంలో సగమైన భార్య ఆత్మహత్య చేసుకోవడాన్ని మాత్రం తట్టుకోలేకపోయారు. భార్య లేని లోకంలో ఉండలేక..

భార్య మరణాన్ని తట్టుకోలేక.. ఎస్సై ఆత్మహత్య

  • ఐదు రోజుల వ్యవధిలో ఒకరి తర్వాత మరొకరిగా

  • దంపతుల బలవన్మరణం.. కరీంనగర్‌లో విషాదం

  • అనాథలుగా మిగిలిన వారి ఇద్దరు కుమారులు

ఇల్లందకుంట/కరీంనగర్‌ క్రైం, మార్చి 21 (ఆంధ్రజ్యోతి): ఆయనో పోలీసు.. విధి నిర్వహణలో భాగంగా ఆయన ఎన్నో నేరాలు, ఘోరాలను చూసి ఉంటారు. అయితేనేం.. తన జీవితంలో సగమైన భార్య ఆత్మహత్య చేసుకోవడాన్ని మాత్రం తట్టుకోలేకపోయారు. భార్య లేని లోకంలో ఉండలేక.. ఆమె తనని వదిలి వెళ్లి రోజులు గడవకముందే ఆత్మహత్య చేసుకొని తాను ఈ లోకాన్ని వీడారు. ఐదు రోజుల క్రితం భార్యను కోల్పోయిన కరీంనగర్‌ టూటౌన్‌ ఎస్సై దేశ్‌ చంద్రశేఖర్‌ (37) శనివారం బలవన్మరణానికి పాల్పడ్డారు. రోజుల వ్యవధిలో ఎస్సై దంపతులు ఆత్మహత్య చేసుకోగా.. వారి కుమారులిద్దరూ ఇప్పుడు అనాథలుగా మిగిలారు. కరీంనగర్‌ జిల్లా ఇల్లందకుంట మండలంలోని సీతంపేటకు చెందిన తెడ్ల దివ్య(32), భూపాలపల్లికి చెందిన దేశ్‌ చంద్రశేఖర్‌కు 2016లో వివాహమైంది. వీరికి అశ్వత్థామ(10), అభిమన్యు (6) అనే కుమారులు ఉన్నారు. కరీంనగర్‌ టూటౌన్‌ పోలీసు స్టేషన్‌లో ఎస్సైగా పని చేస్తున్న చంద్రశేఖర్‌.. కరీంనగర్‌లోని హనుమాన్‌నగర్‌లో తన భార్యాపిల్లలతో కలిసి నివాసముంటున్నారు. అయితే, ఈ నెల 17న చంద్రశేఖర్‌ డ్యూటీకి, పిల్లలు పాఠశాలకు వెళ్లిన తర్వాత.. దివ్య కడుపునొప్పి తాళలేక గన్నేరుపప్పు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన కుటుంబసభ్యులు ఆమెను కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌ తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించింది. దీంతో 18వ తేదీన దివ్య అంత్యక్రియలకు ఆమె స్వగ్రామం సీతంపేటలో కుటుంబసభ్యులు ఏర్పాట్లు చేశారు.


అయితే, దివ్య మరణం విషయంలో చంద్రశేఖర్‌ పాత్రపై అనుమానం వ్యక్తం చేసిన ఆ గ్రామ ప్రజలు.. అంత్యక్రియల్లో పాల్గొనకుండా చంద్రశేఖర్‌ను అడ్డుకున్నారు. గ్రామ ప్రజలకు నచ్చజెప్పిన దివ్య తండ్రి.. తన అల్లుడు చంద్రశేఖర్‌ను ఇంట్లోకి పంపించేశారు. అంత్యక్రియల అనంతరం తిరిగి కరీంనగర్‌ చేరుకున్న చంద్రశేఖర్‌.. గురువారం తిరిగి సీతంపేట వెళ్లారు. నాటి నుంచి అత్తాగారింట్లోనే ఉంటున్నారు. సీతంపేటలో శనివారం నిర్వహించిన దివ్య అంతిమ కార్యక్రమాల్లో పాల్గొన్న తర్వాత దుస్తులు మార్చుకుంటానని చెప్పి గదిలోకి వెళ్లిన చంద్రశేఖర్‌ తలుపులు వేసుకున్నారు. ఎంతసేపయినా తండ్రి బయటకు రాకపోవడంతో పిల్లలు వెళ్లి తలుపు కొట్టారు. ఎంతకీ తలుపులు తీయకపోవడంతో కుటుంబసభ్యులు కిటికీలో నుంచి చూడగా.. చంద్రశేఖర్‌ గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకొని కనిపించారు. వెంటనే తలుపులు పగలగొట్టి జమ్మికుంటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించగా.. ఆయన అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. దివ్య చనిపోయినప్పటి నుంచి చంద్రశేఖర్‌ ముభావంగా ఉంటున్నారని కుటుంబసభ్యులు చెబుతున్నారు.

Updated Date - Mar 22 , 2026 | 05:06 AM