Share News

ఓటర్లకు వ్యక్తిగతంగా దగ్గరయ్యేందుకు అభ్యర్థుల ప్రయత్నాలు..

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:47 AM

మునిసిపల్‌ ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు.. తమ పార్టీ జెండానే నమ్ముకోకుండా వ్యక్తిగతంగా ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు.

ఓటర్లకు వ్యక్తిగతంగా  దగ్గరయ్యేందుకు అభ్యర్థుల ప్రయత్నాలు..

  • నా పార్టీ జెండానే కాదు..

  • నా ఎజెండా కూడా చూడండి!

  • ఎన్నికల్లో అభ్యర్థుల వెరైటీ ప్రచారం

(కరీంనగర్‌ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి):

మునిసిపల్‌ ఎన్నికల్లో పోటీచేస్తున్న ప్రధాన పార్టీల అభ్యర్థులు.. తమ పార్టీ జెండానే నమ్ముకోకుండా వ్యక్తిగతంగా ఓటర్లకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో ప్రతి వర్గానికి ప్రత్యేక హామీలిస్తూ ప్రచారంలో దూసుకుపోతున్నా రు. పార్టీ జెండానే కాకుండా తన సేవలను చూసి ఓటేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కరీంనగర్‌ కార్పొరేషన్‌లో ఒక ప్రధాన పార్టీ అభ్యర్థి.. ‘కరోనా సమయంలో నేను ప్రాణాలకు తెగించి చేసిన సేవలను గుర్తుకు తెచ్చుకొని ఓటేసి గెలిపించండి’ అని ఓటర్లను వేడుకుంటూ కరపత్రాలు పంచుతున్నారు. అదే కార్పొరేషన్‌లో మరో పార్టీ మహిళా అభ్యర్థి ‘డివిజన్‌ పరిధిలో వృద్ధుల కోసం ప్రత్యేక విశ్రాంతి గది ఏర్పా టు చేస్తా. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించి మహిళలు, పిల్లలు, వృద్ధులకు మెరుగైన ఆరోగ్యసేవలు అందిస్తా’ అని హామీ ఇచ్చారు. హైదరాబాద్‌ నుంచి నిపుణులను తీసుకొచ్చి యువతకు పోటీ పరీక్షలపై మార్గనిర్దేశం చేస్తామని హామీ పత్రాన్ని ముద్రించి పంచుతున్నారు. నల్లగొండ కార్పొరేషన్‌లో ప్రతిపక్ష పార్టీకి చెందిన ఓ అభ్యర్థి సిటీ కేబుల్‌ కనెక్షన్‌ ఉచితంగా ఇస్తానని, నెలవారీ బిల్లు లేకుండా టీవీ చూసే అవకాశం కల్పిస్తానని హామీ ఇస్తున్నారు. మంచిర్యాల కార్పొరేషన్‌ పరిధిలోని ప్రధాన పార్టీ అభ్యర్థులు పక్కా రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటుచేస్తామని ఓటర్లకు భరోసా ఇస్తున్నారు.


అభ్యర్థుల గుణగణాలూ ముఖ్యమే..

పార్టీలే కాకుండా అభ్యర్థుల గుణగణాలు, వ్యవహారశైలి, ప్రజలతో వారు కలిసిపోయే విధానం కూడా ముఖ్యమేనని ఓటర్లు చెబుతున్నారు. తమ డివిజన్‌ నుంచి పోటీలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరు ప్రజలతో సఖ్యతగా ఉంటారు? పనులెవరు చేస్తారు? అని ఆలోచిస్తున్నామని కరీంనగర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని తీగగుంటపల్లికి చెందిన చిరు వ్యాపారి అనిల్‌.. ఆంధ్రజ్యోతికి తెలిపారు.

Updated Date - Feb 07 , 2026 | 08:06 AM