Share News

స్నేహితుడే బినామీ

ABN , Publish Date - Mar 19 , 2026 | 03:54 AM

మిత్రుడైన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని బినామీగా పెట్టుకుని రెండేళ్లుగా లంచాలు తీసుకుంటున్న కరీంనగర్‌ ఎక్సైజ్‌ సీఐ గుట్టును ఏసీబీ అధికారులు రట్టు చేశారు.

స్నేహితుడే బినామీ

  • మిత్రుడి ఖాతాలోకి లంచం సొమ్ము

  • ఏసీబీకి చిక్కిన కరీంనగర్‌ ఎక్సైజ్‌ సీఐ రాము.. రెండేళ్లుగా దందా

  • సోదాల్లో రూ.20లక్షలు పట్టివేత

హైదరాబాద్‌, కరీంనగర్‌ క్రైం/జగిత్యాల టౌన్‌, మార్చి 18(ఆంధ్రజ్యోతి): మిత్రుడైన ప్రభుత్వ ఉపాధ్యాయుడిని బినామీగా పెట్టుకుని రెండేళ్లుగా లంచాలు తీసుకుంటున్న కరీంనగర్‌ ఎక్సైజ్‌ సీఐ గుట్టును ఏసీబీ అధికారులు రట్టు చేశారు. జగిత్యాల జిల్లా భీమారానికి చెందిన ఎక్సైజ్‌ సీఐ గుండేటి రాము ఒక బెల్లం వ్యాపారిని లంచం డిమాండ్‌ చేసి సొమ్మును తన స్నేహితుడైన ఉపాధ్యాయుడు జక్కని వేణు ఖాతాలోకి వేయాలని సూచించారు. దీంతో బెల్లం వ్యాపారి ఏసీబీ అధికారులకు సమాచారమిచ్చి లంచం సొమ్మును వేణు ఖాతాలో వేశారు. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు వేణును, రామును అదుపులోకి తీసుకుని విచారించారు. విధి నిర్వహణలో తనకు అందే లంచాలను రాము తరచుగా వేణు ఖాతాలో పడేలా చేసుకున్నారు. ఆ తర్వాత వేణు ఖాతా నుంచి రాము తండ్రి శంకర్‌ ఖాతాలోకి వెళ్లేది. ఇలా రెండేళ్లుగా జరుగుతున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. రాము ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించగా రూ.20లక్షల నగదు, భారీగా బంగారు ఆభరణాలు దొరికాయి. దర్యాప్తు కొనసాగుతుందని, వీరిద్దరిని అరెస్టు చేసి న్యాయస్ధానంలో హజరుపరిచామని ఏసీబీ అదనపు డీజీ చారుసిన్హా ఒక ప్రకటనలో తెలిపారు. 2005 డీఎస్సీలో ఉపాధ్యాయులుగా ఎంపికై మేడిపల్లి మండలంలో పని చేయడంతో రాము, వేణు మిత్రులయ్యారు. అనంతరం 2014లో రాము గ్రూప్‌ 2 ద్వారా ఎక్సైజ్‌ ఎస్‌ఐగా ఎంపికై ఆ తర్వాత సీఐగా పదోన్నతి పొంది లంచాలకు తెరలేపిన వ్యవహారాన్ని ఏసీబీ అధికారులు బయటపెట్టారు.

Updated Date - Mar 19 , 2026 | 03:54 AM