Share News

మ్యూల్‌ ఖాతాలతో రూ.138 కోట్లు స్వాహా

ABN , Publish Date - Mar 28 , 2026 | 05:17 AM

సైబర్‌ నేరాల్లో కీలకమైన మ్యూల్‌ ఖాతాల వ్యవహారం కరీంనగర్‌లో తీవ్ర కలకలం రేపింది. చైనాకు చెందిన సైబర్‌ నేర ముఠాలకు బ్యాంకు ఖాతాలు ఇచ్చి ఎనిమిది సైబర్‌ నేరాల్లో .....

మ్యూల్‌ ఖాతాలతో రూ.138 కోట్లు స్వాహా

  • బ్యాంక్‌ మేనేజర్‌ సహా 13 మంది అరెస్టు

  • ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా చైనా ముఠాకు ఖాతాల వివరాలు

  • అకౌంట్‌ ఇస్తే రూ.30వేలు, లావాదేవీకి 4శాతం కమీషన్‌

కరీంనగర్‌ క్రైం, మార్చి27 (ఆంధ్రజ్యోతి): సైబర్‌ నేరాల్లో కీలకమైన మ్యూల్‌ ఖాతాల వ్యవహారం కరీంనగర్‌లో తీవ్ర కలకలం రేపింది. చైనాకు చెందిన సైబర్‌ నేర ముఠాలకు బ్యాంకు ఖాతాలు ఇచ్చి ఎనిమిది సైబర్‌ నేరాల్లో రూ.138 కోట్లు కొల్లగొట్టేందుకు సహకరించిన 13 మందిని కరీంనగర్‌ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో కరీంనగర్‌లోని రత్నాకర్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌(ఆర్‌బీఎల్‌) మేనేజర్‌, క్యాషియర్‌ కూడా ఉన్నారు. మరో 11 మంది పరారీలో ఉన్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను కరీంనగర్‌ సీపీ గౌస్‌ ఆలం విలేకరులకు శుక్రవారం వెల్లడించారు. జగిత్యాల జిల్లా వెల్గటూర్‌కు చెందిన బండారి సాయిరాం(30)కు చైనా సైబర్‌ నేర ముఠాలతో సంబంధాలున్నాయి. సాయిరాం అమాయకులకు డబ్బు ఆశచూపి బ్యాంకులో వారి పేరిట కరెంట్‌ ఖాతాలు తెరిపించి ఆ వివరాలను ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సైబర్‌ నేర ముఠాలకు ఇస్తుంటాడు. ఈ వ్యవహారంలో బుగ్గారం మండలం గోపాల్‌పూర్‌కు చెందిన అనుమాండ్ల రంజిత్‌(36), పెద్దపల్లి జిల్లా ధర్మారానికి చెందిన అలిగేటి మల్లేశం(37), జగిత్యాలకు చెందిన భోగ రాకేష్‌(35), కరీంనగర్‌ జిల్లా రామడుగుకు చెందిన బండి ప్రణయ్‌ (25) సాయిరాంకు సహకరిస్తుంటారు. వీరంతా ధర్మారానికి చెంది న విభూది రాంకుమార్‌(37), జగిత్యాల జిల్లా లక్ష్మీపూర్‌కు చెందిన నతర్ల శ్రీనివాస్‌(39), వరంగల్‌కు చెందిన కర్రె రాజు(35), జగిత్యాలకు చెందిన కల్లెడ మహేందర్‌(36), కొండ్ర నరహరి(37), కల్లెడ రాజేష్‌(27) సహా పలువురి పేర్ల మీద కరీంనగర్‌ ఆర్‌బీఎల్‌లో 24 కరెంట్‌ ఖాతాలు తెరిపించారు. ఖాతా ఇచ్చినందుకు సాయిరాం ముఠా ఒక్కో ఖాతాదారుడికి రూ.30వేలు, ప్రతి లావాదేవీకి 2-4 శాతం చొప్పున కమీషన్‌ ఇచ్చేది. ఇక, ఈ ఖాతాలు తెరిచే విషయం లో రత్నాకర్‌ బ్యాంక్‌ లిమిటెడ్‌ మేనేజర్‌ హన్మకొండకు చెందిన భువనగిరి కల్యాణ్‌(52), క్యాషియర్‌ కరీంనగర్‌కు చెందిన ఆయేషా బేగం(30).. సాయిరాం ముఠాకు సహకరించేవారు. ఒక్కో ఖాతాకు రూ.30వేలు చొప్పున తీసుకుని విచారణ చేపట్టకుండా ఖాతాలు ఇచ్చేసేవారు. ఈ ఖాతాల ద్వారా చైనా సైబర్‌ నేర ముఠా 8 కేసు ల్లో రూ.138 కోట్లు కొల్లగొట్టింది. విచారణలో మ్యూల్‌ ఖాతాల వ్యవహారాన్ని గుర్తించిన పోలీసులు సాయిరాం సహా 13 మందిని అరెస్టు చేశారు. మరో 11 మంది కోసం గాలిస్తున్నారు.

Updated Date - Mar 28 , 2026 | 05:17 AM