ఏకపక్షమా.. పొత్తు తప్పదా?
ABN , Publish Date - Feb 08 , 2026 | 06:41 AM
రాష్ట్రంలో మూడో అతిపెద్ద నగరమైన కరీంనగర్ కార్పొరేషన్‌లో పురపోరు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మూడు ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు...
రసవత్తరంగా కరీంనగర్ కార్పొరేషన్ పోరు.. మేయర్ పీఠంపై కమలనాథుల ఫోకస్
తగ్గేదేలే అంటున్న కాంగ్రెస్.. సీట్లు పెరగడం ఖాయం
ఏదో ఓ పార్టీకి మెజార్టీ రాకుంటే పొత్తులే దిక్కు!
కరీంనగర్ నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి, ఫిబ్రవరి 7: రాష్ట్రంలో మూడో అతిపెద్ద నగరమైన కరీంనగర్ కార్పొరేషన్‌లో పురపోరు ఆసక్తికరంగా మారింది. కాంగ్రెస్, బీజేపీ, బీఆర్‌ఎస్ మూడు ప్రధాన రాజకీయ పార్టీలతోపాటు మజ్లిస్, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ ( ఏఐఎఫ్‌బీ), స్వతంత్రులు పోటీపడుతున్నారు. ప్రధాన పార్టీల్లో సీట్లు దక్కని నేతలు ఏఐఎఫ్‌బీ అభ్యర్థులుగా, ఇండిపెండెంట్లుగా బరిలో ఉన్నారు. కొన్నిస్థానాల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులకంటే వీరికే విజయావకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏదైనా పార్టీ పూర్తి మెజారిటీ సాధిస్తుందా? ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీల మధ్య పొత్తులు అవసరమవుతాయా? అన్న చర్చ జరుగుతోంది.
ఎవరికి వారే ధీమాగా..
కరీంనగర్ కార్పొరేషన్‌లో 66 డివిజన్లు ఉన్నాయి. కాంగ్రెస్ 65 డివిజన్లలో పోటీచేస్తోంది. ఒక సీటును పొత్తులో భాగంగా సీపీఐకి ఇచ్చింది. బీజేపీ, బీఆర్‌ఎస్ మొత్తం స్థానాల్లో పోటీచేస్తున్నాయి. ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ (ఏఐఎఫ్‌బీ) 27, ఎంఐఎం 15 స్థానాల్లో పోటీచేస్తున్నాయి. ప్రధాన పార్టీల తరఫున టికెట్ దక్కని స్థానిక నేతలు కొందరు ఏఐఎఫ్‌బీ తరఫున, స్వతంత్రులుగా బరిలో ఉన్నారు. మొత్తంగా 34 డివిజన్లలో గెలిచిన పార్టీ మేయర్ సీటును దక్కించుకోనుంది. బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్.. ఎవరికివారే మేయర్ పీఠం కైవసం చేసుకుంటామని ప్రకటనలు చేస్తున్నాయి. అయితే ఫలితాలు వెల్లడైన తర్వాత.. అప్పటి పరిస్థితులకు అనుగుణంగా పొత్తులు పెట్టుకోవటానికి లోపాయకారీగా చర్చలు జరుగుతున్నాయని ప్రచారం జరుగుతోంది. ఒక జాతీయ పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీకి చెందిన ఇద్దరు ముఖ్యనేతల మధ్య అంతర్గత ఒప్పందం కుదిరిందన్న ప్రచారం కరీంనగర్‌లో హాట్ టాపిక్‌గా మారింది. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ కలిసే అవకాశం లేదని.. ఉమ్మడి ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ ను దెబ్బతీయటానికి అవసరమైతే బీజేపీ, బీఆర్‌ఎస్ ఎన్నికల తర్వాత కలిసే అవకాశం ఉందని కొందరు విశ్లేషిస్తున్నారు. కాంగ్రెస్‌కుమ్యాజిక్ ఫిగర్ రాకపోతే.. ఎంఐఎంతోగానీ, ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్‌తోగానీ పొత్తు పెట్టుకునే అవకాశాలు ఉంటాయని అంటున్నారు.
కమలం వికసించేనా?
క్షేత్రస్థాయిలో ప్రస్తుత పరిస్థితుల ప్రకారం కరీంనగర్ కార్పొరేషన్‌లో బీజేపీ వైపు మొగ్గు ఎక్కువగా కనిపిస్తోంది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, స్థానిక ఎంపీ బండి సంజయ్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని ప్రచారం చేస్తున్నారు. ఆంధ్రజ్యోతి క్షేత్రస్థాయిలో చేపట్టిన పరిశీలన ప్రకారం.. బీజేపీకి మెజార్టీ స్థానాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 34 సీట్లు గెలిచి మ్యాజిక్ ఫిగర్ చేరుతుందా? బహుముఖ పోటీలో సీట్లు తగ్గుతాయా? అన్నది చర్చనీయాంశంగా మారింది. మెజారిటీ సీట్లు సాధించినా మ్యాజిక్ ఫిగర్ కంటే కొన్ని సీట్లు తగ్గితే... ఏఐఎ్‌ఫబీ, స్వతంత్ర మద్దతు కూడగట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. అవసరమైతే ప్రాంతీయ పార్టీ సహకారం తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదని నగర వాసులు చెబుతున్నారు.
మునిసిపాలిటీలపైనే మంత్రుల ఫోకస్..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 14 మునిసిపాలిటీలు, ఒక కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ జిల్లా నుంచి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ ముగ్గురు మంత్రులుగా ఉన్నారు. ఈ ముగ్గురూ వారి నియోజకవర్గాల్లో, కొత్త జిల్లాల పరిధిలోని మునిసిపాలిటీలపైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ విషయంలో అంటీముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాంగ్రెస్ కరీంనగర్ నియోజకవర్గ ఇన్‌చార్జిగా ఇటీవల వెలిచాల రాజేందర్‌రావును నియమించారు. టికెట్ల కేటాయింపు కోసం స్ర్కీనింగ్ కమిటీ ఉన్నా.. వెలిచాల సూచించినవారికే బీ-ఫారాలు ఇచ్చారని, మంత్రులు సూచించిన పేర్లను పరిగణనలోకి తీసుకోలేదనే విమర్శలు ఉన్నాయి. అయితే.. గతంలో కంటే సీట్లు పెరగడం ఖాయమని, కానీ మెజార్టీ సీట్లు రాకపోవచ్చని అంటున్నారు.
బీఆర్‌ఎస్‌కు మూడో స్థానమే!
గత అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ విజయభేరి మోగించింది. కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో మాత్రం బీఆర్‌ఎస్ గెలిచింది. కానీ అప్పటితో పోలిస్తే బీఆర్‌ఎస్ గ్రాఫ్ పడిపోయిందని, కార్పొరేషన్ ఎన్నికల్లో ఆ పార్టీ ప్రభావం అంతగా ఉండదని స్థానికులు చెబుతున్నారు. బీఆర్‌ఎస్ మూడో స్థానానికి పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయని అంటున్నారు.