Share News

ఈ విజయానికి మీరే స్ఫూర్తి

ABN , Publish Date - Apr 03 , 2026 | 05:16 AM

కరీంనగర్‌ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకోవడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ని ప్రత్యేకంగా అభినందించారు.

ఈ విజయానికి మీరే స్ఫూర్తి

  • కరీంనగర్‌ కార్పొరేషన్‌లో బీజేపీ గెలుపుపై ప్రధాని మోదీతో కేంద్ర మంత్రి బండి సంజయ్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌ కార్పొరేషన్‌ను బీజేపీ కైవసం చేసుకోవడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. స్థానిక ఎంపీ, కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ని ప్రత్యేకంగా అభినందించారు. సంజయ్‌ గురువారం మోదీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పార్టీ చరిత్రలో తొలిసారిగా కరీంనగర్‌ కార్పొరేషన్‌పై కాషాయ జెండా ఎగురవేసిన వైనాన్ని సంజయ్‌ మోదీకి వివరించారు. ‘ఈ విజయానికి మీరే స్ఫూర్తి’ అని ప్రధానికి తెలిపారు. మున్సిపల్‌ ఎన్నికల్లో కేంద్ర నిధులు, అభివృద్ధి నినాదంతోనే ప్రజల్లోకి వెళ్లామని చెప్పారు. ముఖ్యంగా ట్రిపుల్‌ తలాక్‌ రద్దుపై ముస్లిం మహిళలు హర్షం వ్యక్తం చేశారని, అందుకే మైనారిటీలు ఎక్కువ ఉన్న డివిజన్లలో బీజేపీ విజయం సాధించిందని సంజయ్‌ వివరించారు. దీంతోపాటు ‘మోదీ గిఫ్ట్‌’ పేరుతో కరీంనగర్‌ పార్లమెంట్‌ పరిధిలోని ప్రభుత్వ స్కూళ్లలో టెన్త్‌ విద్యార్థులందరికీ ఉచితంగా బ్రాండెడ్‌ సైకిళ్లను అందించిన అంశాన్ని ప్రస్తావించారు. ‘ప్రజలకు నిరంతరం సేవ చేయడంలోనే తృప్తి ఉంటుంది. ప్రజా సమస్యల పరిష్కారానికి ఎప్పటికప్పుడు కృషి చేయండి. అట్టడుగు వర్గాల ప్రజలకు కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించడంలో నిర్విరామంగా పనిచేయండ’ని మోదీ సంజయ్‌కు సూచించారు.

నా పేరు చెప్పి దందాలు చేస్తే చర్యలు

భగత్‌నగర్‌: కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో తన పేరు చెప్పి ఎవరైనా కబ్జాలు, అక్రమ దందాలకు పాల్పడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ గురువారం ఒక ప్రకటనలో హెచ్చరించారు. ఎవరైనా తన పేరు చెప్పుకుని అక్రమ దందాలు, పంచాయతీలు, సెటిల్‌మెంట్లతో ప్రజలను ఇబ్బంది పెడితే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. కొత్తగా ఎన్నికైన ప్రజా ప్రతినిధులు సైతం అలాంటి పైరవీకారులతో అప్రమత్తంగా ఉండాలన్నారు. ప్రజలకు నిరంతరం సేవ చేస్తూ పార్టీకి మంచి పేరు తెచ్చేలా పనిచేసేవారిని ప్రోత్సహిస్తానని, అదే సమయంలో ప్రజలను ఇబ్బంది పెడితే ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తన పేరు చెబుతూ ఇబ్బంది పెడితే వెంటనే తన ఎంపీ కార్యాలయ సిబ్బంది దృష్టికి తీసుకురావాలని ప్రజలకు సూచించారు.


మాయమాటలు కాంగ్రెస్‌ నైజం

బీజేపీ మాయమాటలు, బూటకపు హామీలు కాంగ్రెస్‌ నైజమని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు బండా రి శాంతికుమార్‌ దుయ్యబట్టారు. తెలంగాణ, రూ.6 లక్షల కోట్ల అప్పుల్లో ఉందన్న సంగతి తెలిసి కూడా కాంగ్రెస్‌, గత ఎన్నికల్లో అమలుకు సాధ్యంకాని హామీలిచ్చిందన్నారు. వనపర్తి జిల్లా ఖిలా ఘన్‌పూర్‌కి చెందిన పలువురు బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు గురువారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో శాంతికుమార్‌ సమక్షంలో పార్టీలో చేరారు. ‘బీజేపీలో నీటి బిందువుల్లా చేరికలు జరుగుతున్నాయి.. ఇవి మహాసంద్రంగా మారే రోజు ఎంతోదూరంలో లేద’ని ఆయన అన్నారు.

కమ్యూనిస్టులతో కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరి: బీజేపీ

కమ్యూనిస్టు పార్టీలతో కాంగ్రెస్‌ ద్వంద్వ వైఖరి అనుసరిస్తోందని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి ఎన్‌వీ సుభాష్‌ విమర్శించారు. కమ్యూనిస్టు పార్టీలతో ఒకవైపు జాతీయస్థాయిలో వ్యూహాత్మక ఒప్పందం చేసుకోవడం, మరోవైపు కేరళ వంటి రాష్ట్రాల్లో వ్యతిరేకంగా పనిచేస్తున్నట్లు నటించడం కాంగ్రె్‌సకు అలవాటేనన్నారు. ప్రధాని మోదీ, కేరళం సీఎం విజయన్‌ సోదరులంటూ సీఎం రేవంత్‌ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన హోదాకు తగవన్నారు. కమ్యూనిస్టు పార్టీల నాయకులు కాంగ్రె్‌సకు అమ్ముడుపోయారని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోరెడ్డి కిషోర్‌ ఆరోపించారు.

Updated Date - Apr 03 , 2026 | 05:16 AM