Share News

‘కమ్మ’ జనాభాను తక్కువగా చూపారు

ABN , Publish Date - Apr 18 , 2026 | 04:36 AM

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో కమ్మ సామాజిక వర్గం జనాభాను తక్కువ చేసి చూపించారని కమ్మ సంఘాల సమాఖ్య రాష్ట్ర కమిటీ ఆరోపించింది.

‘కమ్మ’ జనాభాను తక్కువగా చూపారు

  • 2011 లెక్కల ప్రకారం కమ్మ జనాభా 20 లక్షలపైనే

  • తాజాగా 3.60లక్షల మంది ఉన్నట్లు చెప్పడం సరికాదు

  • ఈ లెక్కలు సరి చేయాలి: కమ్మ సంఘాల సమాఖ్య

పంజాగుట్ట, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో కమ్మ సామాజిక వర్గం జనాభాను తక్కువ చేసి చూపించారని కమ్మ సంఘాల సమాఖ్య రాష్ట్ర కమిటీ ఆరోపించింది. జరిగిన పొరపాటును వెంటనే సరిదిద్దాలని కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు బొడ్డు రవిశంకరరావు డిమాండ్‌ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గంగవరపు శ్రీరామకృష్ణ ప్రసాద్‌, గౌరవ సలహాదారు బండి రమేష్‌, ఉపాధ్యక్షుడు ఎస్వీ కృష్ణ ప్రసాద్‌ తదితరులతో కలిసి ఆయన మాట్లాడారు. 2011 జనాభా లెక్కల ప్రకారం తెలంగాణలో కమ్మ సామాజిక వర్గం జనాభా 20 లక్షలపైగా ఉందని తెలిపారు. కానీ, రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల్లో కమ్మ జనాభా 3.60 లక్షలు మాత్రమేనని చూపించారన్నారు. జనాభా తక్కువ చేసి చూపడం వల్ల ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు, ఉద్యోగ, ఉపాధి అవకాశాల్లో తమ నిష్పత్తి తగ్గిపోయే ప్రమాదం నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ సంఘాల ద్వారా సేకరించిన సమాచారం ప్రకారం హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లోనే 8.90 లక్షలు, ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 4.60 లక్షలు, నిజామాబాద్‌ జిల్లాలో 1.70 లక్షల మంది కమ్మ జనాభా ఉన్నారని, మొత్తం జనాభా 19.60 లక్షల వరకు ఉంటుందన్నారు. సర్వేలో ఎక్కడో పొరపాటు జరిగిందని, ఈ విషయాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దృష్టికి తీసుకెళ్తామని తెలిపారు.

Updated Date - Apr 18 , 2026 | 04:36 AM