తొలుత ఫెయిల్... ఆ తర్వాత పాస్.. ఇప్పుడు మళ్లీ ఫెయిల్
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:07 AM
గతేడాది నార్కెట్‌పల్లిలోని కామినేని మెడికల్ కాలేజీకి చెందిన ఓ వైద్యవిద్యార్థిని పీజీ పరీక్షల్లో తొలుత ఫెయిల్ అయ్యారు.
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): గతేడాది నార్కెట్‌పల్లిలోని కామినేని మెడికల్ కాలేజీకి చెందిన ఓ వైద్యవిద్యార్థిని పీజీ పరీక్షల్లో తొలుత ఫెయిల్ అయ్యారు. కాళోజీ హెల్త్ యూనివర్సిటీకి చెందిన కొందరు అధికారులు ఆ విద్యార్థినికి చెందిన జవాబు పత్రాలు మరోసారి మూల్యాంకనం చేసి పాస్ చేయించారు. కానీ ఒక్కసారి దిద్దిన పేపర్లను రీవాల్యూవేషన్ చేయకూడదని జాతీయ వైద్య కమిషన్ నిబంధనలు చెబుతున్నాయి. ఇదే విషయాన్ని నాడు ‘ఆంధ్రజ్యోతి’ పత్రిక వెలుగులోకి తీసుకువచ్చింది. కాళోజీ యూనివర్సిటీలో అక్రమార్కులు పేరిట కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన సర్కారు విచారణకు ఆదేశించింది. ‘ఆంధ్రజ్యోతి’లో వచ్చిన కథనం వాస్తవమేనని విచారణ కమిటీ సభ్యులు ప్రభుత్వానికి నివేదించారు. రెండ్రోజుల క్రితం జరిగిన హెల్త్ వర్సిటీ ఎగ్జిక్యూటివ్ బాడీ సమావేశంలో సదరు పీజీ వైద్యవిద్యార్థిని ఉత్తీర్ణత ఎన్‌ఎంసీ నిబంధనలకు పూర్తి విరుద్ధమని, ఆ విద్యార్థిని ఉత్తీర్ణత చెల్లదని సభ్యులంతా ఏకగ్రీవంగా తీర్మానించారు. అదే విషయాన్ని తెలియజేస్తూ వర్సిటీ ఉన్నతాఽధికారులు శుక్రవారం కామినేని వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌కు లేఖ రాసినట్లు తెలుస్తోంది.