కామారెడ్డి ప్రభుత్వ కళాశాల భూముల ఆక్రమణలపై వాస్తవాలు తేల్చాలి
ABN , Publish Date - Feb 24 , 2026 | 05:06 AM
కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల ఆక్రమణలపై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సోమవారం కలెక్టరేట్‌లో అధికారుల....
కలెక్టర్‌ను కోరిన వెంకటరమణారెడ్డి
కలెక్టర్‌ను కలిసిన కాంగ్రెస్ నేతలు
ఎమ్మెల్యేను పరామర్శించిన డీకే అరుణ
కామారెడ్డి, ఫిబ్రవరి 23 (ఆంధ్రజ్యోతి): కామారెడ్డిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల భూముల ఆక్రమణలపై బీజేపీ, కాంగ్రెస్ నేతల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లు కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి సోమవారం కలెక్టరేట్‌లో అధికారుల సమక్షంలో ఆరోపణలపై ఆధారాలతో చర్చకు రావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వ కళాశాల భూముల ఆక్రమణ, కేటాయింపులపై వాస్తవాలు బయటపెట్టాలంటూ కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్‌కు ఆయన వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ సలహాదారుడిగా చెప్పుకొనే షబ్బీర్ అలీ నేరుగా సీఎం వద్దకు వెళ్లి కామారెడ్డి కళాశాల భూములకు సంబంధించిన వివరాలను తీసుకొని రావాలని అధికారులను ఆదేశిస్తే గంటల వ్యవఽధిలో నిజానిజాలు బయటకు వస్తాయి కదా? అన్నారు. అలా చేయకుండా తనపై, తన కుటుంబంపై నిందలు వేస్తూ రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నాడని తెలిపారు. నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకునే ప్రసక్తే లేదన్నారు. తానే స్వయంగా తహసీల్దార్, ఆర్డీవోలకు ఆర్‌టీఐ చట్టం కింద దరఖాస్తు చేసి పూర్తి వివరాలు వెల్లడించాలని కోరానని చెప్పారు. కలెక్టర్‌ను కలిసి భూముల్లో ఏమైనా అవకతవకలు జరిగి ఉంటే నిగ్గు తేల్చాలని కోరానన్నారు. మంత్రిగా పని చేసిన షబ్బీర్ అలీ అప్పుడు ఏం చేశాడని ఎమ్మెల్యే ప్రశ్నించారు. కళాశాల గ్రౌండ్‌పై కొందరు వ్యక్తులు కోర్టుకు వెళ్లి ఆ స్థలం తమదని వాదిస్తుంటే ఈ నాయకులు ఎక్కడికెళ్లారని నిలదీశారు. పోలీసులు ఇప్పటి వరకు ఆరుగురు బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారని.. కాంగ్రెస్ నాయకులు విచ్చలవిడిగా మాట్లాడుతుంటే ఎందుకు కట్టడి చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు కలెక్టరేట్‌కు వచ్చి కళాశాల భూములకు సంబంధించిన ఆధారాలు ఉన్నాయని కలెక్టర్‌కు వివరించారు. ఎమ్మెల్యే అవినీతి చిట్టా తమ దగ్గర ఉందని, ఆయన రాజీనామా చేసే వరకు పోరాటం ఆపబోమని హెచ్చరించారు. విద్యార్థి సంఘాలు, మేధావులు, కుల సంఘాలతో జేఏసీ ఏర్పాటు చేసి ఎమ్మెల్యే అక్రమాలపై ఎండగడతామని చెప్పారు.
ఎమ్మెల్యేపై దాడికి యత్నించడం సిగ్గుచేటు
ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేసేందుకు ప్రయత్నించడం సిగ్గుచేటని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ అన్నారు. సోమవారం ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డిని పరామర్శించిన అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేపై నిరాధార ఆరోపణలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పబ్బం గడుపుకుంటోందని ఆరోపించారు. ఎమ్మెల్యేకు ఇవ్వాల్సిన కనీస ప్రొటోకాల్‌ను ఇవ్వకుండా సీఎం రేవంత్‌రెడ్డి తమ మంత్రులను ఇష్టారీతిన కామారెడ్డి నియోజకవర్గానికి పంపి దౌర్జన్యకాండకు ఆజ్యం పోస్తున్నాడన్నారు.