కామారెడ్డిలో కాంగ్రెస్ పంచాయతీకి తెర
ABN , Publish Date - Jun 25 , 2026 | 04:39 AM
షబ్బీర్ అలీ ‘ఆడియో క్లిప్’ వివాదానికి, కామారెడ్డిలో పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు కాంగ్రెస్ తెరదించింది. కామారెడ్డి(షబ్బీర్ అలీ నియోజకవర్గం)లో...
సమన్వయంతో పనిచేసేందుకు ఇరువర్గాల అంగీకారం
టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ ప్రకటనలో వెల్లడి
హైదరాబాద్, జూన్ 24 (ఆంధ్రజ్యోతి): షబ్బీర్ అలీ ‘ఆడియో క్లిప్’ వివాదానికి, కామారెడ్డిలో పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాలకు కాంగ్రెస్ తెరదించింది. కామారెడ్డి(షబ్బీర్ అలీ నియోజకవర్గం)లో వర్గపోరు నేపథ్యంలో టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌గౌడ్‌ను షబ్బీర్ అలీ తీవ్ర పదజాలంతో విమర్శించినట్లు కొద్దిరోజుల క్రితం ఓ ఆడియో క్లిప్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై విచారణ జరిపిన టీపీసీసీ క్రమశిక్షణ చర్యల కమిటీ బుధవారం ప్రకటన విడుదల చేసింది. పార్టీ బలోపేతం కోసం సమన్వయంతో పనిచేసేందుకు ఇరు పక్షాల నేతలు అంగీకరించారన్నదని ఆ ప్రకటన సారాంశం. ఈ వివాదంపై ఇకపై మీడియా ముందు ఎలాంటి వ్యా ఖ్యలు చేయకూడదని, ఇప్పటివరకు ఒకరిపై ఒకరు పెట్టుకున్న కేసులు, ఫిర్యాదులన్నింటినీ వెనక్కి తీసుకోవడానికి ఇరువర్గాలు స మ్మతించాయి. ఈనెల 21న గాంధీభవన్‌లో ఎంపీ మల్లు రవి అధ్యక్షతన క్రమశిక్షణ కమిటీ విచారణ జరిగింది. షబ్బీర్ అలీ, పీసీసీ ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి, కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ ఇందుప్రియల నుంచి కమిటీ లిఖితపూర్వక, మౌఖి క ఆధారాలను సేకరించింది. నేతల వివరణలు, వారిమధ్య కుదిరిన పరస్పర అవగాహనను పరిగణనలోకి తీసుకున్న క్రమశిక్షణ కమిటీ వివాదానికి ఇంతటితో ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించింది.