Share News

కవిత పార్టీ ఏర్పాటుకు సర్వం సిద్ధం!

ABN , Publish Date - Apr 24 , 2026 | 03:50 AM

తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో కొత్త పార్టీ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. మేడ్చల్‌ జిల్లాలోని మునిరాబాద్‌లో...

కవిత పార్టీ ఏర్పాటుకు సర్వం సిద్ధం!

  • మేడ్చల్‌ జిల్లా మునిరాబాద్‌లో రేపే ఆవిర్భావ సభ

  • ఉద్యమకారులు, మేధావులకు ప్రత్యేకంగా ఆహ్వానాలు

  • జనసమీకరణపై దృష్టి.. 50వేల మంది వస్తారని అంచనా

హైదరాబాద్‌/మేడ్చల్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత నేతృత్వంలో కొత్త పార్టీ ఏర్పాటుకు సర్వం సిద్ధమైంది. మేడ్చల్‌ జిల్లాలోని మునిరాబాద్‌లో అధ్వయ కన్వెన్షన్‌ వేదికగా కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటుకు శనివారం ఉదయం పది గంటలకు ముహూర్తం నిర్ణయించారు. పార్టీ ఆవిర్భావ సభకు జాగృతి శ్రేణులతోపాటు రాష్ట్రవ్యాప్తంగా కవిత మద్దతుదారులు అధిక సంఖ్యలో హాజరుకానున్నట్లు తెలిసింది. తెలంగాణ ఏర్పాటులో క్రియాశీలకంగా వ్యవహరించి, తెలంగాణ ఏర్పాటైన తర్వాత బీఆర్‌ఎస్‌ ఆదరణకు నోచుకోని ఉద్యమకారులను పెద్ద సంఖ్యలో సభకు ఆహ్వానిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. బీఆర్‌ఎస్‌ హయాంలో ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని కవిత మొదటి నుంచి విమర్శిస్తున్నారు. దీంతో తాను ఏర్పాటు చేయబోయే నూతన పార్టీలో వారికి సముచిత స్థానం కల్పించేందుకు ఉద్యమకారులను ఆహ్వానిస్తున్నట్లు చెబుతున్నారు. కవిత సభకు వేలాది మంది ఉద్యమకారులు, ఎన్జీవోలు, పలువురు మేధావులు హాజరవుతున్నట్లు సమాచారం. అలాగే, రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీగా జనసమీకరణకు ఏర్పాట్లు చేస్తున్నారు. వేసవిని దృష్టిలో ఉంచుకుని కార్యక్రమాన్ని ఉదయమే ప్రారంభించి.. వచ్చే వారికి ఇబ్బంది కలగకుండా చూస్తున్నారు. సభకు సుమారు 50వేల మంది వస్తారనే అంచనాతో ఏర్పాట్లు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్‌, సభ ఏర్పాట్లను జాగృతి శ్రేణులు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నాయి. కవిత ప్రారంభించనున్న కొత్త పార్టీలో ఎవరెవరు చేరతారు? బీఆర్‌ఎస్‌ నుంచి ఎవరు వెళ్తారు? అనే దానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ సాగుతోంది. రాష్ట్ర రాజకీయాల్లో కవిత పార్టీ ఏ విధమైన ప్రభావం చూపుతుంది? ఎవరికి నష్టం? అనే దానిపై ఆసక్తికర చర్చలు కొనసాగుతున్నాయి. కాగా, ఇటీవల లొంగిపోయి జనజీవనంలోకి వచ్చిన కొందరు మాజీ మావోయిస్టులు రెండు రోజులుగా కవితతో భేటీ అవుతున్నారని, తమ పార్టీ వైపు వస్తున్నారని.. తమకు వారి మద్దతు ఉంటుందని జాగృతి వర్గాలు తెలిపాయి. ఉద్యమ కారులు, ప్రజా సంఘాల ప్రతినిధులతో పాటు బీఆర్‌ఎస్‌ సహా.. వివిద పార్టీలకు చెందిన కొందరు ముఖ్య నాయకులు పార్టీలో చేరనున్నట్లు జాగృతి ప్రతినిదులు పేర్కొన్నారు.

Updated Date - Apr 24 , 2026 | 03:50 AM