నాలుగేళ్ల మనోవేదన వెంకటేశ్వరస్వామి దయతో తీరింది
ABN , Publish Date - Mar 07 , 2026 | 04:38 AM
రాజకీయ కక్షతో తనపై మద్యం కేసు మోపిన నేపథ్యంలో నాలుగేళ్లుగా పడిన తన మనోవేదన వెంకటేశ్వరస్వామి దయతో తీరిపోయిందని....
న్యాయం, ధర్మం మావైపు ఉన్నాయి: కల్వకుంట్ల కవిత
హైదరాబాద్/తిరుమల, మార్చి 6 (ఆంధ్రజ్యోతి): రాజకీయ కక్షతో తనపై మద్యం కేసు మోపిన నేపథ్యంలో నాలుగేళ్లుగా పడిన తన మనోవేదన వెంకటేశ్వరస్వామి దయతో తీరిపోయిందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం ఆమె తిరుమలలో స్వామివారిని తనభర్త అనిల్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం కవిత మీడియాతో మాట్లాడుతూ.. న్యాయం, ధర్మం తమవైపు ఉన్నాయని ముందునుంచి చెబుతూ వచ్చానని, స్వామివారి దయతో ఆ కేసుకు కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చిందని, అందుకే కాలినడకన వచ్చి స్వామివారికి మొక్కు చెల్లించుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల పక్షాన ఇంటి పార్టీగా పనిచేసేందుకు కొద్దిరోజుల్లో రాజకీయ పార్టీ ఏర్పాటు చేయనున్నామని, ఆ పార్టీకి వెంకటేశ్వరుని ఆశీస్సులు, దయ ఉండాలని ప్రార్థించానన్నారు. తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాలుగా విడిపోయిన్పటికీ ప్రజలుగా అందరం కలిసి ఉండాలని శ్రీవారిని కోరుకున్నానని కవిత వెల్లడించారు.