‘రేవంత్‌రెడ్డి ఒట్టు అంటే ఆ పని ఫట్టు’
ABN , Publish Date - Jul 20 , 2026 | 03:18 AM
సీఎం రేవంత్‌రెడ్డి ఏదైనా ఒట్టు వేసి చెబితే.. ఆ పని ఫట్టే’ అని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు.
తెలంగాణ రక్షణసేన అధినేత్రి కల్వకుంట్ల కవిత
కోరుట్ల, జూలై 19 (ఆంధ్రజ్యోతి): ‘సీఎం రేవంత్‌రెడ్డి ఏదైనా ఒట్టు వేసి చెబితే.. ఆ పని ఫట్టే’ అని తెలంగాణ రక్షణ సేన వ్యవస్థాపకురాలు కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. రైతులకు సాగునీరు అందించడంలో రాష్ట్ర ప్రభుత్వ పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఆదివారం జగిత్యాల జిల్లా కోరుట్లలో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభలో ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో వర్షపాతం తక్కువగా ఉన్నప్పటికీ ప్రభుత్వం ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదని మండిపడ్డారు. మేడిగడ్డ, సుందిళ్ల బ్యారేజీలను నింపి ఈ ప్రాంత రైతులకు సాగునీరు అందించవచ్చన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు రాజకీయం చేస్తున్నాయని విమర్శించారు. గత ప్రభుత్వంలో అవినీతి జరుగుతోందని అప్పటి అధినాయకత్వం దృష్టికి తీసుకెళ్తే కొంత మందిపై చర్యలు తీసుకుందని, మరోమారు అదే విషయాన్ని ప్రస్తావిస్తే తననే పార్టీ నుంచి బయటకు పంపే ప్రయత్నాలు చేశారని కవిత ఆరోపించారు. తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్యను అందిస్తామని, యువతకు ఉపాధి కోసం రుణాలు ఇచ్చి ఆర్థికంగా ఎదిగేలా చూస్తామని కవిత హామీ ఇచ్చారు.