హామీలు అమలు చేయకుంటే రాళ్లతో కొట్టండి
ABN , Publish Date - Jun 08 , 2026 | 06:50 AM
తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం వెంటనే అందజేస్తామని, ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే తెల్లాపూర్ శిలాశాసనం వద్ద తనను కట్టేసి రాళ్లతో కొట్టాలని..
అధికారంలోకి వస్తే ఉచిత విద్య, వైద్యం
యువతకు 4 లక్షల ఉద్యోగాలు: కల్వకుంట్ల కవిత
సంగారెడ్డి క్రైం, జూన్ 7 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం వెంటనే అందజేస్తామని, ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే తెల్లాపూర్ శిలాశాసనం వద్ద తనను కట్టేసి రాళ్లతో కొట్టాలని టీఆర్‌ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. సంగారెడ్డిలో ఆదివారం నిర్వహించిన పార్టీ జెండా పండగ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కలెక్టరేట్ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి టీఆర్‌ఎస్ జెండాను ఆవిష్కరణ చేశారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ అధికారంలోకి రాగానే ఉచిత విద్య, వైద్యంతో పాటు వ్యవసాయ రంగానికి ప్రాధాన్యమిస్తూ ప్రత్యేక అధికారులను నియమిస్తామని తెలిపారు. యువతకు 4లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. యువత ఉపాధి కోసం రూ.20కోట్ల వరకు బ్యాంకుతో సంబంధం లేకుండా నేరుగా రుణసాయం చేస్తామని చెప్పారు. సంగారెడ్డి జిల్లాలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతలంతా ఒక్కటేనని, అంతా కలిసి దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న హరీశ్‌రావు సింగూరు ప్రాజెక్టును తీవ్ర నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. మంత్రి దామోదర రాజనర్సింహ బావమరిది 200 ఎకరాల భూమిని కబ్జా చేస్తున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆమె అన్నారు.