కాంగ్రెస్ పాపం ఊరికే పోదు
ABN , Publish Date - Apr 16 , 2026 | 04:19 AM
రైతులకు ఎన్నో ఏళ్ల కిందట గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రభుత్వం లాక్కోవడం వారి నోటి కాడ బుక్క లాక్కోవడమేనని, ఈ పాపం ఊరికే పోదని...
రైతుల భూములు లాక్కొంటే.. నోటికాడ బుక్క లాక్కున్నట్లే
పది రోజుల్లో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో పార్టీ: కల్వకుంట్ల కవిత
పారిశ్రామిక పార్కు కోసం పరిగి రైతుల భూముల సేకరణపై ఆందోళన
వికారాబాద్, ఏప్రిల్ 15 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): రైతులకు ఎన్నో ఏళ్ల కిందట గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను ఇప్పుడు ప్రభుత్వం లాక్కోవడం వారి నోటి కాడ బుక్క లాక్కోవడమేనని, ఈ పాపం ఊరికే పోదని, కాంగ్రెస్ పార్టీని కాల్చి బూడిద చేసేంత వరకు రైతుల గోస తగులుతుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల అన్నారు. పరిగి మండలంలో పారిశ్రామిక పార్కు కోసం రాపోల్, కాళ్లాపూర్, బాట్ల చందారం గ్రామాల రైతుల భూములను రాష్ట్ర ప్రభుత్వం సేకరించడాన్ని నిరసిస్తూ బుధవారం కవిత, ధర్మ సమాజ్ పార్టీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ ఆధ్వర్యంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట హైదరాబాద్-తాండూరు రహదారిపై బాధిత రైతులతో కలిసి బైఠాయించి ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ పరిగిలో పరిశ్రమల పేరుతో చిన్న,సన్నకారు రైతుల భూములు 1200 ఎకరాలను లాక్కుంటున్నారని విమర్శించారు. సీఎం ఒకవైపు మూసీ బాగు చేస్తానని హైదరాబాద్‌లో చెబుతుంటారని, మరోవైపు మూసీ నెత్తి మీద ఫ్యాక్టరీలు పెట్టి కాలుష్యాన్ని మూసీలోకి తెస్తున్నారని మండిపడ్డారు. రైతులకే కాదు కౌలు రైతులకు కూడా రైతు భరోసా ఇస్తామన్నారని, ఇంతవరకు ఒక్క కౌలు రైతుకు కూడా రాలేదని, ‘సీఎం ఇస్తామన్న మాట కల్లాస్.. చేస్తామన్న పనులు మటాష్’ అని విమర్శించారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రైతుల పరిస్థితి పెనంమీద ఉన్నట్లుగా ఉంటే, ఇప్పుడు పొయ్యిలో పడినట్లుగా మారిందన్నారు. మరో పది రోజుల్లో అంటే ఈ నెల 25న మన ప్రాంతానికి తెలంగాణ జాగృతి ఆధ ్వర్యంలో మరో ప్రాంతీయ పార్టీ రాబోతోందని, పార్టీ ఏర్పాటైన తర్వాత ప్రజల పక్షాన మరిన్ని పోరాటాలు చేస్తామన్నారు.విశారదన్ మహరాజ్ మాట్లాడుతూ ఇండస్ట్రియల్ పార్కు పేరుతో రాష్ట్ర ప్రభుత్వం పేద రైతులకు ద్రోహం చేస్తోందని విమర్శించారు. కాగా, ఎన్టీఆర్ చౌరస్తాలో ధర్నా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పోలీసులు వ్యూహాత్మకంగా వ్యవహరించి కవితను బంట్వారం పీఎ్‌సకు, విశారదన్‌ను మోమిన్‌పేట పీఎ్‌సకు తరలించారు. అనం తరం వారిని సొంతపూచీకత్తుపై వదిలిపెట్టారు.