Share News

కవిత నిర్దోషి

ABN , Publish Date - Feb 28 , 2026 | 04:02 AM

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఐదున్నర నెలలపాటు తిహాడ్‌ జైలులో ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పూర్తిగా నిర్దోషి అని రౌస్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది.

కవిత నిర్దోషి

  • ఢిల్లీ మద్యం కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు క్లీన్‌చిట్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27 (ఆంధ్రజ్యోతి): ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఐదున్నర నెలలపాటు తిహాడ్‌ జైలులో ఉన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత పూర్తిగా నిర్దోషి అని రౌస్‌ అవెన్యూలోని సీబీఐ ప్రత్యేక కోర్టు స్పష్టం చేసింది. ఈ మద్యం కుంభకోణంలో నిందితులైన వారిని కవితతో సహా సౌత్‌ గ్రూపుగా సీబీఐ అభివర్ణించడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించింది. సౌత్‌ గ్రూపునకు చెందిన కొందరు మద్యం వ్యాపారులకు ప్రయోజనం చేకూర్చేందుకే విధానాన్ని రూపొందించారన్న ఆరోపణల్లో పసలేదని పేర్కొంది. ఒక ప్రాంతం ఆధారంగా ఉద్దేశపూర్వకంగా సీబీఐ సౌత్‌ గ్రూప్‌ అని పేరు పెట్టడం చట్టపరంగా అంగీకారయోగ్యం కాదని, మిగతా నిందితులందరికీ నార్త్‌ గ్రూప్‌ అనే పేరెందుకు పెట్టలేదని ప్రశ్నించింది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కల్వకుంట్ల కవిత, విజయ్‌ నాయర్‌, అభిషేక్‌ బోయినపల్లి, అరుణ్‌ రామచంద్ర పిళ్లై, ముత్తా గౌతమ్‌, బుచ్చిబాబు గోరంట్ల, శరత్‌ చంద్రారెడ్డి దక్షిణాది నుంచి ఢిల్లీ మద్యం కుంభకోణంలో పాల్గొన్నట్లు సీబీఐ తన చార్జిషీట్‌లో పేర్కొన్న విషయం తెలిసిందే. అయితే సీబీఐ చార్జిషీట్‌లో పేర్కొన్న కథనమంతా తమ ఊహాగానాలను వాస్తవాలుగా చిత్రీకరించేందుకు చేసిన ప్రయత్నంలో భాగమేనని కోర్టు పేర్కొంది. కాగా, అభిషేక్‌ బోయినపల్లి, అరుణ్‌ రామచంద్ర పిళ్లై.. ఓసారి ఢిల్లీలో, మరోసారి హైదరాబాద్‌లోని ఐటీసీ కోహినూర్‌లో సమావేశమై ఢిల్లీ మద్యం విధానానికి రూపకల్పన చేశారని సీబీఐ తెలపగా.. ఆనాటి నుంచే ఒక పెద్ద కుట్ర జరిగినట్లుగా చిత్రించే ప్రయత్నం జరిగిందని కోర్టు అభిప్రాయపడింది. సౌత్‌ గ్రూప్‌ ప్రయోజనాలకు అనుగుణంగా మద్యం విధానం రూపొందించారనడానికి ఎలాంటి ఆధారాలు లేవని స్పష్టం చేసింది.


పిళ్లై.. కవిత బినామీ అనడానికి ఆధారాల్లేవు..

ఢిల్లీ ఎక్సైజ్‌ విధానం రూపకల్పన, తయారీ అమలుకు సంబంధించిన కుట్రలో కవిత పాల్గొన్నారని, దక్షిణాదికి చెందిన మద్యం వ్యాపారులకు ఢిల్లీలో అవకాశాలు కల్పించేందుకు వీలుగా ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెల్లించేందుకు రూ.వంద కోట్లు డిమాండ్‌ చేసి సేకరించారని చార్జిషీట్‌లో పేర్కొంది. ఇండో స్పిరిట్స్‌లో కవితకు 32.5 శాతం వాటా ఉందని, దానిని తన బినామీ అరుణ్‌ రామచంద్ర పిళ్లై ద్వారా కొనసాగించారని తెలిపింది. ఇండో స్పిరిట్స్‌లో పిళ్లై రూ.3.4 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు కవిత నిధులు ఏర్పాటు చేశారని, ఆమె ఆదేశాల మేరకే కోటి రూపాయలు బదిలీ అయ్యాయని తెలిపింది. అయితే ఈ అభియోగాలను కోర్టు తోసిపుచ్చింది. కవిత తరఫున బినామీగా ఇండో స్పిరిట్స్‌లో అరుణ్‌ పిళ్లైని చేర్చారనడానికి ఆధారాలేవీ లేవని పేర్కొంది. దీంతోపాటు అరబిందో గ్రూపునకు చెందిన మహిర వెంచర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో జరిగిన అక్రమ భూ లావాదేవీల ద్వారా కవిత రూ.14 కోట్లు సమీకరించారని, ఆ మొత్తాన్ని కృత్రిమంగా రూ.28 కోట్లకు పెంచారని సీబీఐ చేసిన ఆరోపణల్నీ కోర్టు తప్పుబట్టింది. కవిత తరఫున జరిగినట్లు చెబుతున్న భూ లావాదేవీలకు, ఎక్సైజ్‌ విధానానికి ఎలాంటి సంబందమూ లేదని తేల్చి చెప్పింది. ఇక అరబిందో గ్రూప్‌ కంపెనీ ద్వారా తెలంగాణ జాగృతికి కార్పొరేట్‌ సహాయ నిధుల కింద రూ.80 లక్షలు బదిలీ అయ్యాయని, ఇందుకు బదులుగా శరత్‌ చంద్రారెడ్డికి రిటైల్‌ జోన్లు కేటాయించారని చార్జిషీట్‌లో సీబీఐ పేర్కొనగా.. సీఎ్‌సఆర్‌ కింద అరబిందో గ్రూప్‌.. కవిత సంస్థకు నిధులు చెల్లించేందుకు, ఢిల్లీ మద్యం కుంభకోణానికి మధ్య ఎలాంటి సంబంధం లేదని కోర్టు స్పష్టం చేసింది. నిధులిఇచ్చిన వారికి, వారి మద్యం వ్యాపార ప్రయోజనాలకు సంబంధాన్ని అంటగట్టేందుకే ఈ ఆరోపణలు చేశారని అభిప్రాయపడింది. ఈ మొత్తాన్ని తనకు చెల్లించాల్సిందిగా కవిత డిమాండ్‌ చేసినట్లు ఎలాంటి ఆధారాలు లేవని, ఆమెపై అనుమానాలకు ఏ ఆస్కారమూ లేదని పేర్కొంది. అంతేకాదు.. ఢిల్లీ మద్యం కుంభకోణంపై కుట్ర జరిగిందని చెబుతున్న రోజుల్లో కవిత ఢిల్లీకే రాలేదని, ఎలాంటి సమావేశాల్లో పాల్గొనలేదని, కేజ్రీవాల్‌ను గానీ, సిసోడియాను గానీ కలుసుకోలేదని తెలిపింది.


కవిత పేరును చేర్చడం అక్రమం..

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవిత పేరును చేర్చడం అక్రమమం అని, రాజకీయంగా ఆమెకున్న పేరు ప్రతిష్ఠలు, హోదాను దృష్టిలో పెట్టుకునే ఆమెను ఇరికించే ప్రయత్నం చేశారని కవిత న్యాయవాదులు మోహిత్‌రావు, యూజిన్‌ ఎస్‌ ఫిలోమినయ్‌ చేసిన వాదనలను సీబీఐ కోర్టు ప్రస్తావించింది. అక్రమ లావాదేవీల కోసం జరిగిన ఏ సమావేశంలోనూ కవిత పాల్గొనలేదని, అందుకు సంబంధించిన పత్రాలు, ప్రయాణ వివరాలు, ఎలకా్ట్రనిక్‌ కమ్యూనికేషన్లు ఏవీ ఆమెకు వ్యతిరేకంగా లేవని వారు స్పష్టం చేశారు. ఆమె ఏ రిటైల్‌ జోన్‌ కోసం గానీ , ఏ హోల్‌సేల్‌ స్టాల్‌ కోసం గానీ దరఖాస్తు చేసుకోలేదని, మొత్తం లైసెన్సు ప్రక్రియలో ఆమె పాత్ర ఎక్కడా లేదని వారు వాదించారు. కేవలం సహ నిందితులు, సాక్షుల ప్రకటనల ఆధారంగా కవితను ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఇరికించడం సరైంది కాదని, ఆమెకు వ్యతిరేకంగా వచ్చిన సాక్ష్యాలేవీ నిర్ధారించ తగినవి కాదని కవిత తరఫు న్యాయవాదులు చేసిన వాదనలను సీబీఐ కోర్టు స్వీకరించింది. కవితపై ప్రాథమిక సాక్ష్యాధారాలేవీ లేకపోవడం వల్ల ఈ కేసు నుంచి విముక్తి చేయాలని నిర్ణయించినట్లు తెలిపింది.

Updated Date - Feb 28 , 2026 | 04:02 AM