డాడీ.. మోడీ.. చిన్న మోడీపైనే నా పోరాటం
ABN , Publish Date - Mar 20 , 2026 | 05:39 AM
నేను ఎవరితోనూ రాజీపడను.. ఆ అవసరం కూడా నాకు లేదు. నా పోరాటమంతా డాడీ (కేసీఆర్), మోడీ (ప్రధాని), చిన్నమోడీ (సీఎం రేవంత్‌రెడ్డి) పైనే’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు.
నేను దూరమయ్యాక నిజామాబాద్‌లో బీఆర్‌ఎస్ బాగా నష్టపోయింది
వనపర్తి నుంచి పోటీ చేయమని కార్యకర్తలు కోరుతున్నారు
బీఆర్‌ఎస్‌తో నాకున్న విభేదాలను రేవంత్ రెడ్డి అవకాశంగా చేసుకుంటున్నారు
త్వరలోనే కొత్త పార్టీని ప్రకటిస్తా దాని కంటే ముందు జాతీయ స్థాయి నేతలను కలుస్తా
మీడియా చిట్‌చాట్‌లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): ‘‘నేను ఎవరితోనూ రాజీపడను.. ఆ అవసరం కూడా నాకు లేదు. నా పోరాటమంతా డాడీ (కేసీఆర్), మోడీ (ప్రధాని), చిన్నమోడీ (సీఎం రేవంత్‌రెడ్డి) పైనే’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. తెలంగాణ జాగృతి కార్యాలయంలో గురువారం ఆమె మీడియా చిట్‌చాట్‌లో మాట్లాడారు. తాను బీఆర్‌ఎస్‌కు దూరమైన తర్వాత నిజామాబాద్ జిల్లాలో ఆ పార్టీ పూర్తిగా నష్టపోయిందన్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్ జిల్లాల్లో జాగృతి పార్టీ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడ్డారు. దక్షిణ తెలంగాణ, ఉత్తర తెలంగాణ అని కాదు.. చాలాచోట్ల నుంచి తనను ఎన్నికల్లో పోటీ చేయమంటున్నారని, ఇటీవల వనపర్తి నుంచి పోటీ చేయాలని జాగృతి కార్యకర్తలు కోరుతున్నారని తెలిపారు. అయితే, ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలనే విషయాన్ని సమయానుగుణంగా నిర్ణయించుకుంటానని చెప్పారు. బీఆర్‌ఎస్‌తో తనకున్న విభేదాలను సీఎం రేవంత్‌రెడ్డి అవకాశంగా తీసుకుంటున్నార ని ఆరోపించారు. తనకు ఎటువంటి బేషజాలు లేవని, అందరినీ కలుపుకొనిపోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. భవిష్యత్తులో విశారదన్, ప్రజా సంఘాలు, సీపీఎం, సీపీఐఎం ఎల్ న్యూడెమొక్రసీ పార్టీలతో కలిసి పోరాటం చేస్తామని వెల్లడించారు. సామాజిక తెలంగాణ ధ్యేయంతో.. సర్వోదయ రాష్ట్రం దిశగా ముందుకు వెళ్తున్నామని, ఇందుకోసం గాంధీజీ సర్వోదయ సిద్దాంతాన్నిఅధ్యయనం చేస్తున్నానని చెప్పారు. మంచి ముహూర్తం చూసుకొని తన కొత్త పార్టీని త్వరలోనే ప్రకటిస్తానని వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో పనిచేసిన యువతకు రాజకీయంగా అవకాశం కల్పిస్తామని చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ప్రభావం కచ్చితంగా ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. అయితే పార్టీ ప్రకటనకు ముందే... శ్రీరామనవమి తర్వాత పలువురు జాతీయ స్థాయి నేతలను కలవనున్నానని కవిత తెలిపారు. కాగా, తెలంగాణ ప్రజా జాగృతి పేరిట కవిత కొత్త పార్టీని త్వరలోనే ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.
2,15,200 కోట్లతో జాగృతి ప్రజా బడ్జెట్
రాష్ట్ర ప్రభుత్వం నేడు బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో జాగృతి ప్రజా బడ్జెట్ పేరిట ఆ సంస్థ అధ్యక్షురాలు కవిత రూ.2,15,200కోట్లతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. ప్రభుత్వం 3లక్షల కోట్లకు పైగా అంచనాలతో బడ్జెట్ ప్రవేశపెట్టనుందని, తాము 2.15లక్షల కోట్లతోనే బడ్జెట్ ప్రతిపాదిస్తున్నామని చెప్పారు. ప్రజల సూచనల మేరకే ప్రజా బడ్జెట్‌ను రూపొందించామన్నారు. ప్రజా బడ్జెట్‌లో విద్య, వైద్యం, సంక్షేమానికి పెద్ద పీట వేశామని, కాగా సంక్షేమ పథకాలను గాంధీ కుటుంబ సభ్యులే కాదు తమకు నచ్చిన వారి పేర్లతో ప్రకటించుకోవచ్చన్నవారు. తాము ప్రతిపాదించిన బడ్జెట్ వల్ల రాష్ట్ర పురోగతితో పాటు సంపద సృష్టి కూడా జరుగుతుందని కవిత పేర్కొన్నారు.