బీసీల నోటికాడి ముద్దను గుంజుకున్న వ్యక్తికి బీఆర్‌ఎస్ టికెటా?
ABN , Publish Date - Feb 07 , 2026 | 04:28 AM
బీసీల నోటికాడి ముద్దను గుంజుకున్న బుట్టంగారి మాధవ రెడ్డికి బీఆర్‌ఎస్ టికెట్ ఎలా ఇచ్చింది..? బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసిన వ్యక్తి మాధవ రెడ్డి అని, పార్టీ టికెట్ ఇవ్వడం ద్వారా బీసీ....
పిటిషన్ వేసిన వ్యక్తికి ఎలా ఇస్తారు?.. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేయించింది బీఆర్‌ఎస్సే
హరీశ్‌తో పాటు ఆ పార్టీ పాత్ర ఉంది
టీవీ సీరియల్‌లా ఫోన్‌ట్యాపింగ్ కేసు
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): ‘‘బీసీల నోటికాడి ముద్దను గుంజుకున్న బుట్టంగారి మాధవ రెడ్డికి బీఆర్‌ఎస్ టికెట్ ఎలా ఇచ్చింది..? బీసీ రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ పిటిషన్ వేసిన వ్యక్తి మాధవ రెడ్డి అని, పార్టీ టికెట్ ఇవ్వడం ద్వారా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని బీఆర్‌ఎస్ రాజముద్రంతో చెప్పినట్లైంది. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రజలకు బీఆర్‌ఎస్ వివరణ ఇవ్వాలి’’ అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. శుక్రవారం జాగృతి కార్యాలయంలో ఆమె విలేకర్లతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా కేసు వేసిన మాధవ్ రెడ్డి అనే వ్యక్తి హరీశ్‌రావు అనుచరుడని పేర్కొన్నారు. హరీశ్ ఈ కేసు వేయించారని, అప్పట్లో దీని వెనుక హరీశ్ మాత్రమే ఉన్నారని అనుకున్నానని, ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీఆర్‌ఎస్ కూడా ఉందని తేటతెల్లమయిందన్నారు. తెలంగాణలో 56 శాతంగా ఉన్న బీసీల విషయంలో బీఆర్‌ఎస్ చిత్తశుద్ధితో లేదని తేలిందని చెప్పారు. ఈ వ్యవహారంలో బీసీలంతా బీఆర్‌ఎస్ వైఖరిని గమనించాలని కోరారు. ఇక బుట్టంగారి మాధవ్ రెడ్డిని నాయకుడిని చేసింది జాగృతియేనని, 2010 వరకు ఆయన తమతోనే ఉన్నారని తెలిపారు. బీఆర్‌ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని నిజామాబాద్ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా నియమించారని ఇదేం పద్దతి అని ప్రశ్నించారు. ప్రకాశ్ గౌడ్, తెల్లం వెంకట్రావు బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలేనని అసెంబ్లీ స్పీకర్ ప్రకటించారని, వారిని కూడా కాంగ్రెస్ మునిసిపల్ ఎన్నికల ఇన్‌చార్జులుగా నియమించారని, ఈ విషయంలో కాంగ్రెస్ వ్యవహారం నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు అన్నట్లుగా ఉందని విమర్శించారు. రాహుల్ గాంధీ పట్టుకునే రాజ్యాంగ పుస్తకంపై నమ్మకం ఉంటే స్పీకర్ ఇప్పటికైనా అరికెపూడి గాంధీపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. మునిసిపల్ ఎన్నికల్లో జాగృతి తరఫునసింహం గుర్తుపై పోటీ చేస్తున్నామని, ప్రశ్నించే తమలాంటి వాళ్లతో పాటు సీపీఎం, న్యూ డెమోక్రసీ, స్వతంత్ర అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. బీఆర్‌ఎస్ తమను మోసం చేసిందన్న కారణంతో ఉద్యమకారులంతా కాంగ్రె్‌సకు ఓటు వేశారని, కానీ కాంగ్రెస్ కూడా వారికి న్యాయం చేయడం లేదన్నారు. ఈనెల 12న తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభను నిర్వహిస్తున్నామని, దీనికి ఉద్యమకారులు, అమరుల కుటుంబ సభ్యులు, తెలంగాణ వాదులు హాజరుకావాలని కోరారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్ రావు అనే చిన్న చేపను పట్టుకొని పెద్ద చేపలను వదిలేసే ప్రయత్నం జరుగుతున్నట్లు అనిపిస్తోందని కవిత అనుమానం వ్యక్తం చేశారు. డీఎస్పీగా ఉన్న ప్రణీత్ రావుకు డిమోషన్ ఇచ్చారంటే ఏమైనా ఆధారాలు దొరికాయోమోనని చెప్పారు. ట్యాపింగ్ కేసును టీవీ సీరియల్‌లా సాగదీస్తున్నారని, ఇది ఎప్పుడు తుది దశకు చేరుతుందో చెప్పాలని డిమాండ్ చేశారు.
ఉద్యమంలో అందరిది ఒక పేజీ.. కేసీఆర్‌ది పుస్తకమే
తెలంగాణ ఉద్యమ చరిత్రలో మనందరికీ ఒక పేజీ ఉంటే... కేసీఆర్‌కు మొత్తం పుస్తకమే ఉంటుందని, చరిత్రను ఎవరు చెరిపివేయలేరని కవిత చెప్పారు. కేసీఆర్‌కు తాను మద్దతుగా మాట్లాడటం లేదని, రాజకీయంగా ఆయన విధానాలతో విభేదిస్తానని, తెలంగాణలో మర్యాదపూర్వకమైన రాజకీయాలు ఉండాలని కోరుకుంటానన్నారు. విమర్శలు చేసేప్పుడు ఒక లైన్ ఉంటుంది.. కానీ ముఖ్యమంత్రి అన్ని లైన్లు దాటి విమర్శలు చేశారని, ఒక జాతిని విమర్శించటం అనేది ఎవరు కూడా హర్షించరని పేర్కొన్నారు.