కాళేశ్వరానికి పైసా ఇచ్చారా? కేసీఆర్ ఇంట్లోంచి తెచ్చారా?
ABN , Publish Date - Apr 03 , 2026 | 04:37 AM
కాళేశ్వరంపై ఖర్చు చేసిన లక్ష కోట్లు నీళ్లపాలేనంటూ కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చే సిన వ్యాఖ్యలపై గురువారం రాజ్యసభలో బీజేపీ....
‘కాళేశ్వరం’పై రాజ్యసభలో బీఆర్‌ఎస్ వర్సెస్ బీజేపీ
కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ అభ్యంతరం
సభా హక్కుల నోటీసు ఇస్తామని సురేశ్‌రెడ్డి హెచ్చరిక
దుబాయ్ నుంచి నిధులు తెచ్చి కాళేశ్వరం కట్టారా?
ఆ ప్రాజెక్టుతో తెలంగాణకు ఏ మాత్రం ప్రయోజనం లేదు
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఎదురుదాడి
సోనియా కాళ్లు పట్టుకున్నప్పుడు తెలంగాణ గుర్తు రాలేదా అని ప్రశ్న
కేసీఆర్‌ను సీఎం రేవంత్ ఎందుకు జైలుకు పంపడం లేదని నిలదీత
న్యూఢిల్లీ, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరంపై ఖర్చు చేసిన లక్ష కోట్లు నీళ్లపాలేనంటూ కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్ చే సిన వ్యాఖ్యలపై గురువారం రాజ్యసభలో బీజేపీ, బీఆర్‌ఎస్ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్ట సవరణ బిల్లు -2026పై చర్చలో భాగంగా బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్‌రెడ్డి ఈ అంశాన్ని ప్రస్తావించారు. మంత్రి సీఆర్ పాటిల్ తన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇస్తామని హెచ్చరించారు. సురేశ్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అంతే దీటుగా బదులివ్వటంతో పెద్దల సభలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది.
తెలంగాణకు కేంద్రం ఏమీ ఇవ్వలేదు: సురేశ్‌రెడ్డి
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత 12 ఏళ్లలో తెలంగాణ అభివృద్ధి కోసం పైసా ఇవ్వలేదని సురేశ్‌రెడ్డి విమర్శించారు. ఏపీ పునర్విభజన చట్టం - 2014కు కేంద్రం చేసిన మొదటి సవరణలోనే తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన 7 మండలాలను ఏపీలో కలిపారని విమర్శించారు. అసెంబ్లీ తీర్మానం, స్థానిక ప్రజల అభిప్రాయాలు తీసుకోకుండా అన్యాయంగా వాటిని ఏపీలో కలిపేశారని ఆరోపించారు. ‘కేంద్రం సహకరించకున్నా సొంత డబ్బులతో తెలంగాణ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకుంది. ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే తెలంగాణను నంబర్ వన్‌గా నిలబెట్టుకున్నాం. అలాంటిది.. కాళేశ్వరం ప్రాజెక్టుతో రూ.లక్ష కోట్లు నీటిలో కొట్టుకుపోయాయని మంత్రి సీఆర్ పాటిల్ ఎలా అంటారు? ఒక్క రూపాయి ఇవ్వలేదని చెప్పిన ఆయన.. ఆ ప్రాజెక్టుపై ఎలా మట్లాడతారు? సీఆర్ పాటిల్ తక్షణమే తన మాటలు వెనక్కి తీసుకోవాలి. క్షమాపణలు చెప్పాలి. లేదంటే ఆయనపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇస్తాం. కేంద్రమంత్రి వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి’ అని సురేశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. అతిపెద్ద ప్రాజెక్టులో రెండు పిల్లర్లు కూలితే మరమ్మతు చేయాల్సింది పోయి, కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిర్లక్షం చేస్తోందని ఆరోపించారు.
కేసీఆర్‌ను రేవంత్ ఎందుకు జైలుకు పంపలేదు: కిషన్‌రెడ్డి
సురేశ్‌రెడ్డి విమర్శలను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తిప్పికొట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం అని ఆరోపించారు. కాళేశ్వరంలోని మేడిగడ్డ బరాజ్ పూర్తిగా నీళ్లలో ముగినిపోయిందని తెలిపారు. నేషనల్ డ్యాం ేసఫ్టీ అథారిటీ, కాగ్ నివేదికలు ఇదే విషయాన్ని చెప్పాయని పేర్కొన్నారు. తెలంగాణకు కాళేశ్వరంతో ఎలాంటి ఉపయోగం లేదని అన్నారు. కాళేశ్వరానికి కేంద్రం నుంచి ఒక్క పైసా తీసుకోలేదని చెబుతున్న బీఆర్‌ఎస్ నేతలు... దుబాయ్ నుంచి డబ్బులు తెచ్చి నిర్మించారా? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అదంతా ప్రజాధనమని, కేసీఆర్ ఇంటినుంచి తేలేదని అన్నారు. కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సంస్థల నుంచే నిధులు తీసుకుని ఈ ప్రాజెక్టును నిర్మించారని తెలిపారు. కాళేశ్వరం అవినీతిపై విచారణ చేస్తామని, కేసీఆర్‌ను జైలుకు పంపుతామని పదేపదే చెప్పిన తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి.. ఎందుకు పంపడం లేదని ప్రశ్నించారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు తోడుదొంగలని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో కాంగ్రెస్ నేత సోనియాగాంధీ కాళ్లు పట్టుకున్నప్పుడు రాష్ట్ర ప్రయోజనాలు కేసీఆర్‌కు గుర్తుకు రాలేదా? అని ప్రశ్నించారు. భద్రాచలంలోని గ్రామాలను ఏపీలో కలపాలనే ప్రతిపాదనను విభజన బిల్లులో ఆనాటి కాంగ్రెస్ సర్కారే చేర్చిందని తెలిపారు. ఈ విషయంలో ఆ రోజు సోనియాగాంధీని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
ఏ ప్రభుత్వమూ సొంత డబ్బులతో నిర్మించదు: ఎంపీ వద్దిరాజు
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యలపై బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర అభ్యంతరం తెలిపారు. ‘రూ.60 వేల కోట్ల అప్పు తెచ్చి కాళేశ్వరం నిర్మించాం. ఏ పాలకులూ తమ ఇంటి నుంచి డబ్బులు తెచ్చి సంక్షేమ పనులు, అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టరు. ప్రజల నుంచి పన్నుల రూపంలో ేసకరించిన డబ్బులనే ఖర్చు చేస్తారు. ఆ విషయం కిషన్‌రెడ్డికి తెలియకపోవడం బాధాకరం. కాళేశ్వరం లేదా పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టులలో ఒక దానికి జాతీయ హోదా ఇవ్వాలి. మంత్రులు సీఆర్ పాటిల్, కిషన్‌రెడ్డి... కాళేశ్వరం ప్రాజెక్టు, కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలి’ అని డిమాండ్ చేశారు. భద్రాద్రి రామాలయం తెలంగాణలో, ఆస్తులు ఆంధ్రలో ఉన్నాయని.. ఇదెక్కడి న్యాయమని ప్రశ్నించారు. రేణుకాచౌదరి మాట్లాడుతూ.. భద్రాచలానికి ఆనుకుని ఉన్న ఐదు గ్రామపంచాయతీలను తిరిగి తెలంగాణకు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. ఆ గ్రామాలను ఏపీలో కలపటంతో భద్రాచలం పట్టణానికి అనేక సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు.