Share News

కళకళలాడిన కాళేశ్వరం

ABN , Publish Date - Jun 01 , 2026 | 05:23 AM

త్రివేణి సంగమ క్షేత్రం.. భక్తజన సంద్రమైంది. పుష్కరాల్లో భాగంగా 11వ రోజు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ, ఏపీలతోపాటు మహారాష్ట్ర....

కళకళలాడిన కాళేశ్వరం

  • ఘనంగా సరస్వతి అంత్యపుష్కరాలు.. భారీగా తరలివచ్చిన భక్తులు

  • నేటితో ముగియనున్న పుష్కరాలు

భూపాలపల్లి, మే 31 (ఆంధ్రజ్యోతి): త్రివేణి సంగమ క్షేత్రం.. భక్తజన సంద్రమైంది. పుష్కరాల్లో భాగంగా 11వ రోజు భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. తెలంగాణ, ఏపీలతోపాటు మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల నుంచి తండోపతండాలుగా వచ్చి పుష్కరస్నానం ఆచరించి పునీతులయ్యారు. ఆధ్యాత్మిక వేత్త, కొల్చారం పీఠాధిపతి శ్రీమాధవానంద సరస్వతి హాజరై పుష్కర స్నానం ఆచరించి సరస్వతి నదికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో వేద పండితులు మహారుద్ర హోమం నిర్వహించారు. జెన్‌కో సీఎండీ కృష్ణభాస్కర్‌ పుష్కరస్నానం అనంతరం ఆలయంలో పూజలు చేశారు. పదో రోజు వరకు 5వేల నుంచి 30వేల వరకు వచ్చిన భక్తులు ఆదివారం ఒక్కసారిగా లక్షకు పెరగడంతో కాళేశ్వరం కళకళలాడింది. కాగా, సరస్వతీ అంత్య పుష్కరాలు సోమవారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ ఆదివారం కాళేశ్వరం చేరుకున్నారు. అధికారులు, వేద పండితులతో సమావేశమై ముగింపు కార్యక్రమాల ఏర్పాట్లను సమీక్షించారు.

Updated Date - Jun 01 , 2026 | 05:23 AM