జనసందోహంగా త్రివేణి సంగమం
ABN , Publish Date - May 25 , 2026 | 04:52 AM
కాళేశ్వర క్షేత్రంలో సరస్వతి అంత్యపుష్కరాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వారాంతపు సెలవు కావడంతో ఆదివారం పెద్ద సంఖ్యలో ...
సరస్వతి అంత్యపుష్కరాలకు కాళేశ్వరానికి పోటెత్తిన భక్తజనం
కన్నుల పండువగా నవరత్న హారతి, తెప్పోత్సవం
భూపాలపల్లి, కాళేశ్వరం, మే 24 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వర క్షేత్రంలో సరస్వతి అంత్యపుష్కరాలు అత్యంత వైభవంగా కొనసాగుతున్నాయి. వారాంతపు సెలవు కావడంతో ఆదివారం పెద్ద సంఖ్యలో భక్తులు తరలిరావడంతో త్రివేణి సంగమ తీరం భక్తజన సందోహంగా మారింది. మండుతున్న ఎండలను కూడా లెక్కచేయకుండా తరలివచ్చిన భక్తులు సరస్వతి నదిలో పుణ్యస్నానాలు ఆచరించారు. శృంగేరి పీఠాధిపతి అద్వైతానంద భారతి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీనుబాబు తదితర ప్రముఖులు కూడా సరస్వతి నదిలో ఆదివారం పుష్కర స్నానం ఆచరించారు. పుష్కర స్నానం అనంతరం శృంగేరి పీఠాధిపతి అద్వైతానంద భారతి.. శ్రీ కాళేశ్వర ముక్తీశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. మరోపక్క, పుష్కరాలకు ఆదివారం వచ్చిన భక్తుల్లో 26 మంది ఎండలు, వడగాలుల ప్రభావంతో అస్వస్థతకు గురయ్యారు. వీరిలో ఐదుగురు వడదెబ్బకు గురైనట్టు వైద్యులు తేల్చారు. ఇక, భక్తుల నుంచి కానుకలను స్వీకరించేందుకు గాను ఆలయ అధికారులు డిజిటల్ బాట పట్టారు.ఆలయ బ్యాంకు ఖాతాకు సంబంధించిన క్యూఆర్ కోడ్ పోస్టర్లను ఏర్పాటు చేశారు. భక్తులు కూడా ఈ-హుండీ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకున్నారు.