Share News

కాళేశ్వరం పునరుద్ధరణకు 2,100 కోట్లు

ABN , Publish Date - Oct 09 , 2026 | 03:29 AM

కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు రూ.2,100 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు.

కాళేశ్వరం పునరుద్ధరణకు 2,100 కోట్లు
kaleswaram

  • డయాఫ్రం వాల్‌ల నిర్మాణానికి రూ.1,800 కోట్లు

  • స్టిల్లింగ్‌ బేసిన్‌ల విస్తరణకు రూ.300 కోట్లు

  • అంచనా వేసిన అధికారులు

హైదరాబాద్‌/ వరంగల్‌, అక్టోబరు 8 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పునరుద్ధరణకు రూ.2,100 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు అంచనా వేశారు. ప్రతి బ్యారేజీ ఎగువ భాగంలో ఒక డయాఫ్రం వాల్‌ నిర్మించాలని, ఒక్కో వాల్‌కు రూ.600 కోట్ల వరకు వ్యయం అవుతుందని లెక్కలు వేశారు. బ్యారేజీ అప్‌స్ట్రీమ్‌లో నీటిని నిల్వ చేస్తే.. బ్యారేజీ పునాదుల కింద ఇసుక మైనింగ్‌ జరగకుండా డయాఫ్రం వాల్‌ అడ్డుకుంటుందని గుర్తించారు. 2023 అక్టోబరులో మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాకు కుంగిపోయింది. బ్యారేజీని మొత్తం 8 బ్లాకులుగా నిర్మించారు. ఒక్కో బ్లాకులో 10-11 పిల్లర్ల (పియర్లు) చొప్పున మొత్తం 85 పియర్లు ఉన్నాయి. ఒక బ్లాకులోని ఏ ఒక్క పియర్‌లో సమస్యలు తలెత్తినా, అందులోని అన్ని పియర్లను తొలగించాల్సి ఉంటుందని నిపుణులు తెలిపారు. ఎన్‌డీఎ్‌సఏ నివేదిక కూడా ఏడో బ్లాకును పూర్తిగా తొలగించాలని సిఫారసు చేసింది. మేడిగడ్డ కుంగిన కొద్దిరోజులకే అన్నారం, సుందిళ్లలో భారీగా సీపేజీలు బయటపడ్డాయి. దీంతో ఈ మూడు బ్యారేజీలకు మరమ్మతులు చేసి, తిరిగి వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. నవంబరు లేదా డిసెంబరు నెల నుంచి మరమ్మతులు ప్రారంభం కానున్నాయి. 2027 జూన్‌ నాటికి పనులు పూర్తిచేసి వీటిని వినియోగంలోకి తేవాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నెల 12న బ్యారేజీల పునరుద్ధరణ డిజైన్లపై జరిగే ఓవర్‌ సైట్‌ కమిటీ భేటీలో దీనిపై నిర్ణయం తీసుకోనున్నారు.


ఇదే సమావేశంలో డయాఫ్రంవాల్‌లు ఎంత లోతు వరకు నిర్మించాలి? స్టిల్లింగ్‌ బేసిన్‌ (గేట్ల నుంచి విడుదలయ్యే వరదలోని శక్తిని తగ్గించే వ్యవస్థ)ను ఏ మేరకు విస్తరించాలి? అనే అంశాలపై కూడా నిర్ణయం తీసుకుంటారు. తాజా అంచనా ప్రకారం మేడిగడ్డలోని ఏడో బ్లాకును పూర్తిగా తొలగించకుండా... విరిగిన గేటు ప్రాంతాన్ని పూర్తిగా మూసేసి... వరద పక్క నుంచి సాఫీగా వెళ్లేలా ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. ఒక్కో బ్యారేజీలో స్టిల్లింగ్‌ బేసిన్‌ విస్తరణ కోసం రూ.100 కోట్ల చొప్పున రూ.300 కోట్లు అవసరమని అంచనాకు వచ్చారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కీలకమైన ఈ మూడు బ్యారేజీల నిర్మాణానికే దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చు చేశారు.

Updated Date - Oct 09 , 2026 | 03:29 AM