Share News

కాక రేపుతున్న కాళేశ్వరం!

ABN , Publish Date - Apr 22 , 2026 | 05:13 AM

తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అంశం రాజకీయ వేడిని రగిలిస్తోంది. ఓవైపు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై బుధవారం హైకోర్టు తీర్పు రానుండగా..

కాక రేపుతున్న కాళేశ్వరం!

  • నేడు పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై హైకోర్టు తీర్పు

  • సీబీఐ విచారణకు కేంద్రంపై రేవంత్‌ ఒత్తిడి

  • లేదంటే ఢిల్లీలో ధర్నా చేస్తామని లేఖ

  • బీఆర్‌ఎస్‍లో టెన్షన్‌.. ఢిల్లీలో హరీశ్‌ చర్చలు

వరంగల్‌, ఏప్రిల్‌ 21 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): తెలంగాణ రాజకీయాల్లో కాళేశ్వరం ప్రాజెక్టు అంశం రాజకీయ వేడిని రగిలిస్తోంది. ఓవైపు జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ నివేదికపై బుధవారం హైకోర్టు తీర్పు రానుండగా.. మరోవైపు సీబీఐ విచారణ కోసం కేంద్రంపై సీఎం రేవంత్‌రెడ్డి ఒత్తిడి పెంచుతున్నారు. ఈ పరిణామాలు బీఆర్‌ఎస్‌ పార్టీని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. దీంతో ఆ పార్టీ కీలక నేత హరీశ్‌రావు నేతృత్వంలో మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర బృందం హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. తీర్పు తమకు ప్రతికూలంగా వస్తే ఏం చేద్దామని న్యాయవాదులతో చర్చలు జరిపారు. అయితే హరీశ్‌రావు బృందం ఢిల్లీ పర్యటనపై సీఎం రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు హాట్‌టాపిక్‌గా మారాయి. హైకోర్టు తీర్పు ఇవ్వనున్న సమయంలో హరీశ్‌రావు ఢిల్లీ పర్యటన వెనుక రహస్యమేంటని, ఎవరితో మంతనాలు జరిపారని రేవంత్‌ ప్రశ్నించారు. పైగా, తాను సీబీఐ విచారణ కోసం కేంద్రానికి లేఖ రాయడటంతో.. విచారణను అడ్డుకునేందుకు ఢిల్లీలో బీజేపీ నేతలతో బేరసారాలకు దిగారని, అందుకే విచారణ ఆలస్యమవుతోందని సీఎం చెప్పడం చర్చనీయాంశంగా మారింది. అంతేకాదు.. సీబీఐకి అప్పగిస్తే 48 గంటల్లో కేసీఆర్‌ను, హరీశ్‌రావును జైల్లో పెడతామన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. ఎనిమిది నెలలు కావస్తున్నా ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. తద్వారా బీజేపీని కూడా ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశారు.

కాళేశ్వరాన్ని ప్రస్తావించని కేసీఆర్‌..

సోమవారం కాళేశ్వరంలో సీఎం రేవంత్‌రెడ్డి, జగిత్యాలలో బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఒకేసారి సమావేశాలు నిర్వహించారు. అయితే కాళేశ్వరం అక్రమాలపై సీఎం దూకుడుగా వ్యాఖ్యలు చేయగా.. కేసీఆర్‌ మాత్రం ఈ అంశాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. ఇది గులాబీ శ్రేణుల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందని, దీనిపై సీబీఐతో సమగ్రంగా విచారణ జరపాలని గతేడాది సెప్టెంబరులలో కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. అయితే 8 నెలలు కావస్తున్నా సీబీఐ విచారణ ప్రారంభం కాకపోవడంతో ఇటీవల మరో లేఖ రాసినట్లు సీఎం ప్రకటించారు. అవసరమైతే ఈ అంశంపై డిల్లీలో జంతర్‌మంతర్‌ వద్ద ధర్నా చేస్తానని లేఖలో పేర్కొన్నట్లు చెప్పారు. తన హెచ్చరికలతో కేంద్రంలో కదలికలు వచ్చాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అక్రమాలకు పాల్పడిన వారిని వదిలే ప్రసక్తే లేదని ప్రకటించారు. అయితే హైకోర్టు తీర్పు నేపథ్యంలోనే సీబీఐ విచారణకు ముఖ్యమంత్రి ఒత్తిడి పెంచడం ఆసక్తికరంగా మారింది. జస్టిస్‌ పీసీ ఘోష్‌ నివేదికపై కేసీఆర్‌, హరీశ్‌రావు అభ్యంతరాలను హైకోర్టు పరిగణనలోకి తీసుకుని, వారికి అనుకూలంగా తీర్పు ఇస్తే.. సీబీఐ విచారణతో కాళేశ్వరం అక్రమాలను వెలుగులోకి తేవాలని సీఎం భావిస్తున్నారనే చర్చ జరుగుతోంది.

Updated Date - Apr 22 , 2026 | 05:13 AM