కాళేశ్వరం నివేదికపై హైకోర్టు తీర్పు రిజర్వు
ABN , Publish Date - Mar 13 , 2026 | 04:47 AM
కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(కాళేశ్వరం కమిషన్) ఇచ్చిన నివేదికను కొట్టేయాలంటూ.....
కేసీఆర్, హరీశ్, స్మితపై చర్యలు వద్దన్న ఉత్తర్వుల పొడిగింపు
హైదరాబాద్, మార్చి 12(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్(కాళేశ్వరం కమిషన్) ఇచ్చిన నివేదికను కొట్టేయాలంటూ దాఖలైన పిటిషన్లపై హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. మాజీ సీఎం కేసీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావు, మాజీ ఐఏఎస్ ఎస్కే జోషి, ఐఏఎస్ స్మితా సబర్వాల్ హైకోర్టులో పిటిషన్‌లు దాఖలు చేయగా ఈ పిటిషన్లలో సుదీర్ఘంగా కొనసాగిన వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వు చేస్తున్నట్లు హైకోర్టు డివిజన్ బెంచ్ ప్రకటించింది. ఏప్రిల్ 8వ తేదీన తీర్పు వెలువరించనున్నట్లు పేర్కొంది. అప్పటివరకు కమిషన్ రిపోర్ట్ ఆధారంగా పిటిషనర్లపై చర్యలు తీసుకోరాదని ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగిస్తున్నట్లు స్పష్టం చేసింది. కాళేశ్వరం కమిషన్ నివేదికను సమర్థించుకునే క్రమంలో కోర్టులో వాదనలు వినిపించేందుకు ప్రభుత్వం సీనియర్ న్యాయవాదులను నియమించింది. కేసీఆర్, హరీశ్, జోషి, స్మిత కేసుల కోసం సీనియర్ న్యాయవాదులు అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్‌రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి, నిరంజన్‌రెడ్డి, పమిడిఘంటం శ్రీరఘురాంను నియమించుకుంది.