Share News

కాళేశ్వరానికి తగ్గిన రుణభారం

ABN , Publish Date - Feb 26 , 2026 | 03:12 AM

కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అప్పుల నుంచి ప్రభుత్వానికి కొంత ఉపశమనం లభించింది. రుణాల వడ్డీ రేటు తగ్గడంతోపాటు చెల్లింపు వ్యవధి పెరిగింది.

కాళేశ్వరానికి తగ్గిన రుణభారం

  • 10.90 శాతం నుంచి 7.5 శాతానికి తగ్గిన వడ్డీ.. 10 ఏళ్ల నుంచి 25 ఏళ్లకు పెరిగిన చెల్లింపు వ్యవధి

  • రూ.33 వేల కోట్లను ఏకకాలంలో చెల్లించిన ప్రభుత్వం

  • రూ.27 వేల కోట్ల రుణాల పునర్‌వ్యవస్థీకరణ

హైదరాబాద్‌, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న అప్పుల నుంచి ప్రభుత్వానికి కొంత ఉపశమనం లభించింది. రుణాల వడ్డీ రేటు తగ్గడంతోపాటు చెల్లింపు వ్యవధి పెరిగింది. ఏకకాలంలో రూ.33 వేల కోట్లు చెల్లించి, మరో రూ.27 వేల కోట్లను పునర్‌వ్యవస్థీకరించుకోవడం ద్వారా ప్రభు త్వం ఈ ఉపశమనం పొందింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం ప్రభుత్వం కాళేశ్వరం ఇరిగేషన్‌ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి 10.90శాతం వార్షిక వడ్డీతో రుణం తీసుకుంది. రూరల్‌ ఎలక్ట్రిఫికేషన్‌ కార్పొరేషన్‌(ఆర్‌ఈసీ), పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌(పీఎ్‌ఫసీ) నుంచి ఈ రుణం.. రూ.87,449 కోట్లు మంజూరు కాగా, ఇందులో రూ.71,566 కోట్లు విడుదలయ్యాయి. ఇందులోనే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోత ల పథకానికి కూడా రూ.10 కోట్ల రుణం ఉండగా.. రూ.7722 కోట్లు విడుదలయ్యాయి. ఈ రెండు ప్రాజెక్టులకు కలిపి విడుదలైన రూ.71,566 కోట్ల రుణంలో ఇప్పటిదాకా చెల్లించింది పోను ఇంకా రూ.68,273 కోట్లు చెల్లించాల్సి ఉంది. అయితే వార్షిక వడ్డీని 7.5శాతానికి తగ్గించడానికి కేంద్రం అంగీకరించడంతో రాష్ట్రప్రభుత్వం ఏకకాలంలో రూ.33574.11 కోట్లను చెల్లించిది. మరో రూ.27 వేల కోట్ల రుణాన్ని దీర్ఘకాలిక వాయిదాల కింద పునర్‌వ్యవస్థీకరించుకుంది. దీంతో స్వల్పకాలిక రుణం కాస్తా.. దీర్ఘకాలిక రుణంగా మారింది. ఈ రుణం మెత్తాన్ని వచ్చే 10 ఏళ్లలో చెల్లించాల్సి ఉండగా.. ఈ వ్యవధి 25-30 ఏళ్లకు పెరిగింది. వార్షిక వడ్డీ కూడా 10.90శాతం నుంచి 7.50 శాతానికి తగ్గడంతో ఏటా తిరిగి చెల్లించాల్సి మొత్తం కూడా తగ్గింది. ఇప్పటివరకు ఏటా రూ.13 వేల కోట్లుగా ఉన్న చెల్లింపు మొత్తం రూ.9 వేల కోట్లకు తగ్గనుంది.

Updated Date - Feb 26 , 2026 | 03:12 AM