Share News

కాళేశ్వరం ఆనకట్టలు వినియోగంలోకి తేవాలి

ABN , Publish Date - Jul 16 , 2026 | 06:13 AM

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కన్నెపల్లి, సుందిళ్ల పంప్‌హౌస్‌లను వినియోగంలోకి తెచ్చేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

కాళేశ్వరం ఆనకట్టలు వినియోగంలోకి తేవాలి

  • సాధ్యాసాధ్యాలపై ఎన్‌డీఎస్ఏ తనిఖీకి ఆదేశించాలని పిటిషన్‌

  • కేంద్ర, రాష్ట్రాల వివరణ కోరిన హైకోర్టు

కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కన్నెపల్లి, సుందిళ్ల పంప్‌హౌస్‌లను వినియోగంలోకి తెచ్చేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఎస్‌ శరత్‌కుమార్‌ అనే న్యాయవాది దాఖలు చేసిన ఈ పిటిషన్‌పై జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదిస్తూ.. ప్రస్తుతం కరువు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో కాళేశ్వరం ప్రాజెక్టులోని ఆనకట్టలు, పంప్‌హౌస్‌లను వినియోగంలోకి తేవాలని, వాటిని ఉపయోగించే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయనే అంశంపై నివేదిక సమర్పించేలా నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ)కి ఆదేశాలు జారీ చేయాలని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం.. ‘ ఇది కేవలం సాంకేతికపరమైన అంశం మాత్రమే కాదు. ఇది సున్నితమైన అంశం కూడా.. దీనిపై ఎన్‌డీఎస్ఏ మాత్రమే స్పష్టత ఇవ్వగలదు. ఎన్‌డీఎస్ఏ సూచనలతో కేంద్రం తరఫు న్యాయవాది అయిన అడిషనల్‌ సొలిసిటర్‌ జనరల్‌ విచారణకు హాజరుకావాలి ’ అని పేర్కొంది. ఈ మేరకు వివరణ ఇవ్వాలని పేర్కొంటూ కేంద్ర జలశక్తి, ఎన్‌డీఎస్ఏ ఛైర్మన్‌, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, నీటిపారుదలశాఖ ముఖ్యకార్యదర్శి, ఈఎన్‌సీ, తెలంగాణ రిటైర్డ్‌ ఇంజినీర్ల అసోసియేషన్‌ (టీఆర్‌ఈఏ) తదితర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.

Updated Date - Jul 16 , 2026 | 06:14 AM