Share News

కాళేశ్వరం పేరిట.. లక్ష కోట్లు నీళ్లపాలు

ABN , Publish Date - Mar 31 , 2026 | 05:57 AM

తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని నీళ్లపాలు చేసిందని కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు.

కాళేశ్వరం పేరిట.. లక్ష కోట్లు నీళ్లపాలు

  • రూ.30 వేల కోట్లు ఖర్చు చేశాకే కేంద్రాన్ని ఆశ్రయించారు.. సాంకేతిక అనుమతులే ఇచ్చాం.. నిధులేమీ ఇవ్వలేదు

  • లోపాలపై దర్యాప్తు జరుగుతోంది

  • పార్లమెంట్‌లో సీఆర్‌ పాటిల్‌ వ్యాఖ్యలు

  • ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టు అన్న కాగ్‌

  • బీజేపీ ఎంపీ కె. లక్ష్మణ్‌

న్యూఢిల్లీ, మార్చి 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కాళేశ్వరం పేరుతో రూ.లక్ష కోట్ల ప్రజాధనాన్ని నీళ్లపాలు చేసిందని కేంద్ర జల శక్తి మంత్రి సీఆర్‌ పాటిల్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రాజెక్టుపై రూ.30వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాతే సాంకేతిక అనుమతుల కోసం రాష్ట్ర సర్కారు కేంద్రా న్ని ఆశ్రయించిందని తెలిపారు. బీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేశ్‌ రెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు.. సోమవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో సమాధానం ఇచ్చే క్రమంలో కాళేశ్వరంపై పాటిల్‌ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన(పీఎంకేఎస్వై) కింద తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టుల అభివృద్థికి ఎటువంటి చర్యలు తీసుకున్నారని సురేష్‌ రెడ్డి ప్రశ్నించారు. విభజన సమయంలో కేంద్రం ఇచ్చిన హామీ మేరకు తెలంగాణలో కాళేశ్వరానికి లేదా మరే ఇతర ముఖ్యమైన ప్రాజెక్టుకు అయినా జాతీయ హోదా ఇవ్వాలని ఆయన కేంద్రాన్ని కోరారు. దీనికి సీఆర్‌ పాటిల్‌.. ‘‘సహచర సభ్యుడు తాగునీటికి సంబంధించిన సమస్య పేరుతో ఇరిగేషన్‌ సమస్యను లేవనెత్తారు. అయినప్పటికీ, కాళేశ్వరానికి సంబంధించి జలవనరుల శాఖ పరిధిలోని అంశాలకు సమాధానం ఇస్తాను. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం రూ. 30 వేల కోట్లు ఖర్చు చేసిన తర్వాత అనుమతి కావాలంటూ మా దగ్గరికి(కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ) వచ్చారు. దానికి మేం సాంకేతిక అనుమతులు మాత్రమే ఇచ్చాం. మొదటి నుంచి చివరి వరకూ కాళేశ్వరం ప్రాజెక్టు కోసం కేంద్రం నుంచి ఒక్క రూపాయి తీసుకోలేదు. ప్రస్తుతం ఆ ప్రాజెక్టు పరిస్థితి ఏమిటో దేశం మొత్తానికి తెలుసు. దాదాపు రూ.లక్ష కోట్లకు పైగా ఖర్చు చేసి ఈ ప్రాజెక్టును నిర్మించినట్లు చెబుతున్నారు. ఇప్పుడు ఆ ప్రాజెక్టు నీటిలో కొట్టుకుపోయింది. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్వహణ, అనుమతులు, డిజైన్‌ తదితర అంశాలపై దర్యాప్తు జరుగుతోంది. అయితే, ఆ ఏజెన్సీ దర్యాప్తు నెమ్మదిగా సాగుతోంది. ఈ ప్రాజెక్టు విషయంలో ఏం చెయ్యాలి? ఎలా ముందుకెళ్లాలి? కొత్తగా బోర్‌ వెల్స్‌ వేయాలా? ఇలా అనేక అంశాలను పరిశీలించాల్సి ఉంది. ఈ ప్రాజెక్టు కోసం జల్‌ జీవన్‌ మిషన్‌ నుంచి నిధులేమీ తీసుకోలేదు. అందువల్ల, ఈ ప్రాజెక్టు నిధుల విషయంలో మా దగ్గర ఎటువంటి స్పష్టమైన సమాచారం లేదు. ఇదీ ఒకందుకు మంచిదే?’’ అని బదులిచ్చారు.


కాగ్‌ చెప్పింది..

తెలంగాణలో నీటి పారుదల ప్రాజెక్టుల అభివృద్ధిపై పలు ప్రశ్నలు లేవనెత్తిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌.. కాళేశ్వరం ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలకు సంబంధించి ‘భారత కంప్ర్టోలర్‌, ఆడిటర్‌ జనరల్‌(కాగ్‌) మొదటి నివేదిక - 2024’ లోని అంశాలను ఉటంకించారు. ‘‘కాళేశ్వరం ఆర్థికంగా ఆచరణ సాధ్యమైంది కాదు. ఈ ప్రాజెక్టు వ్యయం ప్రాథమిక అంచనా కన్నా దాదాపు 80 శాతం పెరిగింది. దాదాపు లక్షకోట్లకు పైగా వ్యయం అయ్యింది.’’ అని కాగ్‌ నివేదికలో పేర్కొన్న అంశాలను లక్ష్మణ్‌ చదివి వినిపించారు. జల్‌ జీవన్‌ మిషన్‌తోపాటు ఇతర పథకాల కింద తెలంగాణకు కేంద్రం అందించిన ఆర్థికసాయం గురించి వివరించాలన్నారు. దీనికి కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌.. కాగ్‌ నివేదికలకు రాష్ట్రాలే జవాబుదారీగా ఉంటాయని తెలిపారు. జల్‌ జీవన్‌ మిషన్‌ నిధుల వినియోగంలో తెలంగాణ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని అన్నారు. ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయీ తీసుకోలేదని, అందుకే.. సంబంధిత సమచారం ఏదీ తమవద్ద లేదన్నారు. గత మూడేళ్లుగా ఈ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదనలూ రాలేదని తెలిపారు. అయినప్పటికీ, ‘పర్‌ డ్రాప్‌ మోర్‌ క్రాప్‌’ (పీడీఎంసీ) కింద తెలంగాణకు మొత్తం రూ. 873.95 కోట్లు కేటాయించామని వివరించారు. అందులో రూ.194.63 కోట్లు గత మూడేళ్లలో అందించినట్లు వివరించారు. అందుకే, ‘‘జల్‌ సించాయి, జల్‌ భాగీధారి కార్యక్రమాల్లో తెలంగాణ అద్భుతమైన పనితీరు కనబరిచింది. ప్రోత్సాహకంగా తెలంగాణకు అధిక నిధులతోపాటు, రూ. 2 కోట్ల బహుమతి ఇచ్చాం.’’ అని తెలిపారు. కేంద్రం నిధులిస్తామని చెప్పినా తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడం, కేంద్ర ప్రభుత్వానికి నివేదికలు పంపకపోవడం బాధాకరమని లక్ష్మణ్‌ వ్యాఖ్యానించారు. ’

సీబీఐతో దర్యాప్తు జరిపించాలి: అనిల్‌కుమార్‌ యాదవ్‌

పార్లమెంట్‌ సాక్షిగా బీజేపీ, బీఆర్‌ఎస్‌ బంధం మరోసారి బహిర్గతమైందని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు మందాడి అనిల్‌కుమార్‌ యాదవ్‌ విమర్శించారు. కాళేశ్వరం, జల్‌జీవన్‌ నిధుల విషయం లో కాంగ్రెస్‌ ప్రభుత్వంపై నెపాన్ని నెట్టేందుకు ఆ రెండు పార్టీలూ యత్నిస్తున్నాయని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపలేదని బీజేపీ ఎంపీ లక్ష్మణ్‌ అనడం, రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర పథకాలను అమలు చేయడం లేదని బీఆర్‌ఎస్‌ ఎంపీ సురేశ్‌ రెడ్డి ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మాటలను చూస్తే.. ఆ రెండు పార్టీల స్నేహం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోందన్నారు. సీబీఐ దర్యాప్తుజరపాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిందని, దీనిపై కేంద్రం ఎందుకు జాప్యం చేస్తోం దో చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇకనైనా, కాళేశ్వరంపై సీబీఐ విచారణ జరపాలని కేంద్రాన్ని కోరారు. దీనికి సీఆర్‌ పాటిల్‌.. సీబీఐ దర్యాప్తు తన పరిధిలోని అంశం కాదని అన్నారు.

Updated Date - Mar 31 , 2026 | 05:57 AM