Share News

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం

ABN , Publish Date - Apr 23 , 2026 | 04:43 AM

కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ తీవ్రంగా స్పందించింది.

రాష్ట్ర ప్రభుత్వ అసమర్థతకు నిదర్శనం

  • కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి

  • రేవంత్‌ రెడ్డి, కేసీఆర్‌ మధ్య లాలూచీ రాజకీయాలు : బండి సంజయ్‌

  • సీఎం, మాజీ సీఎం మధ్య డూప్‌ ఫైట్‌ : రఘునందన్‌రావు

న్యూఢిల్లీ, హైదరాబాద్‌, ఏప్రిల్‌ 22(ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టులో అవకతవకలపై జస్టిస్‌ పీసీ ఘోష్‌ కమిషన్‌ ఇచ్చిన నివేదికకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలపై బీజేపీ నేతలు కిషన్‌ రెడ్డి, బండి సంజయ్‌, రఘునందన్‌రావు విమర్శలు చేశారు. హైకోర్టు తీర్పు కాంగ్రెస్‌కు చెంపపెట్టులాంటిదని, ప్రభుత్వ అసమర్థత, నిర్లక్ష్యానికి నిదర్శనమని కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్‌రెడ్డి విమర్శించారు. కాళేశ్వరంలో భారీ అవినీతి జరిగినట్లు ఆధారాలు ఉన్నప్పటికీ.. వాటిని చట్టపరంగా కోర్టు ముందు ప్రవేశపెట్టడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని అన్నారు. దానివల్లే కమిషన్‌ నివేదిక ఆధారంగా తదుపరి చర్యల విషయంలో హైకోర్టు తీర్పు ఇచ్చిందని తెలిపారు. అధికారంలోకి రాగానే కేసీఆర్‌, వారి కుటుంబ సభ్యులు, మంత్రులు, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు చేసిన అవినీతిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎన్నికల సమయంలో సీఎం రేవంత్‌ హామీ ఇచ్చారన్నారు. కానీ అధికారం చేపట్టి రెండేళ్లు దాటినా.. ఇరుపార్టీల మధ్య ఉన్న దోస్తీ వల్లే సీఎం రేవంత్‌ చర్యలు తీసుకోవడం లేదని కిషన్‌ రెడ్డి ఆరోపించారు. ప్రజాక్షేత్రంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ‘డూప్‌ ఫైటింగ్‌’ చేస్తూ.. ‘నేను గిచ్చినట్లు చేస్తా, నువ్వు ఏడ్చినట్లు చెయ్యు’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో రాహుల్‌ గాంధీ, సీఎం రేవంత్‌ రెడ్డి రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలని కిషన్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు. ఇక, కేసీఆర్‌ను కాపాడేందుకు సీఎం రేవంత్‌ రెడ్డి శతవిధాలా ప్రయత్నిస్తున్నారని, ఇరువురి మధ్య లాలూచీ రాజకీయాలు నడుస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్‌ ఆరోపించారు. కాళేశ్వరం కుంభకోణం అంశంలో రూ.లక్ష కోట్ల అవినీతిపై కాకుండా కేవలం రూ.9వేల కోట్ల పైనే విచారణ జరపాలని ప్రభుత్వం సీబీఐకి లేఖ రాయడం అనుమానాలకు తావిస్తోందని అన్నారు. హైకోర్టులో సరైన వాదనలు వినిపించడంలో ప్రభుత్వం విఫలమైందని అన్నారు.


పీసీ ఘోష్‌ కమిషన్‌ టర్మ్స్‌ ఆఫ్‌ రిఫరెన్స్‌ను పరిశీలిేస్త విచారణను పరిమితం చేేస ప్రయత్నం స్పష్టంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. ఢిల్లీ కాంగ్రెస్‌ నేతలకు డబ్బుల మూటలు చేరుతున్నాయని, అందుకే ఇక్కడ కేసులు మూసేసేలా కాంగ్రెస్‌ పార్టీ విచారణను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. ఇక, సీఎం రేవంత్‌ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్‌ మధ్య డూప్‌ ఫైట్‌ జరుగుతోందని బీజేపీ ఎంపీ రఘునందన్‌రావు దుయ్యబట్టారు. పీసీ ఘోష్‌ కమిషన్‌ పేరుతో రెండేళ్లు వృఽథా చేశారని. బాధ్యులకు నోటీసులు కూడా ఇవ్వలేదని విమర్శించారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై మాత్రమే సీబీఐ విచారణ అడగడంలో అర్థమేంటని ప్రశ్నించారు. కేసీఆర్‌ హయాంలో కాళేశ్వరం కట్టిన కంపెనీకే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మూసీ ప్రాజెక్టును కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని ఆరోపించారు. రేవంత్‌ను జైల్లో పెట్టి కేసీఆర్‌ కక్ష సాధిస్తే.. అధికారంలోకి వచ్చిన రేవంత్‌లో తెలంగాణ పౌరుషం ఏడ సచ్చిందో? తెలియట్లేదని అన్నారు. కాళేశ్వరం పేరిట రూ.లక్ష కోట్ల అవినీతి జరిగిందని కేసీఆర్‌ కుమార్తె కవిత చెప్పినప్పటికీ సీఎం రేవంత్‌ ఎందుకు చర్యలు తీసుకోవట్లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం అవినీతిపై సీబీఐ విచారణ కోరుతూ కేంద్ర హోంమంత్రికి సీఎం రేవంత్‌ మూడు లైన్ల లేఖ రాయాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - Apr 23 , 2026 | 04:43 AM