బ్యారేజీల పునరుద్ధరణకు పరీక్షలు
ABN , Publish Date - Apr 18 , 2026 | 04:31 AM
కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరించాలని నిర్ణయించిన ప్రభుత్వం..
43 రోజుల్లో పరీక్షలన్నీ పూర్తి చేయాలని నిర్ణయం.. పరిక్షిత్ మెహ్రా నేతృత్వంలో సమన్వయ కమిటీ
హైదరాబాద్, ఏప్రిల్ 17 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను పునరుద్ధరించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. ఇందుకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. ముందుగా బ్యారేజీల వైఫల్యానికి కారణాలు తెలుసుకోవడానికి పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఆపై బ్యారేజీల పునరుద్ధరణ కోసం అవసరమైన డిజైన్లు/డ్రాయింగ్‌లు చేయించనుంది. అనంతరం పునరుద్ధరణ పనులు చేపట్టనుంది. ఇందుకోసం తొమ్మిది మంది అఽధికారులతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీకి టన్నెలింగ్ విభాగం కార్యదర్శి కల్నల్ పరిక్షిత్ మెహ్రా చైర్మన్‌గా వ్యవహరించనున్నారు. ఈ మేరకు నీటిపారుదల శాఖ కార్యదర్శి ఇ.శ్రీధర్ మెమో జారీ చేశారు. మూడు బ్యారేజీల్లో పరీక్షలన్నీ మే 30వ తేదీలోగా (43 రోజుల్లో) పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ పరీక్షల నివేదిక ఆధారంగా ఆఫ్రీ ఇండియా సంస్థతో పునరుద్ధరణ డిజైన్లను సిద్ధం చేయించడం, ఆ డిజైన్లకు జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ (ఎన్‌డీఎస్ఏ), కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) ఆమోదం తీసుకోవడం ఈ కమిటీ బాధ్యత. భూ భౌతిక, భూ సాంకేతిక పరీక్షల పురోగతిపై ప్రతి సోమ, గురువారాల్లో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి సమగ్ర నివేదిక అందించాల్సి ఉంటుంది.
మే 31 కల్లా నాన్ డిస్ట్రక్టివ్ టెస్టులు..
బ్యారేజీల్లో కాంక్రీట్ పటుత్వంతోపాటు ఇతరత్రా కాంపోనెంట్లు ఏ విధంగా ఉన్నాయనే నాన్ డిస్ట్రక్టివ్ పరీక్షలు ఈ నెల 10 నుంచి మే 31 కల్లా పూర్తి.
బ్యారేజీల్లో భూభౌతిక, భూసాంకేతిక పరీక్షల కోసం 100కు పైగా రిగ్ బోర్‌వెల్స్‌ను సమకూర్చుకోవాలని నిర్ణయం. మేడిగడ్డలో 35, అన్నారంలో 20, సుందిళ్లలో 20 రిగ్ బోర్‌వెల్స్‌ను ఈ నెల 10 నుంచి 26లోపు సమకూర్చుకోనున్నారు.
ఈ నెల 20 నుంచి జూన్ 10 దాకా బోర్ హోల్స్ కోసం డ్రిల్లింగ్ చేయనున్నారు. మేడిగడ్డలో 15 మీటర్ల మేర 110 మిల్లీమీటర్ల డయాతో 46 హోల్స్, 30 మీటర్ల మేర 76 మిల్లీ మీటర్ల డయాతో 458 హోల్స్ కలిపి 504 హోల్స్ వేయాలని నిర్ణయం. ఆ తర్వాత సుందిళ్లలో 15 మీటర్ల మేర 110 మిల్లీమీటర్ల డయాతో 42 హోల్స్, 30 మీటర్ల మేర 76 మిల్లీమీటర్ల డయాతో 188 హోల్స్ కలిపి 230 హోల్స్ వేయనున్నారు. అన్నారంలో 15 మీటర్ల మేర 110 మిల్లీమీటర్ల డయాతో 89 హోల్స్, 30 మీటర్ల మేర 76 మిల్లీమీటర్ల డయాతో 192 హోల్స్ కలిపి 281 హోల్స్ వేయనున్నారు. మూడు బ్యారేజీల్లో 1015 బోర్‌హోల్స్ వేయనున్నారు.
బోర్‌హోల్స్ వేశాక వాటిలో పరీక్షల ప్రక్రియను ఈ నెల 30 నుంచి జూలై 15 వరకు చేపట్టనున్నారు.
ఈ నెల 10 నుంచి 30 వరకు టెయిల్ వాటర్ రేటింగ్ కర్వ్ .
జూన్ 1 నుంచి జూలై 31 దాకా మేడిగడ్డలో 2డీ(లోతు, వెడల్పు)తో కూడిన నమూనా అధ్యయనం.
జూన్ 1 నుంచి జూలై 31 దాకా అన్నారం, సుందిళ్ల బ్యారేజీల్లో నీటి ప్రవాహం, ఒత్తిడి, వరద ప్రవాహ వేగంపై అంచనా కోసం సీఎ్‌ఫడీ పరీక్ష. బ్యారేజీల గేట్ల నుంచి వరద ప్రవాహ వేగం ఏ విధంగా ఉంది? గేట్లపై పడే ఒత్తిడిని, సురక్షితమైన గేట్ల కోసం, కాంక్రీట్ నిర్మాణానికి వరద ప్రవాహంతో జరిగే నష్టాన్ని అంచనా వేయడానికి వీలుగా ఈ పరీక్ష చేస్తారు.
మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల వద్ద మానవ వనరుల సమీకరణ, క్యాంప్‌ను ఏర్పాటు చేసే ప్రక్రియను జూలై 15 నుంచి సెప్టెంబరు 15 దాకా పూర్తి చేస్తారు.
ఆగస్టు 1నుంచి అక్టోబరు 20 దాకా బ్యారేజీల పునరుద్ధరణ పనుల కోసం డిజైన్‌ల తయారీ ప్రక్రియను చేపట్టడం.
జూలై 21 నుంచి అక్టోబరు 30 వరకు మేడిగడ్డలో 2డీ(లోతు, వెడల్పుతో) కూడిన నమూనా అధ్యయనం.
అక్టోబరు 31 కల్లా డిజైన్‌లు సిద్ధం.ఫ బ్యారేజీల పునరుద్ధరణ కోసం నవంబరు 16 నుంచి 30 వరకు ఎఫ్‌ఎఫ్‌సీ డ్రాయింగ్‌ల జారీ.
కమిటీ సభ్యులు వీరే
సమన్వయ కమిటీలో సభ్యులుగా నీటిపారుదల శాఖ సంయుక్త కార్యదర్శి (టెక్నికల్) కె.శ్రీనివాస్, సీడీవో చీఫ్ ఇంజనీర్ ఎంఎస్ఎన్ రెడ్డి, కేంద్ర నీటి, విద్యుత్ పరిశోధన కేంద్రం (సీడబ్ల్యూపీఆర్‌ఎస్) అదనపు డైరెక్టర్ సెల్వబాలన్, అఫ్రీ ఇండియా ఎండీ సాయికృష్ణ, ఎల్ అండ్ టీ (మేడిగడ్డ నిర్మాణ సంస్థ) జనరల్ మేనేజర్ ఎస్.సురేష్ కుమార్, అఫ్కాన్స్ (అన్నారం నిర్మాణ సంస్థ) వైస్ ప్రెసిడెంట్ మల్లికార్జున్‌రావు, నవయుగ (సుందిళ్ల నిర్మాణ సంస్థ) ప్రాజెక్టు మేనేజర్ మాధవ్, మెంబర్ కన్వీనర్‌గా రామగుండం సీఈ టి.శ్రీనివాసరావు గుప్తా ఉండనున్నారు. ఇక ఈ కమిటీకి అవసరమైన సహాయ సహకారాలు అందించడానికి వీలుగా డిప్యూటీ చీఫ్ ఇంజనీర్ (గోదావరి బేసిన్) అజ్మల్‌ఖాన్, రామగుండం సీఈ కార్యాలయ కన్సల్టెంట్ యాదగిరి ఉండనున్నారు.