Share News

వరదలకు ముందే కాళేశ్వరంలో పరీక్షలు

ABN , Publish Date - Apr 18 , 2026 | 04:35 AM

కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గోదావరి వరదలు వచ్చేలోపే మేడిగడ్డ, అన్నారం...

వరదలకు ముందే కాళేశ్వరంలో పరీక్షలు

  • వానాకాలం తరువాత వేగంగా పునరుద్ధరణ

  • శాస్త్రీయ పద్ధతుల్లో బ్యారేజీల మరమ్మతు

  • 20న బ్యారేజీల పరిశీలనకు సీఎం రేవంత్‌రెడ్డి

  • ప్రాజెక్టుపై ప్రభుత్వానికి దురుద్దేశం లేదు: ఉత్తమ్‌

  • నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ చైర్మన్‌తో మంత్రి భేటీ

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 17 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టిందని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. గోదావరి వరదలు వచ్చేలోపే మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి అన్ని పరీక్షలు పూర్తి చేస్తామని చెప్పారు. వానాకాలం తర్వాత శరవేగంగా పునరుద్ధరణ పనులు చేపడతామని, పూర్తిగా శాస్త్రీయ ప్రమాణాలకు లోబడి చేస్తామని అన్నారు. భవిష్యత్తులో 50 నుంచి 100 ఏళ్లపాటు బ్యారేజీలు సురక్షితంగా ఉండేలా పటిష్ఠంగా పనులు చేస్తామన్నారు. దీనికోసం ఎన్‌డీఎస్ఏ, సీడబ్ల్యూసీ అధికారులతో సమన్వయం చేసుకుంటూ, ఐఐటీ ముంబయి నిపుణుల సహకారంతో అధునాతన పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. ఈ నెలాఖరులోగా భూసార పరీక్షలు పూర్తి చేస్తామన్నారు. 20న ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి స్వయంగా బ్యారేజీలను పరిశీలిస్తారని తెలిపారు. కాళేశ్వరం విషయంలో ప్రభుత్వానికి ఎటువంటి దురుద్దేశాలు లేవని, ప్రజాధనంతో నిర్మించిన ప్రాజెక్టును సమర్థంగా ప్రజలకు ఉపయోగపడేలా చేస్తామని స్పష్టం చేశారు. శుక్రవారం ఢిల్లీలో నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ (ఎన్‌డీఎస్ఏ) చైర్మన్‌ అనిల్‌ జైన్‌తో మంత్రి ఉత్తమ్‌ భేటీ అయ్యారు. బ్యారేజీల మరమ్మతు, పునరుద్ధరణకు సంబంధించి ప్రభుత్వ కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. గతంలో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా ప్రభుత్వం తీసుకుంటున్న ముందస్తు జాగ్రత్తలను వివరించారు. అనంతరం ఆ వివరాలను ఉత్తమ్‌ మీడియాకు వివరించారు. ప్రస్తుతం.. నిపుణుల ఆధ్వర్యంలో పరీక్షలు నిర్వహిస్తున్న తీరుపై ఎన్‌డీఎ్‌సఏ చైర్మన్‌ సంతృప్తి వ్యక్తం చేశారని, త్వరలోనే బ్యారేజీల సందర్శనకు వస్తానని చెప్పారని తెలిపారు.

నిపుణులను ఇప్పటికే నియమించాం..

కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ ప్రక్రియలో భాగంగా ఇప్పటికే నిపుణులను నియమించామని మంత్రి ఉత్తమ్‌ తెలిపారు. డిజైనింగ్‌, టెస్టింగ్‌ సంస్థలు రంగంలోకి దిగాయన్నారు. ‘‘డిజైన్‌కు ముందు అవసరమైన పరీక్షలను సీడబ్ల్యూపీఆర్‌ఎస్‌ సంస్థ చేస్తుంది. బ్యారేజీల పునరుద్ధరణ కోసం జీపీఆర్‌ (గ్రౌండ్‌ పెనెట్రేటింగ్‌ రాడార్‌) స్కానింగ్‌, డ్రోన్‌ సర్వేలు, బోర్‌ హోల్స్‌, జియో టెక్నికల్‌, జియో ఫిజికల్‌ పరీక్షలతో భూమి, అక్కడ నిర్మాణాల సామర్థ్యం ఎలా ఉందో తెలుసుకుంటుంది. వివిధ సంస్థల మధ్య సమన్వయం కోసం సెంట్రల్‌ కోఆర్డినేషన్‌ కమిటీని ఏర్పాటు చేశాం’’ అని ఉత్తమ్‌ వివరించారు.

Updated Date - Apr 18 , 2026 | 04:35 AM