కాళేశ్వరం బ్యారేజీల పరీక్షల్లో తీవ్ర జాప్యం!
ABN , Publish Date - Jun 05 , 2026 | 04:31 AM
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు అవసరమైన పరీక్షల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. పరీక్షలన్నీ పూర్తిచేసి, డిజైన్లు సిద్ధం చేశాక మరమ్మతులకు ఉపక్రమించాలనే ....
నిర్దేశిత గడువులోగా పూర్తయ్యే అవకాశాల్లేవు
హైదరాబాద్, జూన్ 4 (ఆంధ్రజ్యోతి): కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణకు అవసరమైన పరీక్షల్లో తీవ్ర జాప్యం చోటుచేసుకుంటోంది. పరీక్షలన్నీ పూర్తిచేసి, డిజైన్లు సిద్ధం చేశాక మరమ్మతులకు ఉపక్రమించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం నెరవేరేలా లేదు. నిర్దేశిత షెడ్యూల్ ప్రకారం మేడిగడ్డలో 458 బోర్‌హోల్స్‌తో కలిపి మూడు బ్యారేజీల్లో మొత్తం 1015 బోర్ హోల్స్ వేయాలని భావించారు. మేడిగడ్డలో కాంక్రీట్ నిర్మాణం ఎలా ఉందనే దానిపై 15 బోర్ హోల్స్ వేయాలని టార్గెట్ పెట్టుకోగా.. ఒక్కటి కూడా వేయలేదు. ఇక 66 కోన్ పెనట్రేషన్ టెస్ట్‌లు చేయాలని నిర్ణయించగా.. ఒక్కటి కూడా పూర్తికాలేదు. బ్యారేజీ ఎగువ, దిగువ భాగంలో సీకెంట్ పైల్స్ కటా్‌ఫపై క్రాస్ హోల్ సెస్మిక్ పరీక్షల్లో భాగంగా 417 బోర్ హోల్స్ వేయాల్సి ఉండగా.. 12 మాత్రమే వేసి, తదుపరి పరీక్షల కోసం జాతీయ ఆనకట్టల భద్రత సంస్థ(ఎన్‌డీఎస్ఏ) అనుమతి తీసుకోవాలని నిర్ణయించారు. 417 బోర్ హోల్స్ వేస్తే.. మేడిగడ్డ బ్యారేజీ పూర్తిగా దెబ్బతింటుందనే భయంతో దీన్ని పాక్షికంగా వేసి, పక్కనపెట్టారు. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి షీట్‌పైల్స్ బదులుగా సీకెంట్ పైల్స్ వినియోగమే కారణమని ఎన్‌డీఎ్‌సఏ గుర్తించింది. ఈ నెల 10 కల్లా 85 గేట్ల వద్ద గ్రౌండ్ పెనట్రేటింగ్ పరీక్ష జరగాల్సి ఉండగా.. 60 మాత్రమే పూర్తయ్యాయి. సీపేజీ అంచనా కోసం 15లోగా 45 బోర్ హోల్స్ వేయాల్సి ఉండగా.. ఒక్కటీ వేయలేదు. వాస్తవానికి ఏటా జూన్ నెలాఖరులోగా లేదా జూలై మొదటి వారంలో మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రారంభమవుతుంది. ఈ వరదల సమయంలో హైడ్రాలిక్ అధ్యయనాలు మాత్రమే పూర్తయ్యే అవకాశాలున్నాయి. ఒక్కసారి వరద ప్రారంభమైతే పరీక్షలు అంత సులభం కాదు. ఇక పునరుద్ధరణ డిజైన్లకు అవసరమైన పరీక్షలు 2027 మార్చి నుంచి జూన్‌లోపు పూర్తి చేస్తే.. డి జైన్లు 2027 చివర్లో పూర్తయ్యే అవకాశాలున్నాయి. అంటే మరమ్మతులు 2028లోనే జరిగే అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు.